సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రాధాన్యతను చాటి చెప్పడం.. అదే సమయంలో బీజేపీ, ప్రధాని మోదీ విధానాలు, పాలనా వైఫల్యాలను ఎండగట్టడం లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా కార్యాచరణ ప్రణాళికకు పదును పెడుతున్నారు. ఇప్పటికే దీనిపై జాతీయ స్థాయిలో పలు పార్టీల నేతలు, ఆర్ధిక వేత్తలు, జాతీయ మీడియా రంగ ముఖ్యులు, సీనియర్, రిటైర్డ్ అధికారులతో చర్చలు జరిపిన కేసీఆర్.. తాజాగా అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతోనూ వరుసగా భేటీ అవుతున్నట్టు తెలిసింది.
జాతీయ రాజకీయాల్లో నెలకొన్న శూన్యత.. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ప్రధాని మోదీ వైఫల్యాలను ఎత్తిచూపడంతోపాటు దేశ భవిష్యత్తు పట్ల తనకున్న అవగాహన, దూరదృష్టిని వివరిస్తున్నట్టు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో వివిధ రంగాల వారితో చర్చల ద్వారా జాతీయ స్థాయిలో ప్రభావం చూపేందుకు ఏం చేస్తే బాగుంటుందన్న దానిపైనా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్టు వివరించాయి. డిసెంబర్‌లో ఢిల్లీ వేదికగా భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వెల్లడించాయి.
అంతర్జాతీయ మీడియాలతో మంతనాలు
జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే పలు జాతీయ పత్రికలు, చానళ్ల అధిపతులు, ప్రతినిధులతో కేసీఆర్ సంప్రదింపులు జరిపి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగించారు. ఎనిమిది రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆయన.. అదే తరహాలో అంతర్జాతీయ మీడియా సంస్థల అధిపతులు, ప్రతినిధులతో వరుసగా భేటీలు జరుపుతున్నారు. కొందరు అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో రెండు రోజులుగా ఫోన్ ద్వారా కూడా మంతనాలు జరుగుతున్నట్టు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
కేసీఆర్ మంతనాలు సాగిస్తున్న అంతర్జాతీయ మీడియా సంస్థల జాబితాలో వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, అల్‌జజీరా, రాయిటర్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్, బీబీసీ వంటి పత్రికలు, టీవీ చానళ్లు ఉన్నట్టు తెలిపాయి. వారితో జరుగుతున్న చర్చల సందర్భంగా పార్టీ ఆవిర్భావ సభకు హాజరుకావాల్సిందిగా కేసీఆర్ ఆహ్వానం పలుకుతున్నారని వివరించాయి. ఎమ్మెల్సీ కవితతోపాటు జాతీయ మీడియాలో పేరొందిన ఓ జర్నలిస్టు అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధుల భేటీలో సమన్వయకర్తలుగా పనిచేస్తున్నట్టు సమాచారం.
ఉద్దేశాన్ని చాటి చెప్పేందుకు..
ఆషామాషీగా జాతీయ రాజకీయాల్లోకి రావడం లేదని ఇటు దేశంలో, అటు ప్రపంచవ్యాప్తంగా తన ఉద్దేశాన్ని చాటేందుకే కేసీఆర్ అంతర్జాతీయ మీడియా సంస్థలతో భేటీ అవుతున్నట్టు సమాచారం. విదేశీ వ్యవహారాల్లో, ఇతర అంశాల్లో మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో అమెరికా ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు అనుకూలంగా మోదీ చేసిన ప్రకటనను కేసీఆర్ పలు సందర్భాల్లో ఎండగట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.
ఈ క్రమంలో అంతర్జాతీయ అంశాలపైనా బీఆర్‌ఎస్ దృక్పథం ఎలా ఉండాలనే కోణంలో కసరత్తు చేస్తున్న కేసీఆర్.. పార్టీ ఆవిర్భావ సభలో ఆ అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఆర్థికవేత్తలు, జాతీయ మీడియా రంగానికి చెందిన ప్రముఖులు, రిటైర్డు అధికారులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, రైతు, దళిత సంఘాల ప్రతినిధులు తదితరులతో ఇప్పటికే భేటీ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అంతర్జాతీయ వ్యవహరాలపై పట్టు కలిగిన కొందరు మాజీ దౌత్యవేత్తలతోనూ కేసీఆర్ మంతనాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం.
రాజకీయ శూన్యతను భర్తీ చేయడంపై..
ప్రస్తుతం జాతీయ స్థాయిలో మోదీని ఎదుర్కోవాలంటే బలమైన ప్రతిపక్షం అవసరం ఉందని.. ప్రస్తుత జాతీయ పార్టీలతో అది సాధ్యమయ్యేది కానందున ఈ రాజకీయ శూన్యతను బీఆర్‌ఎస్ భర్తీ చేస్తుందని అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు కేసీఆర్ వివరిస్తున్నట్టు తెలిసింది. ఉద్యోగాల కల్పన, ధరల కట్టడిలో కేంద్రం వైఫల్యాలు, ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడం, ద్రవ్యోల్బణ కట్టడి సవాళ్లను ఎదుర్కోవడంలో ఉదాసీనత, కార్పోరేట్లకే పెద్దపీట వేసేలా ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేలా ఉన్న నిర్ణయాలు వంటి అంశాలపైనా మాట్లాడుతున్నట్టు సమాచారం. రాష్ట్రాల అధికారాలకు కత్తెర, వ్యవహారాల్లో జోక్యం, రాజకీయ నేతలు, పార్టీలపై కక్ష సాధింపులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. మోదీ తీరును తుర్పారపట్టినట్టు తెలిసింది. మోదీ విదేశాంగ విధానంపైనా సునిశిత విమర్శలు చేసినట్టు చెప్తున్నారు.
మరో ఐదు రోజులు ఢిల్లీలోనే..
సీఎం కేసీఆర్ మరో 5 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించాల్సి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీనియర్ ఐఏఎస్‌లు రజత్‌కుమార్, అరవింద్‌కుమార్‌లను కేసీఆర్ ఢిల్లీకి పిలిపించుకున్నారు. పాలనాపరమైన అంశాలపై వారితో మాట్లాడనున్నట్టు సమాచారం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అందాల్సిన రుణాలు, ఇతర బకాయిలు వంటి అంశాలపై కేంద్ర అధికారులతో సంప్రదింపుల కోసమే వారిని ఢిల్లీ పిలిపించినట్టు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment