పునర్ వ్యవ స్థీకరణపై అనుమానాలు ?
తెరపైకి ‘సీనియర్ల అస్త్రం’
వలసొచ్చిన వారి మంత్రి పదవులు తొలగించు : సిద్ధుకు ఖర్గే హితవు
సీనియర్లను తొలగిస్తే పార్టీకి నష్టం : మేడంకు విన్నపం
బెంగళూరు : కర్ణాటక మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ విషయమై పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే చక్రం అడ్డు వేశారు. మంత్రి మండలి నుంచి తొలగించాల్సిన పేర్లతో కూడిన జాబితాలో తన వర్గానికి చెందిన వారిని రక్షించుకోవడానికి ‘పార్టీకి సీనియర్ల అవసరం ఎంతో ఉంది’ అన్న అస్త్రాన్ని మల్లికార్జున ఖర్గే తెరపైకి తీసుకువచ్చారు. దీంతో పునర్ వ్యవస్థీకరణపై సందిగ్దత నెలకొంది. మంత్రి మండలిలోకి యువ కులను చేర్చుకోవాలని సీఎం సిద్ధరామయ్య భావిస్తున్న విషయం తెలిసిందే. దీంతో సిద్ధరామయ్య రూపొందించిన తొలగింపు జాబితాలో చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లే కాక, మల్లికార్జున ఖర్గే అనుచరులుగా గుర్తింపు పడిన మంత్రులు ఖమరుల్ ఇస్లాం, శ్యామనూరు శివశంకరప్ప, కిమ్మెనరత్నాకర్, బాబురావ్ చించన్‌సూర్, అభయ్‌చంద్రజైన్ వంటి వారి పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం తనను కలిసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మల్లికార్జున ఖర్గే కాస్తంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘ ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులను అనుభవిస్తున్న వారిని మొదట మంత్రి మండలి నుంచి తొలగించు. అటుపై మిగిలిన వారి సంగతి చూద్దాం. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో సీనియర్లను తొలగిస్తే పార్టీ చాలా నష్టపోతుంది. అందువల్ల పార్టీలో చాలా కాలంగా ఉన్న వారు మంత్రులుగానే కొనసాగడం ఉత్తమం.’ అని సూచించారు.
అంతేకాకుండా మల్లికార్జున ఖర్గే సోనియాతో ప్రత్యేకంగా భేటీ అయ్యి సీనియర్లను తొలగించడం వల్ల రానున్న శాసనసభ ఎన్నికల్లో పార్టీ నష్టపోయే అవకాశం ఉందని వివరించారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మండలి పున ర్ వ్యవస్థీకరణ విషయమై అనుమతి లభించలేదు. ఒకేసారి 12 మంది మంత్రులను తొలగించడం సరికాదని సోనియాగాంధీ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో మంత్రి మండలి పునర్ వ్యవస్థీకణకు సంబంధించి సీఎం సిద్ధరామయ్య ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో శుక్రవారం జరిపిన చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో నేడు (శనివారం) మరోసారి సిద్ధరామయ్య, సోనియాగాంధీతో సమావేశం కానున్నారు. ఒకవేళ మండలి పునర్ వ్యవస్థీకరణకు నేడు అనుమతి లభించకపోతే సోనియా గాంధీ విదేశీ పర్యటన ముగిసేంతవరకూ విస్తరణ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఈ విషయమై సోనియాగాంధీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ...‘పునర్‌వ్యవ స్థీకరణ విషయంపై శుక్రవారం మేడం సోనియాగాంధీతో సూత్రప్రాయంగా చర్చించాను. ఈ విషయమై మేడంను శనివారం మరోసారి కలుస్తాను.’ అని పేర్కొన్నారు.