అనకాపల్లికి జిల్లా చాన్‌‌స? | district chance to anakapalli | Sakshi
Sakshi News home page

అనకాపల్లికి జిల్లా చాన్‌‌స?

Published Sun, May 25 2014 2:15 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

అనకాపల్లికి జిల్లా చాన్‌‌స? - Sakshi

అనకాపల్లికి జిల్లా చాన్‌‌స?

- బెల్లంపల్లి కేంద్రంగా రూరల్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన
- విశాఖను రెండుగా విభజించే అవకాశం
- ఉత్తరాంధ్రలో ఇక్కడే అవకాశం

 
 అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లి మరో మైలురాయికి చేరువయ్యింది. భౌగోళిక పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పటికే పలు ప్రాధాన్యతలను సొంతం చేసుకున్న అనకాపల్లి అన్నీ అనుకున్నట్టు జరిగితే సరికొత్త హోదా దక్కించుకోనుంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో తెరపైకి వచ్చిన నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు అనకాపల్లికి అనుకూలంగా మారనుంది. సూటిగా చెప్పాలంటే అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశాలు అధిక శాతం ఉన్నట్టు సమాచారం. సీమాంధ్రలో 13 జిల్లాలు ఉండగా, వీటిని 21 వరకు పెంచాలన్నది ప్రభుత్వ యోచన. నియోజకవర్గాలు సైతం 175 నుంచి 225 వరకు పెంచే ప్రతిపాదన ఉండడంతో జిల్లాల పెంపు అనివార్యం. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రచారం జోరందుకుంది.

ఉత్తరాంధ్రలో ప్రస్తుతం మూడు జిల్లాలుండగా అదనంగా మరో జిల్లా ఏర్పాటుకానుంది.  ప్రస్తుతం ఉన్న భౌగోళిక స్థితిగతుల నేపధ్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను విభజించే అవకాశం లేదు. దీంతో విశాఖ నగరాన్ని ఒక జిల్లాగాను, గ్రామీణ ప్రాంతాన్ని మరో జిల్లాగాను విభజించే ప్రయత్నాలు జోరందుకున్నాయి. అనకాపల్లి కేంద్రంగా ఈ కొత్త జిల్లా ఏర్పాటుకానుందన్నది ఉన్నతాధికారుల అభిప్రాయం. అనకాపల్లిలోఉన్న వంద పడకల ఆస్పత్రి ఇటీవలే జిల్లా స్థాయి ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయింది. మరోవైపు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్మాసిటీ, ఎస్‌ఈజెడ్‌లకు రవాణా పరంగా అనకాపల్లి అత్యంత కీలకం. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బెల్లం మార్కెట్, కూరగాయల వ్యాపార కలాపాల కేంద్రంగా అనకాపల్లికి ప్రత్యేకత ఉండనే ఉంది.

అనకాపల్లి నుంచి వందలాది మంది ఫైనాన్స్ వ్యాపారస్తులు విశాఖపట్నానికి తరలివెళ్లడం, అక్కడ వ్యాపారస్తులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడంలో ఈ ప్రాంతానికి చెందిన ఫైనాన్స్‌ర్ల పాత్ర ఎనలేనిది. ఇక జాతీయ రహదారి ఆనుకుని ఉండడం, రైల్వేస్టేషన్ సదుపాయం ఉండనే ఉన్నాయి. తాజాగా అనకాపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు, అన్నిరకాల వ్యాపార కలాపాలు ఇక్కడ నిర్వహించడం కలిసొచ్చే అంశం. వాణిజ్య పన్నులు, ఔషధ నియంత్రణ అధికార కార్యాలయం, కార్మిక శాఖ, తూనిక లు, కొలతల శాఖ, అటవీ శాఖ కార్యాలయాలు, సీసీఎస్ మహిళా పోలీస్‌స్టేషన్‌తోపాటు జిల్లా కేంద్రానికి అవసరమైన కార్యాలయాల ఏర్పాటుకు వనరులన్ని ఉన్నాయి.

అనకాపల్లి మీదుగా శారద నది ఉండడంతో నీటి వనరులకు లోటుండదు. ఆధ్యాత్మికంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబికా అమ్మవారి ఆలయం, పర్యాటక కేంద్రంగా బొజ్జన్నకొండ, తాగు, సాగునీటి వనరులను పెంపొందించుకునేందుకు సమీపంలోనే అనకాపల్లి, వాడ్రాపల్లి, కొండకర్ల ఆవ ఉండనే ఉన్నాయి. ఇన్ని అర్హతలున్న అనకాపల్లికి కొత్త జిల్లా కేంద్రంగా గుర్తింపు తెచ్చుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక కావలసింది రాజకీయ పరపతి, వనరులున్న కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపనే. మరికొద్ది నెలల్లో కొత్త జిల్లా ఏర్పాటుపై పూర్తి స్పష్టత రానుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement