సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో జోన్లు, మల్టీజోన్ల పునర్వ్యవస్థీకరణతో పోలీస్ శాఖలోనూ నూతన రేంజ్‌లు, జోన్ల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖలో రెండు జోన్లు, నాలుగు రేంజ్‌లు ఉన్నాయి. వెస్ట్‌జోన్ (హైదరాబాద్) కింద ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలున్నాయి. అదేవిధంగా నార్త్‌జోన్ (వరంగల్) కింద ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉన్నాయి. నూతన జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు వెస్ట్‌జోన్ కింద, మరికొన్ని ప్రాంతాలు నార్త్‌జోన్ కిందకు వచ్చాయి. దీనితో సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ల పోస్టింగులు, వారి పై తీసుకునే క్రమశిక్షణ చర్యలు, మానిటరింగ్ తదితరాల పర్యవేక్షణకు సరిహద్దు సమస్యలు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న జోన్లు, మల్టీజోన్లతో పోలీస్ శాఖలో రేంజ్‌లు, జోన్ల పునర్వ్యవస్థీకరణ క్లారిటీ వచ్చినట్టుగా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఒక్కో జోన్ కింద రెండు రేంజ్‌లున్నాయి. జోన్లకు ఐజీ హోదా కలిగిన అధికారులుండగా, రేంజ్‌లను డీఐజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
నూతనంగా మరో రెండు...
ప్రస్తుతం కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ రేంజ్‌లుండగా, వీటికి తోడుగా మరో రెండు రేంజ్‌లు ఏర్పాటు చేసే అవకాశముందని పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. అదేవిధంగా ఇప్పుడున్న రేంజ్‌ల పేర్లు కూడా మార్పు జరిగే అవకాశం ఉందని, మొత్తంగా 6 రేంజ్‌లకు కొత్తపేర్లతో పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో రేంజ్ కింద 5 జిల్లాల పోలీస్ యూనిట్లు పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ జోన్‌తో పాటు మరో జోన్ కూడా ఏర్పాటు జరిగితే ఒక్కో జోన్ కింద రెండు రేంజ్‌ల పర్యవేక్షణ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. నూతనంగా ఏర్పడిన కమిషనరేట్లలో బదిలీలు, క్రమశిక్షణ చర్యలు ఎవరి అధీనంలో ఉండాలన్న దానిపై త్వరలో క్లారిటీ వస్తుందని, ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తామని సీనియర్ ఐపీఎస్‌లు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment