
గ్రేటరే..టాప్
గ్రేటర్ హైదరాబాద్‌లో నియోజకవర్గాల సంఖ్య పెరగనుంది. పునర్విభజన అనంతరం ఇప్పుడున్న స్థానాలకు అదనంగా మరికొన్ని వచ్చిచేరనున్నాయి. అయితే ఎన్ని నియోజకవర్గాలు పెరగనున్నాయి అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.పునర్విభజనలో భారీగా పెరగనున్న నగర ప్రాతినిధ్యం 2001 ప్రామాణికమైతే హైదరాబాద్‌లో 19, రంగారెడ్డిలో 18 నియోజకవర్గాలు 2011 తీసుకుంటే.. రంగారెడ్డిలో 23, హైదరాబాద్‌లో 17 స్థానాల ఏర్పాటు నాలుగు లోక్‌సభ స్థానాల సరిహద్దుల్లోనూ మార్పులు చేర్పులు
సిటీబ్యూరో: శాసనసభ స్థానాల పునర్విభజనలో గ్రేటర్ హైదరాబాదే అత్యధిక స్థానాలతో అగ్రభాగాన నిలువనుంది. ఇప్పటికే 24 నియోజకవర్గాలుండగా, పునర్విభజన జరిగితే శాసనసభ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది. అయితే పునర్విభజన కమిషనర్ 2001 జనాభాను పరిగణలోకి తీసుకుంటే అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 19 స్థానాలు, 2011 జనాభాను తీసుకుంటే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 23 స్థానాలు ఏర్పాటవుతాయి. త్వరలో పునర్విభజన పని మొదలవుతుందన్న సంకేతాలు కేంద్రం నుండి వెలువడటంతో నగరంలోనూ రాజకీయ చర్చలు - లెక్కలు, తీసివేతలు జోరందుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం జనాభాను పరిగణలోకి తీసుకుని కొత్త నియోకజవర్గాల ఏర్పాటు చేయనున్నారు.
భారీగా పెరగనున్న నియోకజవర్గాలు
2001 జనాభాను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతమున్న 14 నియోజకవర్గాల స్థానే 18 ఏర్పాటవుతాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, శేరిలింగపల్లి, ఉప్పల్ నియోజకవర్గాలను విడదీసి కొత్తగా మరో నాలుగు నియోకజవర్గాలు ఏర్పాటు కానున్నాయి. అదే హైదరాబాద్‌కు వచ్చే సరికి కొత్తగా మరో నాలుగు నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో రెండు, సికింద్రాబాల్ లోక్‌సభ పరిధిలో రెండేసి చొప్పున కొత్త నియోకజవర్గాలు ఏర్పాటవుతాయి.
ఏ జనాభా..ప్రామాణికం ..!
త్వరలో చేపట్టబోయే పునర్విభజనకు ఏ జనాభా లెక్కలు ప్రామాణికంగా తీసుకోబోతున్నారన్న అంశం ఆసక్తికరంగా మారిది. 2001 తీసుకుంటే రంగారెడ్డి జిల్లాలో కేవలం 4 స్థానాలే పెరుగుతాయి. 2011 తీసుకుంటే ఏకంగా తొమ్మిది స్థానాలు పెరుగుతాయి. అయితే దేశంలో 2000 సంవత్సరంలో కొత్తగా ఏర్పడ్డ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పునర్విభజన చేసే సమయంలో 1981,1991 జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నా, అక్కడ 1971 జనాభా లెక్కలనే పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2026 వరకు 2001 జనాభా లెక్కల మేరకే జస్టిస్ కుల్దీప్‌సింగ్ ఆధ్వర్యంలో పునర్విభజన కమిషన్ నియోజకవర్గాల్లో చేర్పులు మార్పులు చేసిన దృష్ట్యా, ఏపీ, తెలంగాణాలోనే చేపట్టబోయే పునర్విభజనకు 2001 లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటారని పునర్విభజన విశ్లేషకులు ఆర్.జ్యోతిర్మయరెడ్డి అభిప్రాయపడ్డారు. 2001 జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకుంటే రంగారెడ్డి జిల్లాలో కేవలం నాలుగు స్థానాలు పెరుగుతాయి. అదే 2011 జనాభా తీసుకుంటే ఏకంగా తొమ్మిది స్థానాలు, అవీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే పెరుగుతుండటం విశేషం.
పునర్విభజన సాగేదిలా
పరిగణలోకి తీసుకునే జనాభా లెక్కల మేరకు శాసనసభ స్థానాల పునర్విభజన జరుగుతుంది. 2011 లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674 (ఖమ్మం జిల్లా నుండి ఏపీకి వెళ్లిన ప్రాంతాలను మినహాయిస్తే) గా తేల్చారు. ఇదే 2001 లెక్కలు తీసుకుంటే 3,08,05,599 గా తేలింది. దీంతో మొత్తం జనాభాను 153 నియోకజవర్గాలకు విభజిస్తే వచ్చే సగటు మేరకు నియోకజవర్గాల ఏర్పాటు జరుగుతుంది. అంటే 153 నియోకజవర్గాలకు రాష్ట్ర జనాభా సగటు తీసకుని శాసనసభ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తారు..అయితే పునర్విభజన చట్టం మేరకు ప్రత్యేక పరిస్థితుల్లో నియోకజవర్గ జనాభా రాష్ట్ర సగటు కంటే 10 శాతం తక్కువ లేదా 10 శాతం ఎక్కువతోనైనా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది.
2001 లెక్కలే ప్రామాణికం..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్న నియోజకవర్గాలు 2001 జనాభా లెక్కల మేరకు విభజించినవే.2031వరకు 2001 జనాభానే ప్రామాణికంగా తీసుకుంటారు. ఉత్తరాఖండ్‌లో 2000లో చేసిన నియోజకవర్గాల పునర్విభజనకు 1981, 1991 జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నా, 1971 లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నారు. - జ్యోతిర్మయరెడ్డి, విషయనిపుణులు