govt employees transfers
-
స్థానికత తలకిందులవుతోంది!
జీవో 317 ప్రస్తుతం ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను కలవరపెడుతున్న అంశంగా మారింది. ఏ స్థానికత కోసమని, సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామో, అదే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క జీవోతో వారి స్థానికత ప్రశ్నార్థకంగా మారింది. సీనియారిటీని ప్రామాణికంగా తీసుకుని స్థానిక తను విస్మరించి ఈ జీవోని అమలు చేయాలని ప్రయ త్నించిన కారణంగా సీనియర్ ఉపాధ్యాయులంతా మెరుగైన సదుపాయాలు, అభివృద్ధి ఉన్న జిల్లాల్లో పని చేసే అవకాశం పొందుతారు. అదే సమయంలో జూని యర్లంతా వెనుకబడిన ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది. ఫలితంగా జూనియర్లు బదిలీ అయిన జిల్లాల్లో రెండు, మూడు దశాబ్దాల పాటు కొత్త కొలు వులు ఏర్పడే అవకాశం ఉండదు. ఇదే జరిగితే ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల నుండి తీవ్రమైన నిరసనలు ప్రభుత్వం ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పరి గణనలోకి తీసుకుంటే... మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలను సీనియర్ ఉపాధ్యాయులు ఎక్కువగా కోరుకోవడంతో... జూనియర్ ఉపాధ్యాయులు/ ఉద్యో గుల కేటాయింపులు అధిక సంఖ్యలో కొమురం భీమ్ ఆసిఫాబాద్‌కి జరిగాయి. దీంతో అక్కడ 20 నుండి 25 సంవత్సరాల పాటు కొత్త ఉద్యోగాలు ఏర్పడవు. అందువల్ల ఇప్పటికే ఆ జిల్లాలో నిరుద్యోగుల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 317 జీవోను ఇంత హడావిడిగా అమలు చేయడానికి ప్రయత్నించడంతో అనేక నష్టాలు కలుగు తున్నాయి. తుది సీనియారిటీ జాబితాలు ప్రకటించి, వాటిపై అభ్యంతరాలను స్వీకరించకుండానే కేటాయిం పులు జరపడం వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు వారి సీనియారిటీకి వ్యతిరేకంగా వేరే జిల్లాకు వెళ్లవలసి వచ్చింది. కేటాయింపులపై జిల్లా స్థాయిలో వందలాది అభ్యంతరాలు రావడం, న్యాయపరమైన అభ్యంతరా లను సరి చేసే అవకాశం జిల్లా స్థాయిలో/జోన్ స్థాయిలో ఉన్న అధికారికి లేకపోవడం మూలంగా... అనేకమంది ఉద్యోగ, ఉపాధ్యాయులు చేయని తప్పుకు బలయ్యారు. మారుమూల ప్రాంతాలకు బలవంతంగా బదిలీ అయ్యారు. వీరు పూర్వం పనిచేస్తూ ఉన్న ప్రదే శాలను ఖాళీగా చూపి ఇటీవలే జిల్లాకు కేటాయించిన ఉద్యోగ, ఉపాధ్యాయులతో భర్తీచేయడం మూలంగా... న్యాయపరమైన అప్పీలు చేసుకున్న ఉద్యోగ, ఉపా ధ్యాయులకు విచారణలో అన్యాయం జరిగిందని గుర్తించినచో... వారికి తిరిగి వారి ప్రాధాన్యత ప్రకారం పూర్వం పని చేస్తున్న జిల్లాకు కేటాయించే అవకాశం ప్రభుత్వం కల్పించాలి. అలా అవకాశం కల్పించకపోతే మరింతమంది కోర్టులను ఆశ్రయిస్తారు. దంపతులకు ఒకే జిల్లా కేటాయిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, తాను తీసుకున్న అనాలోచిత, హడావుడి నిర్ణయం కారణంగా 13 జిల్లాలో ఉపాధ్యాయుల స్పౌస్ బదిలీలను బ్లాక్ చేయా ల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అలాగే మారుమూల ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతంలో అదే ప్రాంతంలోని స్థానికులుగా ఉన్న నిరుద్యోగులకు అవకాశం కల్పిం చడం వల్ల వారికి భాష అవరోధం ఉండకుండా సొంత ప్రాంతం అభివృద్ధికి పాటు పడతారు అనే అభి ప్రాయం వల్ల ఏజెన్సీ, మైదాన ప్రాంతాలుగా వర్గీకరణ చేసిన తరువాతే ఉపాధ్యాయుల నియామకాలు వేర్వేరుగా చేపడుతున్నారు. కానీ ప్రస్తుత కేటాయిం పులలో ఏజెన్సీ, మైదానం అన్న భావనలు విస్మరిం చడం మూలంగా స్థానికత విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. వితంతువు, వికలాంగులకు కేటాయిం పులలో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వారిపట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంతో అనేకమంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరికొందరు గుండె ఆగి మరణిస్తున్నారు. కొన్ని జిల్లా స్థాయి పోస్టులను జోనల్ స్థాయిలోకి మార్చితే రాబోయే కాలంలో తిరిగి వారి అభీష్టం మేరకు జిల్లా లేదా జోన్‌కి రాగలం అన్న ఆశ సజీవంగా ఉండేది. ఇంతగా వేతన జీవులు విగత జీవులుగా మారే దయనీయ స్థితి తలెత్తేది కాదు. ప్రభుత్వం 317 జీవోపై ఈ అన్ని సంగతులనూ దృష్టిలో ఉంచుకొని పునరాలోచిస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. – జి. శ్రీనివాస్, ఉపాధ్యాయులు -
మారుమూల.. బదిలీ లీల!
సాక్షి, హైదరాబాద్: కొత్త జోనల్ విధానం అమలులో భాగంగా జిల్లా కేడర్‌లోని ఉద్యోగుల కేటాయింపు వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గాల్లో ఈ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త జిల్లాలకు బదిలీ అయిన జూనియర్ ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలో నిర్ధారించే ఆదేశాలు ఈ నెల 30 లోగా విద్యాశాఖ ఇవ్వబోతోంది. ఈలోగా ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే సమస్య తలెత్తింది. ఇప్పటికే స్థానికత పేరుతో సొంత జిల్లాలు వదులుకున్నామని, కొత్త ప్రాంతాల్లోనూ మారుమూల ప్రాంతాలకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా జిల్లాల్లో వెళ్ళిన ఉద్యోగుల కన్నా పోస్టులు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో దూర ప్రాంతాల్లో ఉద్యోగులకు సరిపడా పోస్టులే ఖాళీగా ఉంచి, మిగతా వాటిని బ్లాక్ చేస్తున్నారు. అయితే ఆప్షన్లకు అవకాశమిచ్చే ప్రాంతాలన్నీ జిల్లాల్లో మారుమూల ప్రదేశాల్లోనే ఉంటున్నాయని టీచర్లు అంటున్నారు. ఈ రకంగానూ తమకు అన్యాయం జరుగుతోందని మహబూబాబాద్‌కు బదిలీ అయిన టీచర్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీ జోనల్ తేలకుండా ఆప్షన్లా? భార్యాభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పిస్తూ జిల్లా కేడర్ నుంచి ఆప్షన్లు కోరారు. ఈ గడువు కూడా 27 వరకే ఉంది. అయితే ఇంతవరకు మల్టీ జోనల్ పోస్టుల కేటాయింపు జరగలేదు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సోమవారం ప్రకటించే వీలుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భార్యా, భర్తల్లో జిల్లా కేడర్‌లో ఒకరు, మల్టీ జోనల్లో మరొకరు పనిచేస్తుంటే.. జిల్లా కేడర్‌లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆప్షన్ ఇస్తారు. మల్టీ జోనల్లో పనిచేసే భర్త లేదా భార్యకు ఆ అవకాశం ఇప్పుడు లేదు. అలాంటప్పుడు ఇద్దరు ఒకేచోట పనిచేసే వీలు ఎలా ఉంటుందని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. అన్ని కేడర్ల కేటాయింపు జాబితాలు ప్రకటించాకే ఆప్షన్లు పూర్తి చేయాలని కోరుతున్నారు. స్థానికంగా ఉండే ఉపాధ్యాయుల్లోనూ బదిలీల ప్రక్రియ గుబులు రేపుతోంది. ఏళ్ళ తరబడి పనిచేస్తున్న టీచర్లు తాము కోరుకునే ప్రదేశాన్ని కొత్తగా వచ్చే వారితో నింపితే తమకెలా న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీనియారిటీ జాబితాలపైనా అన్ని స్థాయిల్లో వివాదం పెరుగుతోంది. వీటిపై అప్పీలుకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపు సచివాలయం ముట్టడి బలవంతపు బదిలీలను నిరసిస్తూ మంగళవారం సచివాలయం ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపునిచ్చింది. అత్యవసరంగా వర్చువల్ పద్ధతిలో భేటీ అయిన స్టీరింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంఘం నేతలు చావా రవి తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుం డా అమలు చేస్తున్న బదిలీలు హేతుబద్ధంగా లేవని, అందుకే ఆందోళన బాట పట్టామని తెలిపారు. పరస్పర బదిలీలకు అవకాశమివ్వాలి పరస్పర బదిలీల ద్వారా ఎస్జీటీలు సొంత ప్రాంతంలో పనిచేసే అవకాశం కల్పించాలి. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే వీలు కల్పించాలి. కొత్త జిల్లాల్లో పాఠశాలల కేటాయింపును ముందే ప్రకటించాలి. అంతర్ జిల్లా బదిలీల్లోకి వెళ్ళిన టీచర్లకు కొత్త జిల్లా కేటాయిస్తే ఉద్యోగంలో చేరిన తేదీని సీనియారిటీగా గుర్తించాలి. సీనియారిటీలో జరిగిన అవకతవకలను తక్షణమే సరిచేయాలి. – కరివేద మహిపాల్ రెడ్డి, అరికల వెంకటేశం (అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి.. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం) అప్పుడే ఆప్షన్లు న్యాయం కాదు మల్టీ జోనల్ పరిధిలోకి వచ్చే గెజిటెడ్ హెడ్మాస్టర్ల కేటాయింపు పూర్తవ్వకుండా, జిల్లా కేడర్ ఆప్షన్లు కోరడం న్యాయం కాదు. దీనివల్ల భార్యాభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కోల్పోతారు. కేటాయింపు అన్ని స్థాయిల్లో పూర్తయిన తర్వాతే జిల్లాల్లో ఎక్కడ పనిచేయాలనేది నిర్ణయించాలి. – రాజా భానుచంద్రప్రకాశ్ (గెజిటెడ్ హెడ్మాస్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు) -
త్వరలో బదిలీలు.!
ఆదిలాబాద్‌అర్బన్: ఏ ఎన్నికలు జరిగిన ప్రభుత్వ అధికారుల బదిలీ అనేది సాధారణం. ఎన్నికల్లో కీలకంగా వ్యవహారించే వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులతో పాటు డివిజన్, జిల్లా అధికారులకు కూడా బదిలీలు చేపడుతుంటారు. ముఖ్యంగా ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే రెవెన్యూ శాఖలో పని చేసే అధికారుల బదిలీలు తప్పకుండా జరుగుతాయి. జిల్లాలోని వివిధ చోట్ల ఒకేచోట మూడేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులకు ఈ బదిలీలు తప్పకుండా వర్తిస్తాయి. ఈసారి వరుసగా ఎన్నికలు రావడంతో మూడేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారితో పాటు అందరినీ బదిలీ చేశారు. ఈ లెక్కన గతేడాది అక్టోబర్‌లో జిల్లాలోని 19మంది తహసీల్దార్లకు స్థాన చలనం కలిగింది. ఎన్నికలకు ముందు బదిలీ అయిన వారందరూ ఇతర జిల్లాలకు వెళ్లగా, ఇతర జిల్లాల తహసీల్దార్లు మన జిల్లాకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై దృష్టి సారించింది. ఎన్నికలకు ముందు బదిలీ అయినా తహసీల్దార్లను వారి వారి జిల్లాలకు పంపాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో వీరి బదిలీలు చేపట్టేందుకు చర్యలు తీసుకోనుంది. మరో వారం రో జుల్లో తహసీల్దార్ల బదిలీలు చేపట్టి ఈ నెలా ఖరులోగా ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం. జిల్లాకు రానున్న మన తహసీల్దార్లు.. ఎన్నికల్లో చేపట్టే సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల్లో తహసీల్దార్లుగా పని చేస్తున్న 19మంది అధికారులను చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) బదిలీ చేసింది. బదిలీలకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారులకు అప్పట్లో పంపించింది. దీంతో పాటు ఇతర జిల్లాల తహసీల్దార్లను మన జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ లెక్కన మన జిల్లాకు 18 మంది వేరే జిల్లాల్లో పని చేసే తహసీల్దార్లు కేటాయించింది. మన జిల్లాకు వచ్చిన వారిలో కుమ్రం భీం జిల్లా నుంచి ముగ్గురు తహసీల్దార్లు, వరంగల్ అర్బన్, నిర్మల్ నుంచి ఒక్కొక్కరు ఉండగా, జగిత్యాల నుంచి 13 మంది వచ్చారు. మన జిల్లాలో పని చేసిన వివిధ మండలాల తహసీల్దార్లు నిర్మల్‌కు పది మంది వెళ్లగా, కుమురంభీం జిల్లాకు ఐదుగురు, భద్రాద్రి కొత్తగూడెంకు ఇద్దరు, వరంగల్ అర్బన్, కరీంనగర్‌కు ఒక్కొక్కరు చొప్పున వెళ్లారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసినందున ఇప్పుడు వీరందరు తిరిగి జిల్లాకు రానున్నారు. వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ ఆయా మండలాల తహసీల్దార్లుగా బాధ్యతలు అప్పగించనున్నారు. ఎన్నికల్లో తహసీల్దార్లదే ముఖ్యపాత్ర... 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా మన జిల్లాలో పని చేసిన తహసీల్దార్లను ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు బదిలీ చేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా వరంగల్, కరీంనగర్, నిర్మల్, కుమ్రం భీం జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికలకు ముందు కొత్త జిల్లా యూనిట్‌గా తీసుకొని బదిలీలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ తహసీల్దార్లుగా పని చేసిన వారు బదిలీపై మన జిల్లాకు, మన దగ్గర పని చేసిన వారు ఆయా జిల్లాలకు వెళ్లారు. మన జిల్లా నుంచి తహసీల్దార్లు ఇతర జిల్లాలకు వెళ్లి నేటికి 241 రోజులు అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచి గెలుపోటములు తేలే వరకు, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలయ్యేం త వరకు అక్కడే విధులు నిర్వర్తించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తహసీల్దార్లు సహాయ రిటర్నింగ్, ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడంతో వీరి బదిలీలు తప్పకుండా చేపడుతారు. -
బదిలీలకు వేళాయె..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఇక బదిలీల పర్వం ప్రారంభం కానుంది. సాధారణంగా ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయడం రివాజుగా వస్తోంది. అయితే రాష్ట్రంలో వరుస ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో బదిలీల ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే సమయంలో ఒకేచోట ఎక్కువ కాలం నుంచి పని చేస్తున్న అధికారులను ఎన్నికల నియమావళి ప్రకారం ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కోడ్ ముగియగానే సదరు అధికారులను యథావిధిగా జిల్లాలకు బదిలీ చేయడం జరుగుతోంది. అయితే వరుస ఎన్నికలు రావడంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లిన పోలీస్, రెవెన్యూ, మండల పరిషత్, పంచాయతీరాజ్ అధికారులు తాత్కాలికంగా బదిలీ అయిన స్థానాల్లోనే నిరవధికంగా ఉండాల్సి వచ్చింది. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, లోక్‌సభ, ప్రాదేశిక ఎన్నికలు పూర్తి కావడంతో ప్రభుత్వం ఉద్యోగులు, అధికారుల బదిలీలపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాకు ఎన్నికల సమయంలో వచ్చిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ తమ జిల్లాలకు వెళ్లేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన జిల్లాకు కేటాయించిన తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఆయా అధికారులు, ఉద్యోగులు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో బదిలీల ప్రక్రియ ఈ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ మార్గాల ద్వారా ప్రయత్నాలు.. ఇక సుదీర్ఘకాలంగా జిల్లాలో విధులు నిర్వహించిన రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ ఉద్యోగులు సైతం ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. వీరిలో అనేక మంది సొంత జిల్లాకు రావడానికి తమకున్న రాజకీయ మార్గాల ద్వారా విపరీత ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ అయిన పోలీస్ అధికారులు కూడా తిరిగి జిల్లాలో ఫలానా ప్రాంతానికి వస్తారని, ఫలానా పోస్టింగ్ పొందుతారని ఇప్పటికే ప్రచారం జరుగుతుండడం విశేషం. తహసీల్దార్ స్థాయి అధికారులకు సంబంధించి సైతం ఇదే తరహా ప్రచారం కొనసాగుతోంది. ఇక ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన తహసీల్దార్లలో అనేక మంది పాలనా వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నం కాకపోవడం, కేవలం ఎన్నికల విధుల పట్లనే దృష్టి సారించి భూ సంబంధ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో జిల్లాలోని పలు మండలాల్లో రెవెన్యూపరమైన పాలన మందకొడిగా కొనసాగుతోందనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు అర్హతకు సంబంధించి రెవెన్యూ పరంగా జరగాల్సిన ప్రక్రియకు సంబంధించి రైతులు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా.. భూ పరమైన అర్జీలను పరిష్కరించాలని కోరినా.. అంటీముట్టనట్లుగా వ్యవహరించారనే విమర్శలు పలు మండలాల్లో వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికల వ్యవహారం పూర్తిగా ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన వ్యవహారాలపై దృష్టి సారించి అధికారులు, ఉద్యోగులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2016లో జిల్లా విభజన సమయంలో అధికారుల బదిలీలు చేపట్టారు. అనేక మంది జిల్లా కేంద్రంలో ఉన్న అధికారులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆర్డర్ టూ సర్వ్ ప్రకారం బదిలీ చేశారు. కొద్దినెలలు అక్కడ పని చేసిన అనంతరం మళ్లీ ఖమ్మం వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావించారు. అయితే మూడేళ్లు గడుస్తున్నా బదిలీలు జరగలేదు. అనంతరం ఎన్నికల సమయంలో కొన్ని బదిలీలు చేశారు. సాధారణ బదిలీలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో అనేక మంది తాము కోరుకున్న ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీపీ బదిలీ? ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ బదిలీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే సీపీ బదిలీ అవుతారనే ప్రచారం జరగ్గా.. ఎందుకనో నిలిచిపోయింది. ఎన్నికల కోడ్ ముగియడంతో సీపీ బదిలీ అవుతారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఆయన బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు దాటడంతో బదిలీ అనివార్యమని పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. అలాగే ఖమ్మం నూతన సీపీగా గతంలో భద్రాచలం అడిషనల్ ఎస్పీగా పనిచేసి.. ప్రస్తుతం రాచకొండలో డీసీపీగా పనిచేస్తున్న ప్రకాష్‌రెడ్డి, కొత్తగూడెం ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న అంబర్ కిషోర్‌ఝా, అదేవిధంగా ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. భారీగా పోలీస్ అధికారుల బదిలీలు? జిల్లాలో భారీ ఎత్తున పోలీస్ అధికారుల బదిలీలు అతిత్వరలోనే జరుగుతాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. దీర్ఘకాలికంగా పలు పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు వరుసగా ఎన్నికలు రావడం, కోడ్ అమలులో ఉండడంతో వారి బదిలీలు నిలిచిపోయాయి. కోడ్ ముగియడంతో భారీ ఎత్తున బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నగరంలో ఒకరిద్దరు సీఐలు, రూరల్‌లో ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, అదే విధంగా వైరా సబ్ డివిజన్లో పలువురు ఎస్సైలు, సీఐలకు స్థానచలనం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకు లూప్లైన్లో ఉన్న అధికారులు సైతం మంచి పోస్టింగ్‌ల కోసం రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చాలాకాలంగా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు సైతం ఉత్తర తెలంగాణలో వేరే జిల్లాలకు బదిలీ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి వచ్చిన సీఐ, ఎస్సై స్థాయి అధికారులు తమతమ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. అక్కడ పనిచేస్తూ ఎన్నికల ముందు ఇక్కడకు వచ్చిన కొందరు మాత్రం జిల్లాలోనే ఉండిపోవడానికి రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కావడంతో త్వరలోనే బదిలీలు జరుగుతాయని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. -
పారదర్శ 'కథే'
బదిలీల్లో నిబంధనలకు నీళ్లు టీడీపీ నేతల సిఫార్సులే శిరోధార్యం ప్రతి స్థానచలనంతోనూ దందా లక్షల రేటు కట్టి వసూలు చేసిన వైనం స్వయంగా ముఖ్యమంత్రే ఇలా ప్రకటించడంతో జిల్లాలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, తెలుగు తమ్ముళ్లకు ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. అంతే నచ్చిన వారిని, సొమ్ములు ఇచ్చిన వారిని కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేసి, మాట వినరనుకున్న వారిని శంకరగిరి మాన్యాలు పట్టించేందుకు పావులు కదపడం ప్రారంభించారు. కాకినాడ : అధికారంలోకి వచ్చిన కొత్తలో ఓ మాట చెప్పి నెలలు గడుస్తున్న కొద్దీ మరో మాట చెప్పడం తెలుగుదేశం పార్టీ అధినేతకు వెన్నతోపెట్టిన విద్యగా మారింది. అన్నీ పారదర్శకంగానే జరగాలి. నిబంధనలను తుచ తప్పక అమలు చేయాలి’ బదిలీలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన మాటలు. బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యాక నిబంధనలకు తూచ్... నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గంటూ బదిలీల ప్రక్రియలో బరితెగిస్తున్నారు. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అన్నట్టు తెలుగు తమ్ముళ్ల తలోదారిలో రెచ్చిపోతున్నారు. పారదర్శకతకు పాత్ర వేస్తున్నారు. ‘ఎన్నికల్లో గెలిపించే అధికారులు కావాలి. మాట వినకుంటే వెయిటింగ్లో పెట్టండి’ అని స్వయానా ముఖ్యమంత్రే ప్రకటించడంతో జిల్లాలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు పైరవీలకు తెరతీశారు. నచ్చిన వారిని, సొమ్ములు ఇచ్చిన వారిని కోరుకున్న చోటికి బదిలీ చేసి, మాట వినరనుకున్న వారిని శంకరగిరి మాన్యాలు పట్టించారు. జిల్లాస్థాయి అధికారులు సైతం నేతల సిఫార్సులకు తలొంచకతప్ప లేదు. నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే.. బదిలీలు కోరుకునే వారు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఒకేచోట కొలువు మూడేళ్లు దాటిన వారిని కోరుకుంటేను, ఐదేళ్లు దాటిన వారికి కచ్చితంగానూ బదిలీలు చేయాలన్నది నిబంధన. ఈ నిబంధన ప్రామాణికంగా వచ్చిన దరఖాస్తులన్నింటినీ సంబంధిత శాఖ జిల్లా అధికారి పరిశీలించాక కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఆ ప్రక్రియ పూర్తయ్యాక ఉత్తర్వులు ఇవ్వాలి. ఈ నిబంధనలను గాలికొదిలేసి అధికార పార్టీ నేతల సిఫార్సులకు అనుగుణంగానే బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పరిస్థితి రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లో మితిమీరింది. చివరి వరకూ గోప్యత రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖల్లో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఈఓపీఆర్డీల బదిలీలు జరిగాయి. ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 20తో ముగిసిపోగా పరిపాలనా సౌలభ్యం పేరుతో జిల్లాలో 21, 22 తేదీల్లో కూడా బదిలీలు చేశారు. దీన్ని టీడీపీ నియోజకవర్గ నేతలు తమకు అనుకూలంగా మలచుకుని సొమ్ము చేసుకున్నారు. ప్రధానంగా తహసీల్దార్ల బదిలీల్లో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల సిఫార్సులకు పెద్దపీట వేశారు. గత నాలుగైదు రోజులుగా తహసీల్దార్ల బదిలీలపై ప్రచారం ఉన్నా ప్రజాప్రతినిధుల సిఫార్సుల వల్ల అధికారులు గోప్యత ప్రదర్శించారు. హఠాత్తుగా బుధవారం రాత్రి జిల్లాలో 14 మంది తహసీల్దార్ల బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ బదిలీల్లో అధికారులు ఎమ్మెల్యేల సిఫార్సులు అమలు చేయక తప్పని పరిస్థితి. ఇంకా వ్యవధి ఉండగానే బదిలీలు కాగా ఏజెన్సీ కేంద్రం రంపచోడవరంలో పనిచేస్తున్న తహసీల్దార్ ఎల్.శివకుమార్‌ది శ్రీకాకుళం జిల్లా. రంపచోడవరం వచ్చి 10 నెలలలోపే అయింది. సొంత జిల్లాకు దగ్గరగా ఉంటుందని తునిలో పోస్టింగ్ కోసం ప్రయత్నించిన ఆయనకు చివరికి సామర్లకోటలో పోస్టింగ్ ఇచ్చారు. సామర్లకోట నుంచి సునీల్‌బాబును కాకినాడ కలెక్టరేట్ సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. సునీల్‌బాబు అక్కడకు వచ్చి రెండేళ్లయ్యింది. నిబంధనల ప్రకారం ఆయనను బదిలీ చేయాల్సిన అవసరం లేదు. కానీ పెద్దాపురం డివిజన్లో పో స్టింగ్ ఇప్పిస్తామని అప్పటికే తెలుగుతమ్ముళ్లు ఒకరి నుంచి ఐదు లక్షలు మూటగట్టుకున్నారని, నియోజకవర్గంలో ముఖ్య నేతకు చేరాల్సింది చేరాకే పోస్టింగ్‌కు సిఫార్సు లేఖ ఇచ్చారని అంటున్నారు. మాట వినని వారికి స్థానచలనం అనపర్తి నియోజకవర్గంలో రంగంపేట మండలం మినహా అనపర్తి, పెదపూడి, బిక్కవోలు తహసీల్దార్లకు బదిలీలు ముఖ్యనేత చెప్పుచేతల్లోనే జరిగాయి. అనపర్తిలో పనిచేస్తున్న రియాజ్ హుసేన్ మాటవినడం లేదని, టీడీపీకి సానుకూలంగా లేరనే కారణంతో కోరుకొండ పంపించారు. పెదపూడి నుంచి ఎం.సావిత్రిని నిబంధనల ప్రకారం బదిలీ చేయాల్సిన అవసరం లేదు. టీడీపీ నేతలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని ఆమెను రెండేళ్లు పూర్తికాకుండానే తిరిగి కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. బిక్కవోలులో పనిచేస్తున్న వెంకటేశ్వరరావు 2010 నుంచి 2013 మే వరకు అనపర్తిలో పనిచేసి ఆ తరువాత బిక్కవోలు వచ్చారు. అప్పటి నుంచి బిక్కవోలులో పనిచేస్తున్న ఆయనకు తాజా బదిలీల్లో పెదపూడి తహసీల్దార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ కడియంలో పనిచేస్తున్న పిల్లా రామోజీని రంపచోడవరం బదిలీ చేశారు. గత బదిలీల్లో కడియం కోసం ఒక అధికారి ఆ నియోజకర్గ నేతకు ఐదు లక్షలు సమర్పించుకున్నారనే విమర్శలున్నాయి. ఇప్పుడు కూడా అది జరగబట్టే రెండేళ్లు కూడా తిరగకుండానే రామోజీని రంపచోడవరం పంపించేశారంటున్నారు. రెండేళ్లు కూడా పూర్తికాకుండానే రాజమహేంద్రవరం అర్బన్‌లో ఉన్న పీవీవీ గోపాలకృష్ణను గోకవరం బదిలీ చేశారు. కోరుకొండ తహసీల్దార్‌గా పనిచేస్తున్న పోసియ్యను రాజానగరం నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ ముఖ్యనేత సిఫార్సు మేరకు రాజమహేంద్రవరం అర్బన్‌కు బదిలీ చేశారంటున్నారు. ఈ రకంగా జిల్లాలో తహసీల్దార్ల బదిలీల్లో రాజకీయ జోక్యం, నేతల సిఫార్సుల ముందు నిబంధనలు తోక ముడిచారుు. అధికారుల బదిలీల మాటేమో గానీ ఆయా మండలాల పరిధుల్లోని ప్రజలు ఇబ్బందులు పడక తప్పేట్టు లేదు.