మూడుకే మొగ్గు!
♦ కొత్త జిల్లాలుగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట
♦ 15 లక్షలలోపు జనాభాకే ప్రాధాన్యం
♦ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసిన కలెక్టర్
♦ పునర్విభజనపై రాజుకుంటున్న అగ్గి
♦ మేం సంగారెడ్డిలోనే ఉంటాం: ఖేడ్ ఎమ్మెల్యే
♦ మమ్మల్ని సిద్దిపేటలో కలపొద్దు: బెజ్జంకి ప్రజలు
కొత్త జిల్లాల స్వరూపం!
సంగారెడ్డి జిల్లా .. (జనాభా: 11,86,280.. వైశాల్యం: 3,116 చ.కిలోమీటర్లు, మండలాలు: 18)
పటాన్‌చెరు, రామచంద్రాపురం, జిన్నారం, సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట, మునిపల్లి, రాయికోడ్, హత్నూర, జహీరాబాద్, జహీరాబాద్ అర్బన్, కోహీర్, న్యాల్‌కల్, ఝరాసంఘం, కంది మండల కేంద్రంగా సంగారెడ్డి రూరల్ గ్రామాలు, అమీన్‌పుర్ మండల కేంద్రంగా పటాన్‌చెరు రూరల్ గ్రామాలు వచ్చే అవకాశం ఉంది. మరో రెండు కొత్త మండలాలు కలిపి మొత్తం 18 మండలాలతో జిల్లా ఏర్పడనుంది.
మెదక్ జిల్లా .. (జనాభా: 14,44,955, వైశాల్యం: 4,215 చ . కిలోమీటర్లు, మండలాలు: 25
పుల్కల్, తూప్రాన్, చేగుంట, మెదక్, పాపన్నపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, నర్సాపూర్, శివ్వంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, కొల్చారం, నారాయణఖేడ్, నారాయణఖేడ్ అర్బన్, మనూరు, కంగ్టి, కల్హేర్, పెద్దశంకరంపేట, కొత్తగా గుమ్మడిదల మండల కేంద్రంగా జిన్నారం రూరల్ గ్రామాలు, మెదక్ అర్బన్ మండలం, సిర్గాపూర్ మండల కేంద్రంగా కంగ్టిలోని కొన్ని గ్రామాలు, కల్హేర్‌లోని మరి కొన్ని గ్రామాలు, నిజామాబాద్ జిల్లా తాడ్వాయి, నాగిరెడ్డిపల్లి, ఎల్లారెడ్డి మండలాలు కలిసే అవకాశం ఉంది. మొత్తం 25 మండలాలతో మెదక్ జిల్లా ఏర్పడనుంది.
సిద్దిపేట జిల్లా.. (జనాభా: 11,90,209, వైశాల్యం: 4,398 చ.కిలోమీటర్లు, మండలాలు: 22)
సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు, దుబ్బాక, దౌల్తాబాద్, మిరుదొడ్డి, తొగుట, కొండపాక, గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్‌తో పాటుగా కరీంనగర్‌జిల్లా నుంచి హుస్నాబాద్, కోహెడ్, చిగురు మామిడి, ఇల్లంతకుంట, బెజ్జంకి, వరంగల్ జిల్లా నుంచి చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట్ట మండలాలు, కొత్తగా సిద్దిపేట అర్బన్ మండలం ఏర్పడ వచ్చు. మొత్తం 22 మండలాలతో సిద్దిపేట జిల్లా రూపుదిద్దుకోవచ్చు.
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి : జిల్లా భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోనుంది. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటే లక్ష్యంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జి ల్లాను మూడు జిల్లాలుగా మార్చేందుకు కలెక్టర్ రోనాల్డ్ రోస్ రోడ్ మ్యాప్‌ను రూపొందించారు. మరోవైపు జిల్లాల పునర్విభ జనపై అగ్గి రాజుకుంటోంది. తూప్రాన్ రెవెన్యూ డివిజన్ చేయాలని అక్కడి ప్రజలు రోడ్డెక్కగా.. నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని స్థానిక ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తాము సిద్దిపేట జిల్లాలో కలవబోమని, తమ కోసం గుండ్లపల్లి మండలం కేంద్రాన్ని ఏర్పాటు చేసి కరీంనగర్‌లోనే ఉంచాలని కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
తూప్రాన్‌ను రెవిన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్‌తో బుధవారం తూప్రాన్ పట్టణంలో బంద్ నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న తూప్రాన్‌ను మెదక్ జిల్లాలో చేర్చాలనే డిమాండ్ ఉంది. జియోగ్రాఫికల్ స్వరూపం దృ ష్ట్యా తూప్రాన్‌ను మెదక్ జిల్లాలోనే కల పాల్సి ఉంటుంది. తూప్రాన్ ఇప్పటికే పోలీసు డివిజన్‌గా ఉంది. దీన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రమోట్ చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. చేగుంట, వె ల్తుర్తి, శివ్వంపేట తూప్రాన్ మండలాల తో తూప్రాన్ రెవెన్యూ డివిజన్ చేయాల ని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నారాయణఖేడ్‌ను రెవిన్యూ డివిజన్‌గా చేసి సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా భౌగోళిక స్వరూపం దృష్ట్యా నారాయణఖేడ్ మెదక్ జిల్లాలోనే కలపటానికి అదికారులు ప్రణాళిక రూపొందించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి నారాయణఖేడ్ 80 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. కంగ్టి మండలంలోని చివరి గ్రామాలైతే దాదాపు 115 కిలో మీటర్ల దూరం ఉంటుంది. అదే మెదక్ పట్టణానికి 45 కిలో మీటర్ల దూరంమే ఉంటుంది. ఈనేపధ్యం అధికారులు నారాయణఖేడ్‌ను మెదక్‌లో కలపాలని సూచించారు కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది.
ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలాన్ని సిద్దిపేటలో కలిపేందుకు ప్రణాళిక రూపొం దించారు. అయితే బెజ్జంకి దక్షిణ వైపున్న గ్రామాలు సిద్దిపేటలో కలిసేందుకు ఇష్టపడటం లేదు. దాదాపు 7కిలో మీటర్ల పరధిలో 20 గ్రామాలు గుండ్లపల్లికి చుట్టూ ఉంటాయి. ఈ గ్రామాలను బెజ్జంకి నుంచి వేరు చేసి గుండ్లపల్లిని మండల కేంద్రంగా చేసి కరీంనగర్ జిల్లాలోనే కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గూడెల్లి ఆంజనేయులు అనే నాయకుని ఆధ్యర్యంలో గుండ్లపల్లి మండల కేంద్రం సాధన జేఏసీ ఏర్పడి అక్కడ ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. మరో వైపు కేసీఆర్ సొంత గ్రామం చింతమడకను మండల కేంద్రంగా చేయాలనే డిమాండ్ ఉంది. అయితే చింతమడకను మండలంగా చేయడానికి దానికి అనుసంధానంగా తగినన్ని సమీప గ్రామాలు లేకపోవడంతో మండల కేంద్రంగా మార్చడానికి సాధ్యపడక పోవచ్చని రెవిన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.
కొత్త జిల్లాల రోడ్ మ్యాప్‌ను జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ రూపొందించారు. జిల్లా కేంద్రానికి చివరి మండల కేంద్రం కనీసం 70 కిలో మీటర్ల లోపు ఉండాలనే నిబంధనలకు లోబడి జిల్లా రోడ్ మ్యాప్‌ను విభజించారు. ఇందులో చిన్న చిన్న మార్పులతో కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది.