మిషన్ కాకతీయ అతిపెద్ద కుంభకోణం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆరోపణ
ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల పునర్విభజన చేయాలని డిమాండ్
వినాయక్‌నగర్ : ప్రజల అభిప్రాయాల మేరకే జిల్లాల పునర్విభజన జరగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నా ప్రభుత్వానికి, అధికారులకు కనబడడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. మిషన్ కాకతీయ కార్యక్రమం అతి పెద్ద కుంభకోణమని, ప్రజా ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మాజీ ఎంపీ మధుయాష్కికి తగదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజలకు దగ్గరవ్వాలనుకోవడం అవివేకానికి నిదర్శనమన్నారు. నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటులో ప్రజాభిప్రాయం సేకరించాలని, లేకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. జిల్లాలో డయేరియా, విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, వెంటనే పల్లెలు, తండాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని గతంలో డిమాండ్ చేసిన సీఎం కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించిన రోజే అమరుల ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. బీజేపీ నేతలు గంగోని గంగాధర్, సుధాకర్, నాగరాజు, కిషన్, రాజు, నరేశ్, విజయ్ కృష్ణ, రోషన్‌లాల్ బోరా, మనోజ్ పాల్గొన్నారు.