
దొంగలు బాబోయ్
సిటీలో పెరిగిపోతున్న దొంగతనాలు
కునుకు తీస్తే ఇల్లు గుల్లే..
ఎండలు ముదిరితే మరింత పెరిగే అవకాశం
పట్టించుకోని పోలీస్ యంత్రాంగం
ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలు నగరవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కష్టించి కూడబెట్టిన సొమ్ము కనుమరుగు కావడం ఖాయంగా మారింది. సీసీఎస్ బలోపేతంతో దొంగలు నగరంవైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించరని పోలీసు పెద్దలు చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలాయి.
విజయవాడ సిటీ : నగరంలో వేసవి ప్రారంభానికి ముందే దొంగలు పంజా విసురుతున్నారు. భానుడి ప్రతాపం నుంచి సేదతీరేందుకు తలుపు దగ్గరకు వేసుకుంటే చాలు దర్జాగా పని పూర్తి చేసుకుని వెళ్తున్నారు. కిటికీ తెరిచినా అందుబాటులో వస్తువులు, సెల్‌ఫోన్లు మాయం చేసేస్తున్నారు. రాకపోకలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, ఇరుకైన ఇళ్లు, ఆపై వీధులు, నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించే పోలీసుల పనితీరు వెరసి దొంగల దండయాత్రకు మార్గం సుగమమవుతోంది. అంతర్రాష్ట్ర నేరస్తుడు ప్రకాష్ కుమార్ సాహూ లాంటి కరుడుగట్టిన నేరస్తుడి రాకను సైతం పోలీసులు పసిగట్టలేకపోవడం సీసీఎస్ నిఘా నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.
చోరీల జోరు
గతంతో పోలిస్తే ఇటీవల ఇళ్లు, షాపు దొంగతనాలు భారీగా పెరిగాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే నిండు వేసవిలో పరిస్థితి ఏమిటో అర్థంకాక నగరవాసులు భయపడిపోతున్నారు. సాధారణ రోజుల్లో నెలకు సగటున 20 వరకు చోరీలు జరిగితే, వేసవిలో 35 వరకు ఉంటాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చోరీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2013లో 69 దోపిడీలు జరిగితే, 323 దొంగతనాలు, 2116 ఇతర చోరీలు, 2014లో 44 దోపిడీలు, 324 దొంగతనాలు, 1901 ఇతర చోరీలు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు నాలుగు దోపిడీలు, 56 దొంగతనాలు, 365 ఇతర చోరీలు జరిగాయి. వేసవి తీవ్రతకు తోడు చోరీలు కూడా భారీగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
క్రైం పోలీసులు.. కాదుకాదు సీసీఎస్..
చోరీ జరిగితే ఎవరిని కలవాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతంలోని క్రైం పోలీసు స్టేషన్లను ఎత్తేసి సీసీఎస్‌ను కేంద్రీకృతం చేశారు. ఇందులో భాగంగా వన్‌టౌన్‌లో ఇళ్లల్లోనూ, షాపుల్లోనూ జరిగేచోరీలు, గవర్నరుపేటలో చైన్ స్నా చింగ్స్, మోటారు సైకిళ్ల చోరీలు, మాచవరంలో నకిలీ బంగారం, సూర్యారావుపేటలో చిల్లర చోరీ లకు సంబంధించిన విభాగాలను ఏర్పాటు చేశారు. నేరం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి సీసీఎస్‌కు బదలాయించి చేతులు దులుపుకొంటున్నారు. అడిగిన వారికి సీసీఎస్‌కు వెళ్లమంటూ సలహా ఇస్తున్నారు. సూర్యారావుపేట వెళ్తే.. వన్‌టౌన్ అంటూ.. అక్కడికి వెళితే మరోచోటికి అంటూ తిప్పుకొంటున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
సీసీఎస్ డొల్లతనం
పునర్‌వ్యవస్థీకరణ తర్వాత సీసీఎస్ డొల్లతనం బయటపడుతోంది. సమాచార సేకరణ, విశ్లేషణ, దర్యాప్తు, రికవరీ, దొంగతనాల నివారణా విభాగాలుగా విభజించారు. ఎప్పటికప్పుడు నేరస్తుల సమాచారం సేకరించడం, వారి రాకపోకలను విశ్లేషించుకుని దర్యాప్తు చేసి అరెస్టు చేయడంతో పాటు సొత్తు రికవరీ ప్రధాన బాధ్యత. ఇదే సమయంలో ప్రజలకు చోరీలపై అవగాహన కలిగించి నిలువరించడం ముఖ్యమైన విధి. సమాచార మార్పిడి కోసం కోస్తా జిల్లాల క్రైం అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. సమాచార సేకరణ ద్వారా నేరగాళ్లను కట్టడి చేయడమే ప్రధానంగా సమావేశం సాగింది. పొరుగు జిల్లాలతో సమావేశం సంగతి అలా ఉంచితే.. సీసీఎస్‌లోని విభాగాల పనితీరు ఏంటనేది పోలీసు అధికారులే చెప్పలేకపోతున్నారు. సమాచార సేకరణకు ఇన్‌ఫార్మర్ల వ్యవస్థ సక్రమంగా లేదని తెలుస్తోంది. అధికారుల స్థాయిలో తీసుకునే నిర్ణయాలు, అమలుకు సంబంధించిన కార్యాచరణ, ఆర్థిక వనరులు సమకూర్చడం వంటి లోపాల కారణంగా దొంగల పట్టివేత కష్టంగా పరిణమించిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దొంగతనాల నివారణ విభాగం ప్రారంభంలో కొంత హడావుడి చేసినా ప్రస్తుతానికి అలికిడి లేదు.
గతనెల 22వ తేదీ అర్ధరాత్రి ఇంటి తలుపులు మూసి నిద్రపోయాం. ఉదయం మేల్కొని చూస్తే వెనుక వైపు తలుపులు తెరిచి ఉన్నాయి. పరిశీలిస్తే 11 కాసుల బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఇన్ని రోజులు గడిచినా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. అదేమంటే విచారణ జరుపుతున్నామనే సమాధానం మినహా అడుగు ముందుకు పడటం లేదు.
- కొమరవోలు భరత్‌కుమార్, వాటర్ ప్లాంట్ యజమాని, కృష్ణలంక
మా ఇంట్లో చోరీ జరిగి రోజులు గడిచినా దొంగల ఆచూకీ లేదు. పోలీసులు కూడా మా కేసుపై పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. విశ్రాంత జీవితం గడిపే సమయంలో ఉన్నదంతా దొంగలు ఊడ్చుకుపోయారు. పోయిన సొత్తు ఎప్పుడు దొరుకుతుందో..
- డీవీకే రాజు, విశ్రాంత ఉద్యోగి, బాపనయ్యనగర్