వికారాబాద్ జిల్లా కేంద్రం కాకుంటే..ఆమరణ నిరాహార దీక్ష
♦ సీఎం కేసీఆర్ మాటపై పూర్తి నమ్మకం ఉంది
♦ వీడీడీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరావు
♦ జిల్లా కేంద్రంపై కాంగ్రెస్ పూర్తి సహకారం : మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్
వికారాబాద్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా పశ్చిమ రంగారెడ్డిలోని వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఖాయమని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే బి.సంజీవరావు అన్నారు. అలా కానీ పక్షంలో ఉద్యమంలో ముందు నడిచి ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు. వికారాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు - అభివృద్ధి అనే అంశంపై మంగళవారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ సమావేశ మందిరం లో వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ ఫోరం(వీడీడీఎఫ్) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటపై నిలబడే వ్యక్తి అని, ఇచ్చిన హామీ ప్రకారం తప్పకుండా వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేస్తారన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని కోరారు. వికారాబాద్ జిల్లా నాలు గు నుంచి ఐదు నియోజకవర్గాలతో ఏర్పడడం ఖాయమన్నారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరుపున జిల్లా కేంద్రం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి వికారాబాద్ జిల్లా కేంద్రం అయ్యేందుకు పూర్తిసహకారం అందిస్తామని చెప్పారు. వికారాబాద్ జిల్లా ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమన్నారు. జిల్లా విషయంలో తేడా వస్తే ఊరుకునే ప్రసక్తే ఉండదన్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి..
వికారాబాద్ ప్రజలకు ముందు నుంచి పాల కులు అన్యాయం చేస్తూనే ఉన్నారని, గతంలో పార్లమెంట్ స్థానాన్ని చేవెళ్లకు, ప్రభుత్వ ఆసుపత్రిని తాండూరుకు తరలించి తీరని అన్యాయం చేశారని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం అవుతుందంటే లేనిపోని ఆందోళనల తో ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత నాయకులు ఐక్యంగా ఉండి వికారాబాద్ జిల్లా కేంద్రం ఏర్పాటయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. లేని పక్షంలో ప్రమాదం పొంచి ఉందన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటులో తేడా వస్తే ప్రత్యేక రాష్ర్ట తరహాలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ హఫీజ్, వీడీడీఎఫ్ నాయకులు శుభప్రద్‌పటేల్, కె.శ్రీనివాస్, నర్సింహు లు, మారుతి, టీఆర్‌ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు భూమోళ్ల కృష్ణయ్య, టీఆర్‌ఎస్ నాయకులు రత్నారెడ్డి, రాజు నాయక్, వేణుగోపాల్‌రెడ్డి, బీజేపీ నుంచి శివరాజ్, నాయకులు పెం డ్యాల అనంతయ్య, సురేష్, రవిశంకర్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు.విఠల్, పీఆర్‌టీయూ నర్సింహులు, లక్ష్మయ్య పాల్గొన్నారు.