సాక్షి, ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొందరు అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించాయి. రౌండ్ రౌండ్‌కో తీరుగా విజయావకాశాలు మారుతుండటంతో కౌంటింగ్ జరుగుతున్నంత సేపు ఉత్కంఠ క్షణాల మధ్య గడపాల్సి వచ్చింది. చివరికి కొందరు గట్టెక్కితే మరికొందరు నిరాశతో వెనుదిరిగారు. కొత్తగూడెం, ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేటలో చివరి వరకు విజయం అభ్యర్థులతో దోబూచులాడింది. పోటాపోటీగా తలపడి అశ్వారావుపేటను వైఎస్సార్‌సీపీ, కొత్తగూడెంను టీఆర్‌ఎస్ దక్కించుకోగా భద్రాచలంలో సీపీఎం, సత్తుపల్లిలో టీడీపీ పాగా వేశాయి. పినపాక, వైరాలో వైఎస్సార్ కాంగ్రెస్, ఇల్లెందు, మధిర, పాలేరులో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా విజయం సాధించింది.
నువ్వా నేనా అన్నట్లుగా తలపడడంతో జిల్లా వ్యాప్తంగా ఆయా పార్టీల శ్రేణులు కూడా ఆందోళన చెందాయి. కొద్దిసేపు సమాన ఫలితాలు రావడం, తొలుత మెజారిటీలో ముందున్న అభ్యర్థులు ఆ తర్వాత వెనకంజలో ఉండడం.. చివరకు ఓటమి అంచుకు చేరుకోవడంతో అభ్యర్థులు తమ భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన చెందారు. కొ న్ని నియోజకవర్గాల్లో వెనకబడి ఉన్న అభ్యర్థులకు ఇక ఓటమి తప్పదని భావించినా.. చివరి రౌండ్లలో వారు దూసుకురావడంతో విజయకేతనం ఎగురవేశారు. భద్రాచలం నియోజకవర్గమే ఇందుకు నిదర్శనం. తొలి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరిచిన టీడీపీ అభ్యర్థి ఫణీశ్వరమ్మ విజయం ఖాయమని అందరూ భావిం చారు. కానీ చివరి మూడు రౌండ్లలోనే ఈ ఫలితం తారుమారైంది.
తొలి రౌండ్ నుంచి మెజారిటీ ఉన్న టీడీపీ అభ్యర్థి చివరకు మారిన ఫలితంలో ఓటమి చవిచూడక తప్పలేదు. కేవలం 1,815 ఓట్లతో ఇక్కడ వైఎస్సార్‌సీపీ బలపరిచిన సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య విజయం సాధించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా విచిత్ర పరిస్థితి తలెత్తింది. తొలి నుంచి ఆధిక్యత కనబరిచిన టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు చివరలో స్వల్ప ఓట్ల మెజార్టీ ఉండటం, ఒకానొక దశలో ఓటమి అంచుకు చేరి మళ్లీ గట్టెక్కడంతో ఊపిరితీసుకున్నారు. తన సమీప ప్రత్యర్థి డాక్టర్ మట్టా దయానంద్‌విజయ్‌కుమార్‌పై కేవలం 2,485 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుపొందారు.
ఈ సీటును దక్కించుకొని జిల్లాలో టీడీపీ ఉనికిని కాపాడుకుంది. అలాగే అశ్వారావుపేటలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. ఇక్కడ కొన్ని రౌండ్లు టీడీపీ, మరికొన్ని రౌండ్లు వైఎస్సార్‌సీపీ ఆధిక్యత కనబరిచాయి. చివరకు విజయం ఎవరికి దక్కుతుందో అంతుచిక్కలేదు. ఈ ఆధిక్యత కూడా అతి స్వల్పంగా ఉండడంతో అభ్యర్థులు హైరానా పడ్డారు. మొత్తం మీద 992 ఓట్ల మెజారిటీతో తాటి వెంకటేశ్వర్లు టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై గెలుపొందారు.
తారుమారైన ‘గూడెం’.. చివరకు కారుకే పట్టం..
కొత్తగూడెం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా ఉత్కంఠ నెలకొంది. కొన్ని రౌండ్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, మరికొన్ని రౌండ్లు స్వతంత్ర అభ్యర్థి ఎడవల్లి కృష్ణ ఆధిక్యత కనబరిచారు. కొత్తగూడెం పట్టణం ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి కారు జోరందుకుంది. కారు స్పీడ్‌తో ఇద్దరు అభ్యర్థులు వెనకంజలో నిలిచారు.
చివరి రౌండ్లలో మెజారిటీని సొంతం చేసుకొని టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్, సమీప ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుపై 16,543 ఓట్ల మెజారిటీ గెలిచారు. గతంలో టీడీపీ, సీపీఐ సీట్టింగ్ ఎమ్మెల్యేలై.. టీఆర్‌ఎస్ నుంచి ఇల్లెందులో పోటీ చేసిన ఊకె అబ్బయ్య, వైరా నుంచి బరిలో దిగిన బాణోతు చంద్రావతి ఓటమి చవిచూడక తప్పలేదు. ఇల్లెందులో ఊకె అబ్బయ్య మూడో స్థానంలో నిలిచారు. అలాగే వైరాలో చంద్రావతి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. సిట్టింగ్‌లైన వీరు కారెక్కినా పాత స్థానాలు మాత్రం కలిసిరాలేదు.
వైఎస్‌ఆర్‌సీపీకి స్పష్టమైన మెజారిటీ..
పినపాక, వైరాలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు స్పష్టమైన మెజారిటీ లభించింది. ఈ అసెంబ్లీల పరిధిలో పాయం వెంకటేశ్వర్లు, బాణోతు మదన్‌లాల్‌లు తొలి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరచడం విశేషం. తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి శంకర్‌నాయక్‌పై పాయం 14,065 ఓట్ల మెజారిటీ పొందారు. అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థుల్లో జిల్లాలో మూడు స్థానంలో పాయం నిలిచారు. అలాగే వైరాలో మదన్‌లాల్ తన సమీప ప్రత్యర్థి బాలాజీనాయక్‌పై 10,525 ఓట్ల మెజారిటీ సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఈ రెండు స్థానాల్లో వైఎస్సార్‌పీపీ ఎంపీ అభ్యర్థులకు భారీ మెజారిటీ వచ్చింది.
స్వల్పం నుంచి మెజారిటీ వైపు..
పాలేరు, మధిర నియోజకవర్గాలో కాంగ్రెస్ అభ్యర్థులు రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టివిక్రమార్కలకు ప్రత్యర్థులు గట్టిపోటీనిచ్చారు. తొలుత స్వల్ప అధిక్యతతో మొదలైన మెజారిటీ చివరకు వీరిని విజయతీరాలకు చేర్చింది. పాలేరులో రాంరెడ్డి ఆధిక్యత అన్ని రౌండ్లలోనూ కొనసాగింది. అయితే టీడీపీ అభ్యర్థి మద్దినేని బేబి స్వర్ణకుమారి ఈయనకు గట్టిపోటీనే ఇచ్చారు. అలాగే మధిర నియోజకవర్గంలో భట్టికి వస్తున్న అతి తక్కువ ఆధిక్యతను చూసి అందరూ భంగపాటు తప్పదని భావించారు. కానీ చివరి రౌండ్లలో కొంత మెజారిటీ సాధించి గట్టెక్కారు. ఇలా సార్వత్రిక ఫలితాలు ఆయా పార్టీల అభిమానులు, కార్యకర్తలతో పాటు అందరికంటే ఎక్కువగా అభ్యర్థులతో ఆడుకున్నాయి.
రౌండ్ రౌండ్‌కూ టెన్షన్
Published Sat, May 17 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM
Advertisement
Advertisement