new zones
-
మారుమూల.. బదిలీ లీల!
సాక్షి, హైదరాబాద్: కొత్త జోనల్ విధానం అమలులో భాగంగా జిల్లా కేడర్‌లోని ఉద్యోగుల కేటాయింపు వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గాల్లో ఈ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త జిల్లాలకు బదిలీ అయిన జూనియర్ ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలో నిర్ధారించే ఆదేశాలు ఈ నెల 30 లోగా విద్యాశాఖ ఇవ్వబోతోంది. ఈలోగా ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే సమస్య తలెత్తింది. ఇప్పటికే స్థానికత పేరుతో సొంత జిల్లాలు వదులుకున్నామని, కొత్త ప్రాంతాల్లోనూ మారుమూల ప్రాంతాలకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా జిల్లాల్లో వెళ్ళిన ఉద్యోగుల కన్నా పోస్టులు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో దూర ప్రాంతాల్లో ఉద్యోగులకు సరిపడా పోస్టులే ఖాళీగా ఉంచి, మిగతా వాటిని బ్లాక్ చేస్తున్నారు. అయితే ఆప్షన్లకు అవకాశమిచ్చే ప్రాంతాలన్నీ జిల్లాల్లో మారుమూల ప్రదేశాల్లోనే ఉంటున్నాయని టీచర్లు అంటున్నారు. ఈ రకంగానూ తమకు అన్యాయం జరుగుతోందని మహబూబాబాద్‌కు బదిలీ అయిన టీచర్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీ జోనల్ తేలకుండా ఆప్షన్లా? భార్యాభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పిస్తూ జిల్లా కేడర్ నుంచి ఆప్షన్లు కోరారు. ఈ గడువు కూడా 27 వరకే ఉంది. అయితే ఇంతవరకు మల్టీ జోనల్ పోస్టుల కేటాయింపు జరగలేదు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సోమవారం ప్రకటించే వీలుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భార్యా, భర్తల్లో జిల్లా కేడర్‌లో ఒకరు, మల్టీ జోనల్లో మరొకరు పనిచేస్తుంటే.. జిల్లా కేడర్‌లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆప్షన్ ఇస్తారు. మల్టీ జోనల్లో పనిచేసే భర్త లేదా భార్యకు ఆ అవకాశం ఇప్పుడు లేదు. అలాంటప్పుడు ఇద్దరు ఒకేచోట పనిచేసే వీలు ఎలా ఉంటుందని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. అన్ని కేడర్ల కేటాయింపు జాబితాలు ప్రకటించాకే ఆప్షన్లు పూర్తి చేయాలని కోరుతున్నారు. స్థానికంగా ఉండే ఉపాధ్యాయుల్లోనూ బదిలీల ప్రక్రియ గుబులు రేపుతోంది. ఏళ్ళ తరబడి పనిచేస్తున్న టీచర్లు తాము కోరుకునే ప్రదేశాన్ని కొత్తగా వచ్చే వారితో నింపితే తమకెలా న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీనియారిటీ జాబితాలపైనా అన్ని స్థాయిల్లో వివాదం పెరుగుతోంది. వీటిపై అప్పీలుకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపు సచివాలయం ముట్టడి బలవంతపు బదిలీలను నిరసిస్తూ మంగళవారం సచివాలయం ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపునిచ్చింది. అత్యవసరంగా వర్చువల్ పద్ధతిలో భేటీ అయిన స్టీరింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంఘం నేతలు చావా రవి తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుం డా అమలు చేస్తున్న బదిలీలు హేతుబద్ధంగా లేవని, అందుకే ఆందోళన బాట పట్టామని తెలిపారు. పరస్పర బదిలీలకు అవకాశమివ్వాలి పరస్పర బదిలీల ద్వారా ఎస్జీటీలు సొంత ప్రాంతంలో పనిచేసే అవకాశం కల్పించాలి. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే వీలు కల్పించాలి. కొత్త జిల్లాల్లో పాఠశాలల కేటాయింపును ముందే ప్రకటించాలి. అంతర్ జిల్లా బదిలీల్లోకి వెళ్ళిన టీచర్లకు కొత్త జిల్లా కేటాయిస్తే ఉద్యోగంలో చేరిన తేదీని సీనియారిటీగా గుర్తించాలి. సీనియారిటీలో జరిగిన అవకతవకలను తక్షణమే సరిచేయాలి. – కరివేద మహిపాల్ రెడ్డి, అరికల వెంకటేశం (అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి.. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం) అప్పుడే ఆప్షన్లు న్యాయం కాదు మల్టీ జోనల్ పరిధిలోకి వచ్చే గెజిటెడ్ హెడ్మాస్టర్ల కేటాయింపు పూర్తవ్వకుండా, జిల్లా కేడర్ ఆప్షన్లు కోరడం న్యాయం కాదు. దీనివల్ల భార్యాభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కోల్పోతారు. కేటాయింపు అన్ని స్థాయిల్లో పూర్తయిన తర్వాతే జిల్లాల్లో ఎక్కడ పనిచేయాలనేది నిర్ణయించాలి. – రాజా భానుచంద్రప్రకాశ్ (గెజిటెడ్ హెడ్మాస్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు) -
కొత్త మండలాలు ఏర్పాటు చేయాలి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఏ) అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. పెరిగిన జనాభా, పనిభారం ప్రాతిపదికగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఏపీఆర్ఎస్ఏ కొత్త కార్యవర్గ ప్రతినిధులు బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ సచివాలయ వ్యవస్థను అత్యద్భుతంగా ఏర్పాటు చేశారంటూ అభినందించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటే కొత్త మండలాల విషయం పరిశీలించాలని సీఎంకు వినతిపత్రం సమర్పించారు. రెవెన్యూయేతర పనులు రెవెన్యూ ఉద్యోగులకు అప్పగించకుండా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తమ వినతిపై సానుకూలంగా స్పందించిన సీఎం ఉద్యోగుల సమస్యలపై అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించి పరిష్కార చర్యలు తీసుకోవాలని తన అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డికి సూచించారని బొప్పరాజు తెలిపారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎన్. శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాధురి, ఏపీజేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్ వైవీరావు సీఎంను కలిశారు. -
‘గురుకుల’ విభజనపై కొత్త చిక్కులు
సాక్షి, హైదరాబాద్ : గురుకుల విద్యాసంస్థల సొసైటీల పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో పోస్టుల విభజనకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమలుకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ మేరకు పోస్టులను జోన్లు, మల్టీజోన్లు, జిల్లా కేడర్‌వారీగా విభజించాలి. ఆ తర్వాతే కొత్తగా నియామకాలు చేపట్టేందుకు నోటిఫికేషన్లు జారీ చేసే వీలుంటుంది. ఈ క్రమంలో పోస్టుల విభజనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతూ గురుకుల నియామకాల బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల ఆధారంగా వాటిని విభజిస్తే సరిపోతుందని బోర్డు భావించినప్పటికీ ప్రభుత్వ స్పందన భిన్నంగా రావడంతో గురుకుల నియామకాల బోర్డు తలపట్టుకుంది. మీరే స్పష్టత ఇవ్వాలి... రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త జోనల్ విధానం నేపథ్యంలో గురుకుల విద్యాసంస్థల సొసైటీలు కొత్త నిబంధనల పరిధిలోకి వస్తాయా లేదా అనే అంశాన్ని తేల్చుకునేందుకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు గత నెలలో ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు గురుకుల సొసైటీకి వర్తిస్తాయా లేక ప్రత్యేక నిబంధనలకు లోబడి పనిచేస్తాయా చెప్పాలని కోరింది. అయితే అనూహ్యంగా ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయాన్ని బోర్డుకే వదిలేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా బోర్డుకు తిరుగు లేఖ రాశారు. వీలైనంత త్వరగా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీంతో బోర్డు డైరెక్టర్లు తెల్లబోయారు. ప్రభుత్వమే తేల్చాల్సిన అంశాన్ని బోర్డుకు వదిలేయడంపై అయోమయంలో పడ్డారు. ఈ క్రమంలో బోర్డు ఏర్పాటు సమయంలో బైలాస్, నియామకాల్లో పాటించిన విధానాన్ని పరిశీలించి నివేదిక తయారు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖ సొసైటీ కార్యదర్శులు నిర్ణయించారు. ఇటీవల ప్రత్యేకంగా సమావేశమై ఒక దఫా చర్చలు జరిపిన కార్యదర్శులు మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. -
రాష్ట్రంలో 7 పోలీస్ రేంజ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జోన్లు, మల్టీ జోన్ల ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలవడంతో పోలీస్ శాఖలోనూ కొత్త రేంజ్‌ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొత్తగా 3 రేంజ్‌ల ఏర్పాటుతో పాటు ప్రస్తుతమున్న 4 రేంజ్‌ల పేర్లు మారనున్నాయి. దీంతో మొత్తంగా 7 రేంజ్‌లు ఏర్పాటు కాబోతున్నాయి. కొత్త రేంజ్‌ల ఏర్పాటుతో ఎస్సై, సీఐల బదిలీల పరిధి కూడా పెరగనుంది. ప్రస్తుతం 2 జోన్లు, 4 రేంజ్‌లు రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ జోన్లున్నాయి. వీటి కింద 4 రేంజ్‌లు కొనసాగుతున్నాయి. వరంగల్ జోన్ కింద వరంగల్, కరీంనగర్ రేంజ్‌లు ఉండగా.. హైదరాబాద్ జోన్లో నిజామాబాద్, హైదరాబాద్ రేంజ్‌లు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను కరీంనగర్ రేంజ్.. వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాను వరంగల్ రేంజ్ పర్యవేక్షిస్తూ వస్తోంది. హైదరాబాద్ రేంజ్ కింద నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీస్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు ఉన్నాయి. నిజామాబాద్ కింద నిజామాబాద్, మెదక్ జిల్లాలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో.. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల 31 జిల్లాలు ఏర్పడటంతో రేంజ్‌ల ఏర్పాటు కూడా తప్పనిసరిగా మారింది. పాత 4 రేంజ్‌లతో పాటు కొత్తగా 3 రేంజ్‌లు ఏర్పాటు కాబోతున్నాయి. ఒక్కో రేంజ్ కింద 4 నుంచి 5 జిల్లాలు పర్యవేక్షణలో ఉండనున్నాయి. పాత రేంజ్‌ల పేర్లు గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం మార్పు చెందడంతో కొత్త రేంజ్‌ల ఏర్పాటు, వాటి కార్యాలయాలు, సిబ్బంది కేటాయింపులపై త్వరలోనే పోలీస్ శాఖ నిర్ణయం తీసుకోనుంది. వరంగల్ మల్టీ జోన్ కింద కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి రేంజ్‌లు ఉంటాయి. హైదరాబాద్ మల్టీ జోన్ కింద యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ రేంజ్‌లు ఉండనున్నాయి. ఇప్పుడు కొత్త జిల్లాల్లోనూ.. ఉమ్మడి జిల్లాల ప్రకారం రేంజ్‌లలో పని చేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్లు, జోన్లలో పనిచేసే ఇన్స్పెక్టర్లు కేవలం ఆ రేంజ్‌లు, ఆ జోన్లకే పరిమితమయ్యారు. అయితే కొత్త జిల్లాలు ఏర్పాటవడం, ఆ ప్రాతిపదికన కొత్త రేంజ్‌లు వస్తుండటంతో సబ్ ఇన్స్పెక్టర్లు పాత రేంజ్లలోని జిల్లాలే కాకుండా కొత్త రేంజ్లలోని జిల్లాల్లోనూ పని చేసేందుకు మార్గం సుగమమైంది. ఇన్స్పెక్టర్లు కూడా జోన్లోకి కొత్తగా వస్తున్న జిల్లాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా పోస్టింగ్ పొందనున్నారు. ఉదాహరణకు ఇదివరకు పాత కరీంనగర్ రేంజ్లో పనిచేసే సబ్ ఇన్స్పెక్టర్ ఆదిలాబాద్ లేదా కరీంనగర్ రేంజ్‌లోనే పనిచేయాల్సి వచ్చేది. ఇప్పుడు బాసర రేంజ్ కింద నిజామాబాద్ జిల్లా కూడా చేరడంతో ఆ జిల్లాలోనూ పనిచేయొచ్చు. ఇన్స్పెక్టర్లు కూడా పోస్టింగ్ పొందే అవకాశం లభించింది. సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, కరీంనగర్‌లలో ఎక్కడైనా పనిచేసే అవకాశం లభించింది. స్థానిక నియోజకవర్గం, సొంత జిల్లాలో కాకుండా రేంజ్‌లోని ఇతర ప్రాంతాల్లో పనిచేసే వెసులుబాటు కొత్త రేంజ్‌ల వల్ల కలిగింది. కొత్త రేంజ్‌లు.. వాటి పరిధిలోని జిల్లా పోలీస్ యూనిట్లు కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, రామగుండం కమిషనరేట్ బాసర: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ కమిషనరేట్, జగిత్యాల రాజన్న: కరీంనగర్ కమిషనరేట్, సిద్దిపేట కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ భద్రాద్రి: కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం కమిషనరేట్, మహబూబాబాద్, వరంగల్ కమిషనరేట్ యాదాద్రి: సూర్యాపేట, నల్లగొండ, రాచకొండ పోలీస్ కమిషనరేట్ చార్మినార్: హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, సంగారెడ్డి జోగుళాంబ: మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్ డీఐజీల సంగతేంటి? ప్రస్తుతమున్న 4 రేంజ్లలోనే డీఐజీలను నియమించకుండా ఇద్దరు అధికారులపై అదనపు భారం వేసి ప్రభుత్వం నెట్టుకొస్తోంది. అలాంటిది కొత్తగా రాబోతున్న మరో 3 రేంజ్‌లకు డీఐజీలను నియమిస్తుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇన్నాళ్లూ డీఐజీ హోదా అధికారులు తక్కువగా ఉండటంతో అదనపు భారం మోపాల్సి వచ్చిందని.. కొద్ది రోజుల్లో ముగ్గురు సీనియర్ ఎస్పీలకు డీఐజీ పదోన్నతి కల్పిస్తున్నామని, వచ్చే ఏడాది మార్చిలో మరో నలుగురు డీఐజీలుగా పదోన్నతి పొందనున్నారని పోలీస్ శాఖ తెలిపింది. దీంతో కొత్త రేంజ్‌లకు డీఐజీల కొరత తీరినట్లేనని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అన్నారు. -
తెలంగాణలో కొత్త జోన్ల వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం
-
కొత్త జోన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
ఢిల్లీ: తెలంగాణ కొత్త జోన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఏడు జోన్లకు, రెండు మల్టీ జోన్లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కొత్త జోన్ల ఆమోదం కోసం ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెల్సిందే. రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి, కేంద్ర హోంమంత్రి, ఆర్థిక మంత్రులను కూడా కలిశారు. తెలంగాణ ఏర్పడినప్పటికీ ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న జోనల్ వ్యవస్థ అవరోధంగా ఉందని ముఖ్యమంత్రి మొదటి నుంచి భావించారు. దానికి అనుగుణంగా జోనల్ వ్యవస్థలో మార్పులకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగానే 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణాను 31 జిల్లాలుగా చేసి స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల స్థానిక యువకులు ఎక్కువ అవకాశాలు పొందుతారని సీఎం భావించారు. కొత్త జోనల్ విధానం ఇదీ... తెలంగాణలో ప్రస్తుతమున్న రెండు జోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పడతాయి. అందులో మొదటి నాలుగు జోన్లను ఒక మల్టీజోన్‌గా మిగిలిన మూడు జోన్లను రెండో మల్టీజోన్‌గా పరిగణిస్తారు. మరోవైపు ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువులో వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు. ప్రతిపాదిత 7 జోన్లు ఇవీ... కాళేశ్వరం జోన్.. జిల్లాలు: భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జనాభా: 28.29 లక్షలు. బాసర జోన్... జిల్లాలు: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనాభా: 39.74 లక్షలు. రాజన్న జోన్... జిల్లాలు: కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జనాభా: 43.09 లక్షలు. భద్రాద్రి జోన్... జిల్లాలు: వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనాభా: 50.44 లక్షలు యాదాద్రి జోన్... జిల్లాలు: సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, జనాభా: 45.23 లక్షలు చార్మినార్ జోన్... జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, జనాభా: 1.03 కోట్లు జోగుళాంబ జోన్... జిల్లాలు: మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్, జనాభా: 44.63 లక్షలు. మల్టీజోన్ల పరిధిలోకి వచ్చే జోన్లు... 1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి 2. యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ. అనేక సమస్యలకు పరిష్కారం... కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడటంతో జిల్లా పోస్టులే కాదు మల్టీజోన్ పరిధిలోకి తెచ్చేలా నిర్ణయించిన 34 రకాల కేటగిరీ పోస్టుల్లో మరో 21 రకాల జోనల్ కేటగిరీ పోస్టులు 95 శాతం స్థానికులకే దక్కనున్నాయి. జోనల్ విధానానికి అనుగుణంగా రాష్ట్రం, జోన్, జిల్లాస్థాయి పోస్టుల వర్గీకరణకు మార్గం సుగమం అయింది. జిల్లా, జోనల్ స్థాయిలో స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు లభించడమే కాదు రాష్ట్రస్థాయి పోస్టుల విధానం తొలగింపు కారణంగా కీలకమైన ఆ పోస్టులు ప్రస్తుతం జోనల్ విధానంలో ఉన్న ఉద్యోగులకే పదోన్నతిపై దక్కనున్నాయి. ప్రస్తుతం జిల్లాస్థాయి పోస్టుల్లో 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ కేటగిరీ, జోనల్లో 70 శాతం స్థానికులకు, 30 శాతం ఓపెన్ కేటగిరీ, మల్టీజోన్‌లో స్థానికులకు 60 శాతం, ఓపెన్ కేటగిరీలో 40 శాతం విధానం ఉంది. అయితే ప్రభుత్వం ప్రతిపాదిత కొత్త విధానంలో రాష్ట్రస్థాయి కేడర్‌నే తొలగించింది. మిగతా అన్ని కేడర్లలో స్థానికులకు 95 శాతం, ఓపెన్ కేటగిరీలో 5 శాతం రిజర్వేషన్ వర్తించేలా నిర్ణయించింది. ప్రస్తుతం నాలుగు నుంచి 10వ తరగతి వరకు నాలుగేళ్లపాటు చదివిన వారిని తెలంగాణలో స్థానికులుగా గుర్తిస్తున్నారు. ఇకపై ఒకటి నుంచి ఏడవ తరగతి దాకా వరసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికులుగా గుర్తిస్తారు. -
జోన్ల పేరుతో కేసీఆర్ నాటకాలు: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కొత్త జోన్ల పేరుతో కేసీఆర్ సరికొత్త నాటకాలకు తెరతీశారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ కోసమే జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ చెబుతున్నారని, అయితే కొత్త జిల్లాలను ఆమోదానికే ఈ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఈ నాలుగున్నరేళ్లలో ఎప్పుడూ గుర్తుకు రాని నిరుద్యోగుల సమస్యలు కేసీఆర్‌కు ఇప్పుడే గుర్తుకు రావటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ఆలోచనలకు అనుగుణంగా కేసీఆర్ నడుచుకుంటున్నారని, మోదీకి అమిత్‌షా కన్నా కేసీఆరే సన్నిహితుడని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
ఉద్యోగాల జాతర.. 20 వేల పోస్టులు!
సాక్షి, హైదరాబాద్: 13 శాఖలు.. 20 వేల పోస్టులు... రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమల్లోకి వస్తే ఇప్పటికిప్పుడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉన్న గణాంకాలివి. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఈ మేరకు ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉద్యోగాల భర్తీతోపాటు అనేక రకాల సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రూప్–1 ఉద్యోగాల్లోని ఇంజనీర్ పోస్టుల మొదలు స్పెసిఫైడ్ గెజిటెడ్ కేటగిరీ పోస్టులు, మల్టీజోన్, జోనల్ పోస్టుల్లో ఇతర రాష్ట్రాల నుంచి పోటీపడే అభ్యర్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతోపాటు రాష్ట్రంలోని 31 జిల్లాల ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేస్తే గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకూ అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొంటున్నాయి. స్థానికతే కీలకంగా మారి 61 రకాల కీలక పోస్టుల్లోనూ 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. రాష్ట్రస్థాయి కీలక పోస్టులన్నీ పదోన్నతుల ద్వారా భర్తీ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి రాష్ట్రస్థాయి పోస్టుల తగ్గింపు, 34 రకాల పోస్టులు మల్టీజోన్‌లోకి రావడం లాంటి అంశాల్లో కూడా కొత్త జోనల్ విధానంతో సానుకూలత రానుంది. దీంతో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇచ్చిన హామీపై రాష్ట్రంలోని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమస్యలుండవు... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఎస్పీఎస్సీ మొదటగా ఇంజనీర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టగా ఒడిశా, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అవి జోనల్ పోస్టులే అయినా 30 శాతం ఓపెన్ కోటాలో అవకాశం ఉన్నందున మూడు రాష్ట్రాల నుంచి 70 మందికిపైగా అభ్యర్థులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అంతకంటే ఎక్కువ మందే దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాదు.. గ్రూపు–1 కేటగిరీలోని డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వంటి రాష్ట్రస్థాయి (స్పెసిఫైడ్ గెజిటెడ్ కేటగిరీ) పోస్టుల్లో 100 శాతం ఓపెన్ కోటానే. ప్రస్తుత నిబంధనల ప్రకారం వాటికి మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల వారూ పోటీ పడే అవకాశం ఉంది. అదే గ్రూపు–1 కేటగిరీలోని మిగతా పోస్టుల్లో కొన్ని మల్టీజోన్, మరికొన్ని జోనల్ పోస్టులు ఉండగా వాటిల్లోకి ఇతర రాష్ట్రాల వారు ఓపెన్ కేటగిరీ కింద మల్టీజోనల్‌లో 40 శాతం, జోనల్ కింద 30 శాతం మంది వస్తున్నారు. ఇప్పుడు కొత్త జోనల్ విధానం అమల్లోకి వస్తే వీటిలో 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కనున్నాయి. మారుమూల ప్రాంతాల యువతకు లబ్ధి... రాష్ట్రంలో ఉద్యోగాలను ప్రస్తుతం 31 జిల్లాలవారీగా కాకుండా పాత 10 జిల్లాల ప్రకారమే భర్తీ చేయాల్సి వస్తోంది. దీంతో కొత్త జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు చెందిన యువతీయువకులు వెనుకబడిపోతున్నారు. దరఖాస్తు చేసుకుంటున్నా పట్టణ ప్రాంతాల వారితో సమానంగా పోటీ పడలేకపోతున్నారు. అదే కొత్త జిల్లాలకు ఆమోదం లభిస్తే ప్రస్తుతం 10 జిల్లాలకు ఉన్న పోస్టులను 31 జిల్లాలకు విభజించి భర్తీ చేస్తారు. దీంతో ఆయా జిల్లాల్లో పోటీ తగ్గుతుంది. మూరుమూల ప్రాంత నిరుద్యోగులకూ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అందుకే కొత్త జోనల్ విధానం ఆమోదానికి రాష్ట్రం పట్టుదలతో ఉంది. ముఖ్యంగా 9 వేలకుపైగా పంచాయతీ కార్యదర్శి పోస్టులను కొత్త జోనల్ విధానం అమోదం తరువాత భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. తద్వారా 31 జిల్లాల్లోని మూరుమూల ప్రాంతాల నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించవచ్చని భావిస్తోంది. ఇవేకాదు మరో 12 శాఖల్లోని మరో 10 వేలకు పైగా పోస్టుల భర్తీకి కొత్త విధానంలో నోటిఫికేషన్లు జారీ చేయాలన్న ఆలోచనలో ఉంది. అనేక సమస్యలకు పరిష్కారం... కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే జిల్లా పోస్టులే కాదు మల్టీజోన్ పరిధిలోకి తెచ్చేలా నిర్ణయించిన 34 రకాల కేటగిరీ పోస్టుల్లో మరో 21 రకాల జోనల్ కేటగిరీ పోస్టులు 95 శాతం స్థానికులకే దక్కనున్నాయి. తెలంగాణలోని నిరుద్యోగ యువతకే, అందులోనూ స్థానికులకే ఉద్యోగ అవకాశాలు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ విధానం ఆమోదానికి ప్రధాని మోదీ హామీ ఇవ్వడంతో ఉద్యోగులు, నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అది అమల్లోకి వస్తే ఆ జోనల్ విధానానికి అనుగుణంగా రాష్ట్రం, జోన్, జిల్లాస్థాయి పోస్టుల వర్గీకరణకు మార్గం సుగమం కానుంది. ఆ దిశగా సీఎం కేసీఆర్ చర్యలు వేగవంతం చేశారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో ఈ అంశంపై చర్చించగా అందుకు మోదీ సానుకూలత వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రంలో కొత్త నియామక నిబంధనలకు మార్గం సుగమం అవుతుందన్న భావన వ్యక్తమవుతోంది. తద్వారా జిల్లా, జోనల్ స్థాయిలో స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు లభించడమే కాదు రాష్ట్రస్థాయి పోస్టుల విధానం తొలగింపు కారణంగా కీలకమైన ఆ పోస్టులు ప్రస్తుతం జోనల్ విధానంలో ఉన్న ఉద్యోగులకే పదోన్నతిపై దక్కనున్నాయి. ప్రస్తుతం జిల్లాస్థాయి పోస్టుల్లో 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ కేటగిరీ, జోనల్లో 70 శాతం స్థానికులకు, 30 శాతం ఓపెన్ కేటగిరీ, మల్టీజోన్‌లో స్థానికులకు 60 శాతం, ఓపెన్ కేటగిరీలో 40 శాతం విధానం ఉంది. అయితే ప్రభుత్వం ప్రతిపాదిత కొత్త విధానంలో రాష్ట్రస్థాయి కేడర్‌నే తొలగించింది. మిగతా అన్ని కేడర్లలో స్థానికులకు 95 శాతం, ఓపెన్ కేటగిరీలో 5 శాతం రిజర్వేషన్ వర్తించేలా నిర్ణయించింది. అందరికీ లబ్ధి చేకూరేలా... జోన్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం డైరెక్టు రిక్రూట్మెంట్ విధానం నుంచి 34 రకాల స్టేట్ కేడర్ (స్పెసిఫైడ్ గెజిటెడ్ కేటగిరీ) పోస్టులను తొలగించింది. వాటిని మల్టీ జోనల్ పరిధిలోకి తెచ్చి భర్తీ చేయాలని నిర్ణయించింది. కొత్త జోనల్, జిల్లా విధానం అమల్లోకి వస్తే ఆ ఉద్యోగాలు వచ్చిన వారు సర్వీసుపరంగా నష్టపోకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పోస్టుల భర్తీ ప్రక్రియను మల్టీజోనల్ స్థాయిలో చేసినా, పోస్టింగ్‌లు మాత్రం రాష్ట్రస్థాయి కేడర్‌లో ఇచ్చేలా చర్యలు చేపట్టింది. తద్వారా కన్ఫర్మ్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ప్రమోట్ అయ్యే వారికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. అంతేకాదు ఆ పోస్టులు తెలంగాణ నిరుద్యోగులకే వచ్చేలా చర్యలు చేపట్టింది. మల్టీజోనల్‌లో వాటిని భర్తీ చేయడం ద్వారా 95 శాతం రాష్ట్రస్థాయి పోస్టులు తెలంగాణ వారికే లభించనున్నాయి. గతంలో రాష్ట్రస్థాయి పోస్టుల్లో లోకల్ రిజర్వేషన్లు 50 శాతం మినహాయిస్తే మిగతా పోస్టులకు ఎవరైనా పోటీ పడే వీలుండగా ఇప్పుడది సాధ్యం కాదని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. మల్టీజోనల్ ఓపెన్ కోటా కేవలం 5 శాతమే ఉన్నందున ఇతర రాష్ట్రాల వారు పెద్దగా వచ్చే వీలుండదని చెబుతున్నారు. కొత్త జోనల్ విధానానికి ఆమోదం లభిస్తే అది అమలు చేసే వీలు ఏర్పడనుంది. కొత్త జోనల్ విధానం ఇదీ... తెలంగాణలో ప్రస్తుతమున్న రెండు జోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పడతాయి. అందులో మొదటి నాలుగు జోన్లను ఒక మల్టీజోన్‌గా మిగిలిన మూడు జోన్లను రెండో మల్టీజోన్‌గా పరిగణిస్తారు. మరోవైపు ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువులో వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు. ప్రతిపాదిత 7 జోన్లు ఇవీ... కాళేశ్వరం జోన్.. జిల్లాలు: భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జనాభా: 28.29 లక్షలు. బాసర జోన్... జిల్లాలు: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనాభా: 39.74 లక్షలు. రాజన్న జోన్... జిల్లాలు: కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జనాభా: 43.09 లక్షలు. భద్రాద్రి జోన్... జిల్లాలు: వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనాభా: 50.44 లక్షలు యాదాద్రి జోన్... జిల్లాలు: సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, జనాభా: 45.23 లక్షలు చార్మినార్ జోన్... జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, జనాభా: 1.03 కోట్లు జోగుళాంబ జోన్... జిల్లాలు: మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్, జనాభా: 44.63 లక్షలు. మల్టీజోన్ల పరిధిలోకి వచ్చే జోన్లు... 1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి 2. యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ. మల్టీజోన్ పరిధిలోకి వచ్చే స్టేట్ కేడర్ పోస్టులివీ... డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్, కో–ఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, లేబర్ సెక్రటరీ అండ్ గ్రేడ్–2 ట్రెజరర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (కమ్యూనికేషన్స్), అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, స్టాటిస్టిక్స్శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్, మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఆయుష్ డిపార్ట్మెంట్ లెక్చరర్స్, గ్రేడ్–అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. జోనల్ పరిధిలోకి వచ్చే గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులివీ... గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, కో–ఆపరేటివ్ సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, ఇండస్ట్రీస్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, హార్టీకల్చర్ ఆఫీసర్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ట్యూటర్, ఫిజికల్ డైరెక్టర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్. -
‘జోనల్’ ఆమోదం కోసం ఢిల్లీకి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం సాధించేందుకు తానే స్వయంగా ఢిల్లీ వెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతారు. జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం సాధించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తారు. రెండు,మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండి, అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలసి కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని వివరించాలని సీఎం నిర్ణయించారు. జోనల్ అవసరాన్ని చెప్పేందుకు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రాదాన్యం కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న జోనల్ వ్యవస్థ అవరోధంగా ఉందని ముఖ్యమంత్రి మొదటి నుంచి భావిస్తున్నారు. జోనల్ వ్యవస్థలో మార్పులకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. స్థానికులకే ఎక్కువ అవకాశాలు వచ్చేలా కొత్త జోనల్ వ్యవస్థకు రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సత్వర ఆమోదం సాధించి, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం నియామకాలు చేపట్టాలని గట్టి నిర్ణయంతో ఉన్నారు. రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం, స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల స్థానిక యువకులు ఎక్కువ అవకాశాలు పొందుతారని ఆయన భావించారు. ఇప్పుడు ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించనున్నారు. పీఎంవో వద్ద ఫైలు ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే ఎక్కువ ప్రయోజనం కలిగించడం కోసం 95 శాతం స్థానిక రిజర్వేషన్లతో తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ జోనల్ విధానానికి ఆమోదం తెలపాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. కేంద్ర న్యాయ శాఖ, హోం శాఖ ఇప్పటికే సానుకూలంగా స్పందించాయి. ఫైల్‌ను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపాయి. దీంతో ఫైల్ ఆమోదం కోసం తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి పర్యవేక్షించాలని సీఎం నిర్ణయించారు. -
మోదీ-కేసీఆర్ భేటీ; అపాయింట్మెంట్ ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 2:30 గంటలకు అపాయింట్మెంట్ ఖరారయినట్లు తెలిసింది. తెలంగాణలో నూతనంగా తీసుకొచ్చిన జోనల్ వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని మోదీని కేసీఆర్ కోరనున్నారు. గతంలో దొరకని అపాయింట్మెంట్: వాస్తవానికి గత నెలలోనే సీఎం కేసీఆర్.. పీఎం మోదీని కలవాల్సింది. ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఏకంగా నాలుగు రోజులు అక్కడే మకాం వేశారు. కానీ ఎంతకీ ప్రధాని అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో హైదరాబాద్ వెనుదిరిగారు. అదే సమయంలో మోదీ.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. -
రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరుగనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో జోన్ల విధానంపై చర్చించనున్నారు. కొత్తగా ఏర్పాటుచేయనున్న జోన్లు, మల్టీ జోన్లపై మార్పులు చేర్పులు, రైతులకు అమలుచేయనున్న జీవితబీమా పథకంపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. -
జోనల్ వ్యవస్థను ఒప్పుకోం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: జోనల్ వ్యవస్థ ఏర్పాటుతో ప్రభావితమయ్యే వర్గాలతో చర్చించకుండా వాటి పునర్వ్యవస్థీకరణ నిర్ణయం సరికాదని బీజేపీ అభిప్రాయపడింది. అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు, యువజన సంఘాలతో చర్చించిన తర్వాతనే జోన్లకు తుదిరూపం ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల దీర్ఘకాలంలో రాష్ట్ర పురోగతిలో సమతౌల్యం లోపించే అవకాశం ఉందని శుక్రవారం ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఫ్రీ జోనా, ఏడో జోన్ లేదా ఆరో జోన్లో భాగమా అనే అంశం తేలకనే తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. -
పోలీస్ రేంజ్‌లపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో జోన్లు, మల్టీజోన్ల పునర్వ్యవస్థీకరణతో పోలీస్ శాఖలోనూ నూతన రేంజ్‌లు, జోన్ల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖలో రెండు జోన్లు, నాలుగు రేంజ్‌లు ఉన్నాయి. వెస్ట్‌జోన్ (హైదరాబాద్) కింద ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలున్నాయి. అదేవిధంగా నార్త్‌జోన్ (వరంగల్) కింద ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉన్నాయి. నూతన జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు వెస్ట్‌జోన్ కింద, మరికొన్ని ప్రాంతాలు నార్త్‌జోన్ కిందకు వచ్చాయి. దీనితో సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ల పోస్టింగులు, వారి పై తీసుకునే క్రమశిక్షణ చర్యలు, మానిటరింగ్ తదితరాల పర్యవేక్షణకు సరిహద్దు సమస్యలు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న జోన్లు, మల్టీజోన్లతో పోలీస్ శాఖలో రేంజ్‌లు, జోన్ల పునర్వ్యవస్థీకరణ క్లారిటీ వచ్చినట్టుగా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఒక్కో జోన్ కింద రెండు రేంజ్‌లున్నాయి. జోన్లకు ఐజీ హోదా కలిగిన అధికారులుండగా, రేంజ్‌లను డీఐజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నూతనంగా మరో రెండు... ప్రస్తుతం కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ రేంజ్లుండగా, వీటికి తోడుగా మరో రెండు రేంజ్‌లు ఏర్పాటు చేసే అవకాశముందని పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. అదేవిధంగా ఇప్పుడున్న రేంజ్‌ల పేర్లు కూడా మార్పు జరిగే అవకాశం ఉందని, మొత్తంగా 6 రేంజ్‌లకు కొత్తపేర్లతో పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో రేంజ్ కింద 5 జిల్లాల పోలీస్ యూనిట్లు పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ జోన్‌తో పాటు మరో జోన్ కూడా ఏర్పాటు జరిగితే ఒక్కో జోన్ కింద రెండు రేంజ్‌ల పర్యవేక్షణ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. నూతనంగా ఏర్పడిన కమిషనరేట్లలో బదిలీలు, క్రమశిక్షణ చర్యలు ఎవరి అధీనంలో ఉండాలన్న దానిపై త్వరలో క్లారిటీ వస్తుందని, ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తామని సీనియర్ ఐపీఎస్‌లు స్పష్టం చేశారు. -
జీహెచ్ఎంసీలో కొత్త జోన్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో కొత్త జోన్లు, సర్కిళ్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. 15 వేలకు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా, మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరిపాలనలో వికేంద్రీకరణ సూత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం బలంగా నమ్ముతోందని, దీని ద్వారా ప్రజలకు పథకాలు మరింత వేగంగా చేరతాయని చెప్పారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ మునిసిపల్ కమిషనర్ల సంఘం డైరీని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, పురపాలనలో ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టామని, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని కేటీఆర్ తెలిపారు. పట్టణ ప్రాంతాలకు రక్షిత నీటి సరఫరా కోసం అర్బన్ మిషన్ భగీరథ పథకం కింద రూ.4,500 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ సంస్కరణల అమలులో మునిసిపల్ కమిషనర్లు కీలక పాత్ర వహించాలని కోరారు. కమిషనర్లు తాము పని చేస్తున్న పట్టణాలపై ప్రత్యేక ముద్ర వేయాలని, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ ఏడాది పలు పథకాలు కీలక దశకు చేరుకున్నాయని, వాటిని పూర్తి చేసే దిశగా పని చేయాలని ఆదేశించారు. మునిసిపల్ కమిషనర్లకు పద్నోతులు, ఖాళీల భర్తీ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ‘ఔటర్’ లోపల కొత్త పురపాలికలు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి గ్రామ పంచాయతీలను పురపాలికలుగా మార్చేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. ఓఆర్ఆర్ లోపల ప్రస్తుతం 167 గ్రామాలున్నాయని, వాటి భౌగోళిక పరిస్థితుల ప్రకారం కొత్త పురపాలికలుగా మారుస్తామని, లేదంటే ఇతర పురపాలికల్లో విలీనం చేస్తామని చెప్పారు. అమీన్పూర్, బొల్లారం, కొంపల్లి, పుప్పాలగూడ, ప్రగతినగర్, తెల్లాపూర్, కొల్లూర్, తుర్కయాంజాల్ సహా మరికొన్ని గ్రామాల ను కొత్త పురపాలికలుగా ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నామన్నారు. కొత్త పురపాలికల ఏర్పాటుపై పురపాలక, పంచాయతీరాజ్ శాఖాధికారులు.. రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, సంగారెడ్డి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నగర ఎమ్మెల్సీలు, ఎంపీలు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో సోమవారం సచివాలయంలో మంత్రి సమావేశం నిర్వహించారు. 15 వేలకు మించి జనాభా ఉన్న పంచాయితీలను నగర పంచాయతీలు, మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేటీఆర్ తెలిపారు. పురపాలికల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. పురపాలికల ఏర్పాటు తర్వాత కనీసం రెండేళ్లు పన్ను పెంపు ఉండదని చెప్పారు. కొత్త పురపాలికలకు ప్రభుత్వ నిధులూ కేటాయిస్తామన్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోందని, ఇళ్ల నిర్మాణంలో కొత్త పురపాలికలనూ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. స్థానిక ప్రజాప్రతనిధులను సమన్వయం చేసుకొని పరిస్థితుల మేరకు పురపాలికల ఏర్పాటు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదనల రూపకల్పనకు స్థానిక ఎమ్మెల్యేలతో కలసి పని చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. -
మండల్ పాలన!
బాలారిష్టాల్లో కొత్త మండలాలు ► గాడిన పడని పాలనా వ్యవస్థ ► సిబ్బంది సరిపడా లేక అవస్థ ► ప్రతి పనికీ మాతృ మండలమే దిక్కు ► చుక్కలు చూపిస్తున్న ‘రెవెన్యూ పనులు’ ► తహసీల్దార్ మినహా మిగతా పోస్టులు ఖాళీ ► కూర్చోవడానికి కుర్చీలూ కరువే.. మండలస్థాయిలో పాలన ఇంకా గాడిన పడలేదు. కొత్త మండలాలు పురుడు పోసుకున్నా.. పరిపాలన మాత్రం పక్క మండలాల నుంచే సాగుతోంది. దసరా రోజున ఘనంగా ప్రారంభమైన నూతన మండలాల్లో ఇంకా పూర్తిస్థాయిలో యంత్రాంగం కొలువుదీరలేదు. దీంతో రెవెన్యూ రికార్డులన్నీ మాతృ మండలాల్లోనే భద్రపరచడంతో ప్రతి ఫైలుకు పాత మండలంపైనే ఆధారపడాల్సి వస్తోంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆరు తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పడ్డాయి. నందిగామ, చౌదరిగూడ, అబ్దుల్లాపూర్‌మెట్, గండిపేట, బాలాపూర్, కడ్తాలలు కొత్త మండలాలు. ఇవి అక్టోబర్ 11న విజయదశమి నాడు కొత్త జిల్లాలు ఆవిర్భవించిన రోజునే లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అయితే, బాలారిష్టాలు మాత్రం ఇప్పటికీ అధిగవిుంచలేదు. – సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి కొత్త మండలాల్లో ఇదీ పరిస్థితి.. ♦ కడ్తాల్: డిప్యూటీ తహసీల్దార్ (డీటీ), సర్వేయర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. తహసీల్దార్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. వ్యవసాయ శాఖకు కార్యాలయం లేదు. తహసీల్దార్ కార్యాలయంలోనే కొనసాగుతోంది. ♦ చౌదరిగూడెం: సర్వేయర్ పోస్టు ఖాళీగా ఉంది. మిగిలిన పోస్టులు భర్తీ అయ్యాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త మండలాల్లో పూర్తిస్థాయిలో తహసీల్దార్లు కొలువుదీరినా.. మిగతా పోస్టులు మాత్రం దాదాపు అన్నిచోట్ల ఖాళీగానే ఉన్నాయి. జిల్లాల పునర్విభజనకు ముందే ప్రతి ఫైలును జిల్లా యంత్రాంగం స్కానింగ్ చేసింది. ఈ రికార్డులని్నంటినీ మాతృ జిల్లా, మండలాల్లో భద్రపరిచింది. స్కాన్ చేసిన పహాణీ తదితర రికార్డులను చూసుకునే వెసులుబాటును రెవెన్యూ అధికారులకు కల్పించింది. ఇది ఒకింత మంచిదే అయినా.. అర్జీదారులకు మాత్రం చుక్కలు చూపుతోంది. ఏదైనా పనికి దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ ఉద్యోగులు పాత మండలాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. స్కాన్ కాపీలను చూసి ఫైలును ప్రతిపాదించలేమని అధికారులు తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రికార్డుల కోసం పాత ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. దీంతో సమయమంతా వృథా కావడంతో అర్జీదారులు లబోదిబోమంటున్నారు. దీనికితోడు పరిపాలనాపరంగా సాంకేతిక సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. అరకొర సిబ్బంది.. ఇబ్బడిముబ్బడిగా నయా మండలాలు ఏర్పడడం.. తగినంత సిబ్బంది లేకపోవడంతో పరిపాలనపై తీవ్రప్రభావం చూపుతోంది. చాలావరకు కొత్త మండలాల్లో సిబ్బందిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా.. పలు మండలాల్లో పూర్తిస్థాయి యంత్రాంగం కొలువుదీరలేదు. దీంతో నూతన మండలాల పరిధిలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా సర్వేయర్లు అందుబాటులో లేక భూముల సర్వే నిలిచిపోతోంది. తహసీల్దార్ కార్యాలయాల్లో అరకొర సిబ్బంది ఉండగా.. ఇక ఎంఈఓ ఆఫీసులు మొదటి రోజుతోనే మూతపడ్డాయి. కొత్త మండలాల పరిధికి అనుగుణంగా కొత్త పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు. ఇవి మాత్రం బాగానే పనిచేస్తున్నా.. కేసు నమోదు అధికారం మాత్రం పాత ఎస్హెచ్ఓల వద్దే ఉంది. వ్యవసాయ అధికారులు మాత్రం తహసీల్దార్ భవనంలోనే ఒక మూలకు విధులు నిర్వర్తిస్తున్నారు. అత్తెసరు ఫర్నిచర్.. కార్యాలయ నిర్వహణకు కొంతమేర నిధులు సర్దుబాటు చేసినా.. చాలా దఫ్తార్లలో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా ఫర్నీచర్ ఉండాలి. కానీ, ఆ పరిస్థితి ఆఫీసుల్లో కనిపించడంలేదు. ఎవరైనా వస్తే కూర్చోవడానికి కొన్ని కార్యాలయాల్లో కుర్చీలు సైతం లేవు. కొత్త మండలాల్లో ఇదీ పరిస్థితి.. ♦ నందిగామ: తహసీల్దార్, డిటీ, సీనియర్ అసిస్టెంట్ తప్ప రెండు ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్, సర్వేయర్, టైపిస్ట్, మూడు సబార్డినేట్ పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ♦ బాలాపూర్ : మండలంలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. తహసీల్దార్, డీటీ, సర్వేయర్లు విధుల్లో కొనసాగుతున్నారు ♦ అబ్దుల్లాపూర్‌మెట్: మండలంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ. ♦ గండిపేట: మండలంలో సర్వేయర్, ఒక ఆర్ఐ పోస్టు ళాళీగా ఉంది. తహసీల్దార్ ఉన్నప్పటికీ రాజేంద్రనగర్‌కు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు మండలాలకు కలిపి ఒక సర్వేయర్ పనిచేస్తున్నాడు. గండిపేట మండలానికి సంబంధించిన రికార్డులన్నీ రాజేంద్రనగర్ కార్యాలయంలోనే ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
దసరా నుంచే కొత్త జిల్లాలు..
♦ ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ స్పష్టీకరణ ♦ మార్పులు, చేర్పులపై సూచనలు అడిగిన సీఎం ♦ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండాలని సూచన ♦ ఇక పక్కాగా నిజామాబాద్, కామారెడ్డి రెండు జిల్లాలు ♦ కొత్త మండలాలు పదే.. బాన్సువాడ రెవెన్యూ డివిజన్.. ♦ కలెక్టర్ ప్రతిపాదనలకు ఓకే అన్న ప్రజాప్రతినిధులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రశేఖర్‌రావు ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టతనిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు అంశాలను సమీక్షించారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కొత్తగా ఏర్పడే బాన్సువాడ రెవెన్యూ డివిజన్, 10 మండలాలు, కామారెడ్డి జిల్లాపై చర్చ జరిగింది. కొద్దిపాటి మార్పులు, చేర్పులను ప్రజాప్రతినిధులు సూచించినా.. మొత్తంగా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అధికార యంత్రాంగంతో కసరత్తు చేసి ఇచ్చిన నివేదికకు ప్రజాప్రతినిధులు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. దసరా నుంచే కొత్త జిల్లాల ఏర్పాటు, పరిపాలన ప్రారంభం అవుతుందని ఉద్ఘాటించారు. జిల్లాల పునర్విభజన స్పష్టంగా ఉండాలని, పేర్కొన్న సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించినట్లు తెలిసింది. అధికారులకు సహకరించాలని సూచన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించిన అనంతరం దసరా నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం అవుతుందని సూచించినట్లు ప్రజాప్రతినిధులు కొందరు ‘సాక్షి’కి తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు, పునర్విభజన ప్రక్రియపై జరుగుతున్న కసరత్తు, మార్పులు, చేర్పులకు సంబంధించిన తుది నిర్ణయాలను సీఎం ప్రకటించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లా ఏర్పాటు జరుగనుంది. దీనికి సంబంధించి కలెక్టర్ యోగితారాణా అందించిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ వెల్లడించగా, దాదాపుగా ప్రజాప్రతినిధులు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. అంతే కాకుండా రెండు జిల్లాలకు సంబంధించి మెదక్ జిల్లా మంత్రులు, నిజామాబాద్ జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు పరస్పరం అంగీకారం తెలిపారు. దీంతో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి వినతులు, పరిశీలనలు లేకుండా పోయాయి. రాష్ట్రంలో 14 కొత్త జిల్లాలు, 74 మండలాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉండగా, ఒక్కో జిల్లాకు సగటున 20 మండలాలు ఏర్పాటు కానున్నాయి. దీని పరంగా నిజామాబాద్ జిల్లాలో కొత్తగా పది మండలాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కలెక్టర్ రూపొం దించిన నివేదికలు కూడా ఆమోదం పొంది నట్లు సమాచారం. దీంతో ఏలాంటి పునపరిశీలన లేకుండా మండలాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ముసాయిదా వెల్లడి, అభిప్రాయాల సేకరణ ఇక లాంఛనమే కానుంది. జిల్లాల ఏర్పాటులో జిల్లా కేంద్రానికి సంబంధించి దగ్గరగా ఉన్న మండలాలు, నియోజకవర్గాలను పాత జిల్లాలోనే కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు దగ్గరగా ఉన్న మండలాలు జిల్లాలోనే కొనసాగే అవకాశం ఉంది. నియోజక వర్గాలు ఇదే తీరులో కొనసాగే అవకాశం ఉంది. ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతాలను పట్టణాలుగా, అర్బన్ మండలాలుగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. బాన్సువాడ రెవెన్యూ డివిజన్ జిల్లాలో బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌గా అవకాశం ఉంది. ఇదివరకే ప్రతిపాదనలు వెల్లగా దీనికి సీఎం అంగీకరించినట్లు తెలిసింది. బాన్సువాడ ఒక్కటే రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కానుంది. దీంతో కొంత కాలంగా జిల్లాలో కామారెడ్డి జిల్లా ఏర్పాటు అందులో ఏఏ ప్రాంతాలు వెలుతాయోనని అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. పునర్విభజనకు సీఎం అంగీకారం తెలుపడంతో కామారెడ్డి జిల్లాకు నాలుగు నియోజకవర్గాలతో పునర్ విభజన చేపట్టగా దీనికి స్పష్టమైన ఆమోదం లభించింది. నిజామాబాద్ జిల్లాలో ఐదు నియోజకవర్గాలతో కొనసాగనుంది. అయితే మండలాల్లో కొద్దిపాటి మార్పులను ప్రజాప్రతినిధులు కోరినట్లు తెలిసింది. ఈ మేరకు కొత్తగా ఏర్పడే మండలాలు నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ రూరల్, మోపాల్, రుద్రూరు, కామారెడ్డి రూరల్ (దేవునిపల్లి), రామారెడ్డి, ఆలూరు, రెంజర్ల, బోధన్ రూరల్, ఇందల్వాయిలు ఉంటాయి. కాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు మండలాల ఏర్పాటు పునర్ విభజనకు సంబంధించి మార్పు చేర్పులపై సలహాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులను ఆదేశించారు. అభివృద్ధికి సంబంధించి ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు సలహాలు, సూచనలు అందించాలని కోరినట్లు తెలిసింది. ముఖ్యంగా స్థానిక ప్రజలకు ఆ ప్రాంతం ఎక్కడ ఉండాలో గుర్తించి ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటుందో తెలుసుకొని వారికి అన్యాయం జరుగకుండా సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రజాప్రతినిధులు పాటుపడాలన్నారు. చిన్న జిల్లాలతో పరిపాలన బాగుంటుందని పేద కుటుంబాలను గుర్తించి అభివృద్ధిలోకి తీసుకురావాలని జిల్లా కేంద్రాలన్ని అభివృద్ధి కేంద్రాలుగా మారాలని కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రణాళికలు రూపొందించలన్నారు. అదే విధంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చే విమర్శలను పట్టించుకోవద్దని, ఈ విషయంలో అధికారులకు సహకరించాలని సూచించినట్లు సమాచారం. -
పరిపాలన సౌలభ్యానికే జనాభా ప్రాతిపదికన ఏర్పాటు
అధికారుల సమీక్షలో కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం టీటీడీసీ సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల ఏర్పాటు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు సంయుక్తంగా పరిశీలన చేసి నివేదికలు పంపాలన్నారు. జనాభా ప్రాతిపదికను దృష్టిలో పెట్టుకుని నివేదికలు రూపొందించాలని చెప్పారు. మండలానికి దూరంగా ఉన్న గ్రామ పంచాయతీలను దగ్గరగా ఉన్న మండలాలకు బదలాయించడానికి పంచాయతీ తీర్మానం చేయాలన్నారు. మండలాల ఏర్పాటుకు సంబంధించి రూపొందించిన నివేదికల్లో మౌలిక వసతుల కల్పనకు అనువుగా ఉండాలన్నారు. రహదారి అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడిబయట ఉన్న పిల్లలందరిని బడిలో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా చూడాలన్నారు. మరుగుదొడ్లు లేని పాఠశాలలో 45 రోజుల్లో మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్య కార్యక్రమాలను పంచాయతీల ద్వారా నిర్వహించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయో లేదో తహసీల్దార్లు, ఎంపీడీఓలు తనిఖీ చేయాలన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా మురుగు నిల్వలను లేకుండా చూడాలన్నారు. నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను నిర్మిస్తే నీరు నిల్వ ఉండదని చెప్పారు. రహదారుల పక్కన వ్యర్థాలను వేయకుండా గ్రామపంచాయతీల ద్వారా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. హరితహారం పథకం కింద మండలాల్లో నిర్దేశించిన లక్ష్యాల కంటే అధికంగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాదా బైనామాలపై మీసేవ కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని చెప్పారు. భూ కొనుగోలుపై తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాకు కొత్తగా మంజూరు చేసిన 17 పాఠశాలల నిర్మాణాలకు భూమి సేకరించి నివేదికలు పంపాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, సీపీఓ రాందాస్, ఖమ్మం, కొత్తగూడెం ఆర్డీఓలు వినయ్‌కృష్ణారెడ్డి, రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.