సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం సాధించేందుకు తానే స్వయంగా ఢిల్లీ వెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతారు. జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం సాధించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తారు. రెండు,మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండి, అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలసి కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని వివరించాలని సీఎం నిర్ణయించారు.
జోనల్ అవసరాన్ని చెప్పేందుకు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రాదాన్యం కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న జోనల్ వ్యవస్థ అవరోధంగా ఉందని ముఖ్యమంత్రి మొదటి నుంచి భావిస్తున్నారు. జోనల్ వ్యవస్థలో మార్పులకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. స్థానికులకే ఎక్కువ అవకాశాలు వచ్చేలా కొత్త జోనల్ వ్యవస్థకు రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సత్వర ఆమోదం సాధించి, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం నియామకాలు చేపట్టాలని గట్టి నిర్ణయంతో ఉన్నారు. రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం, స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల స్థానిక యువకులు ఎక్కువ అవకాశాలు పొందుతారని ఆయన భావించారు. ఇప్పుడు ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించనున్నారు.
పీఎంవో వద్ద ఫైలు
ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే ఎక్కువ ప్రయోజనం కలిగించడం కోసం 95 శాతం స్థానిక రిజర్వేషన్లతో తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ జోనల్ విధానానికి ఆమోదం తెలపాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. కేంద్ర న్యాయ శాఖ, హోం శాఖ ఇప్పటికే సానుకూలంగా స్పందించాయి. ఫైల్‌ను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపాయి. దీంతో ఫైల్ ఆమోదం కోసం తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి పర్యవేక్షించాలని సీఎం నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment