24నే వేతనాలు
- రాష్ట్ర విభజనతో ముందస్తుగా ఆదేశాలు
- ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఇదే చివరి వేతనం
సాక్షి, ఖమ్మం, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈనెల 24నే ఉద్యోగులకు మే నెల వేతనం అందనుంది. ఈమేరకు ముందస్తుగా ఆదేశాలు రావడంతో జిల్లా కోశాధికారి కార్యాలయం కసరత్తు చేస్తోంది. జూన్ 2 నుంచి నూతన రాష్ట్రం కానుండడంతో ఉద్యోగులకు ఇక తెలంగాణ ప్రభుత్వమే వేతనాలు చెల్లించనుంది.
జిల్లాలో మొత్తం 30,782 మంది ఉద్యోగులు, 16,160 మంది పెన్షనర్లు ఉన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం వేతనం కింద రూ.103.66 కోట్లు, పెన్షనర్లకు రూ.24.98 కోట్లు చెల్లించాలి. గత నెల 7న జీఓ నెంబర్ 78ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ఈనెల 24నే.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాతా నుంచి తెలంగాణలోని ఉద్యోగులకు వేతనం చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులు అందుకున్న జిల్లా కోశాధికారి కార్యాలయం అధికారులు ఉద్యోగుల జాబితా, ఖాతాలను సిద్ధం చేసి పెట్టుకున్నారు.
ఏడు రోజుల ముందే వేతనాలు చెల్లిస్తుండగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు ఇదే చివరి వేతన చెల్లింపు అవుతుంది. జూన్ రెండు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుండడంతో జూన్ నెల వేతనం ఇక నూతన తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యోగులు అందుకోనున్నారు. మే 24 ఉద్యోగులకు తమ సర్వీస్‌లో గుర్తుండి పోయే రోజుగా మిగలనుంది.