మారుమూల.. బదిలీ లీల!  | TS Govt Employees Allocation Dispute District Cadre New Zonal Policy | Sakshi
Sakshi News home page

మారుమూల.. బదిలీ లీల! 

Published Mon, Dec 27 2021 3:18 AM | Last Updated on Mon, Dec 27 2021 3:18 AM

TS Govt Employees Allocation Dispute District Cadre New Zonal Policy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త జోనల్‌ విధానం అమలులో భాగంగా జిల్లా కేడర్‌లోని ఉద్యోగుల కేటాయింపు వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గాల్లో ఈ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త జిల్లాలకు బదిలీ అయిన జూనియర్‌ ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలో నిర్ధారించే ఆదేశాలు ఈ నెల 30 లోగా విద్యాశాఖ ఇవ్వబోతోంది. ఈలోగా ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే సమస్య తలెత్తింది. ఇప్పటికే స్థానికత పేరుతో సొంత జిల్లాలు వదులుకున్నామని, కొత్త ప్రాంతాల్లోనూ మారుమూల ప్రాంతాలకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చాలా జిల్లాల్లో వెళ్ళిన ఉద్యోగుల కన్నా పోస్టులు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో దూర ప్రాంతాల్లో ఉద్యోగులకు సరిపడా పోస్టులే ఖాళీగా ఉంచి, మిగతా వాటిని బ్లాక్‌ చేస్తున్నారు. అయితే ఆప్షన్లకు అవకాశమిచ్చే ప్రాంతాలన్నీ జిల్లాల్లో మారుమూల ప్రదేశాల్లోనే ఉంటున్నాయని టీచర్లు అంటున్నారు. ఈ రకంగానూ తమకు అన్యాయం జరుగుతోందని మహబూబాబాద్‌కు బదిలీ అయిన టీచర్‌ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. 

మల్టీ జోనల్‌ తేలకుండా ఆప్షన్లా? 
భార్యాభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పిస్తూ జిల్లా కేడర్‌ నుంచి ఆప్షన్లు కోరారు. ఈ గడువు కూడా 27 వరకే ఉంది. అయితే ఇంతవరకు మల్టీ జోనల్‌ పోస్టుల కేటాయింపు జరగలేదు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సోమవారం ప్రకటించే వీలుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భార్యా, భర్తల్లో జిల్లా కేడర్‌లో ఒకరు, మల్టీ జోనల్‌లో మరొకరు పనిచేస్తుంటే.. జిల్లా కేడర్‌లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆప్షన్‌ ఇస్తారు. మల్టీ జోనల్‌లో పనిచేసే భర్త లేదా భార్యకు ఆ అవకాశం ఇప్పుడు లేదు. అలాంటప్పుడు ఇద్దరు ఒకేచోట పనిచేసే వీలు ఎలా ఉంటుందని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.

అన్ని కేడర్ల కేటాయింపు జాబితాలు ప్రకటించాకే ఆప్షన్లు పూర్తి చేయాలని కోరుతున్నారు. స్థానికంగా ఉండే ఉపాధ్యాయుల్లోనూ బదిలీల ప్రక్రియ గుబులు రేపుతోంది. ఏళ్ళ తరబడి పనిచేస్తున్న టీచర్లు తాము కోరుకునే ప్రదేశాన్ని కొత్తగా వచ్చే వారితో నింపితే తమకెలా న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీనియారిటీ జాబితాలపైనా అన్ని స్థాయిల్లో వివాదం పెరుగుతోంది. వీటిపై అప్పీలుకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

రేపు సచివాలయం ముట్టడి 
బలవంతపు బదిలీలను నిరసిస్తూ మంగళవారం సచివాలయం ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపునిచ్చింది. అత్యవసరంగా వర్చువల్‌ పద్ధతిలో భేటీ అయిన స్టీరింగ్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంఘం నేతలు చావా రవి తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుం డా అమలు చేస్తున్న బదిలీలు హేతుబద్ధంగా లేవని, అందుకే ఆందోళన బాట పట్టామని తెలిపారు. 

పరస్పర బదిలీలకు అవకాశమివ్వాలి  
పరస్పర బదిలీల ద్వారా ఎస్‌జీటీలు సొంత ప్రాంతంలో పనిచేసే అవకాశం కల్పించాలి. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే వీలు కల్పించాలి. కొత్త జిల్లాల్లో పాఠశాలల కేటాయింపును ముందే ప్రకటించాలి. అంతర్‌ జిల్లా బదిలీల్లోకి వెళ్ళిన టీచర్లకు కొత్త జిల్లా కేటాయిస్తే ఉద్యోగంలో చేరిన తేదీని సీనియారిటీగా గుర్తించాలి. సీనియారిటీలో జరిగిన అవకతవకలను తక్షణమే సరిచేయాలి.  – కరివేద మహిపాల్‌ రెడ్డి, అరికల వెంకటేశం (అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి.. సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ సంఘం) 

అప్పుడే ఆప్షన్లు న్యాయం కాదు  
మల్టీ జోనల్‌ పరిధిలోకి వచ్చే గెజిటెడ్‌ హెడ్మాస్టర్ల కేటాయింపు పూర్తవ్వకుండా, జిల్లా కేడర్‌ ఆప్షన్లు కోరడం న్యాయం కాదు. దీనివల్ల భార్యాభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కోల్పోతారు. కేటాయింపు అన్ని స్థాయిల్లో పూర్తయిన తర్వాతే జిల్లాల్లో ఎక్కడ పనిచేయాలనేది నిర్ణయించాలి. – రాజా భానుచంద్రప్రకాశ్‌ (గెజిటెడ్‌ హెడ్మాస్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు) 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement