- బదిలీల్లో నిబంధనలకు నీళ్లు
- టీడీపీ నేతల సిఫార్సులే శిరోధార్యం
- ప్రతి స్థానచలనంతోనూ దందా
- లక్షల రేటు కట్టి వసూలు చేసిన వైనం
స్వయంగా ముఖ్యమంత్రే ఇలా ప్రకటించడంతో జిల్లాలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, తెలుగు తమ్ముళ్లకు ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. అంతే నచ్చిన వారిని, సొమ్ములు ఇచ్చిన వారిని కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేసి, మాట వినరనుకున్న వారిని శంకరగిరి మాన్యాలు పట్టించేందుకు పావులు కదపడం ప్రారంభించారు.
కాకినాడ : అధికారంలోకి వచ్చిన కొత్తలో ఓ మాట చెప్పి నెలలు గడుస్తున్న కొద్దీ మరో మాట చెప్పడం తెలుగుదేశం పార్టీ అధినేతకు వెన్నతోపెట్టిన విద్యగా మారింది. అన్నీ పారదర్శకంగానే జరగాలి. నిబంధనలను తుచ తప్పక అమలు చేయాలి’ బదిలీలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన మాటలు. బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యాక నిబంధనలకు తూచ్... నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గంటూ బదిలీల ప్రక్రియలో బరితెగిస్తున్నారు. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అన్నట్టు తెలుగు తమ్ముళ్ల తలోదారిలో రెచ్చిపోతున్నారు.
పారదర్శకతకు పాత్ర వేస్తున్నారు. ‘ఎన్నికల్లో గెలిపించే అధికారులు కావాలి. మాట వినకుంటే వెయిటింగ్‌లో పెట్టండి’ అని స్వయానా ముఖ్యమంత్రే ప్రకటించడంతో జిల్లాలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు పైరవీలకు తెరతీశారు. నచ్చిన వారిని, సొమ్ములు ఇచ్చిన వారిని కోరుకున్న చోటికి బదిలీ చేసి, మాట వినరనుకున్న వారిని శంకరగిరి మాన్యాలు పట్టించారు. జిల్లాస్థాయి అధికారులు సైతం నేతల సిఫార్సులకు తలొంచకతప్ప లేదు.
నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే..
బదిలీలు కోరుకునే వారు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఒకేచోట కొలువు మూడేళ్లు దాటిన వారిని కోరుకుంటేను, ఐదేళ్లు దాటిన వారికి కచ్చితంగానూ బదిలీలు చేయాలన్నది నిబంధన. ఈ నిబంధన ప్రామాణికంగా వచ్చిన దరఖాస్తులన్నింటినీ సంబంధిత శాఖ జిల్లా అధికారి పరిశీలించాక కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఆ ప్రక్రియ పూర్తయ్యాక ఉత్తర్వులు ఇవ్వాలి. ఈ నిబంధనలను గాలికొదిలేసి అధికార పార్టీ నేతల సిఫార్సులకు అనుగుణంగానే బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పరిస్థితి రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లో మితిమీరింది.
చివరి వరకూ గోప్యత
రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖల్లో తహసీల్దార్‌లు, డిప్యూటీ తహసీల్దార్‌లు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఈఓపీఆర్‌డీల బదిలీలు జరిగాయి. ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 20తో ముగిసిపోగా పరిపాలనా సౌలభ్యం పేరుతో జిల్లాలో 21, 22 తేదీల్లో కూడా బదిలీలు చేశారు. దీన్ని టీడీపీ నియోజకవర్గ నేతలు తమకు అనుకూలంగా మలచుకుని సొమ్ము చేసుకున్నారు.
ప్రధానంగా తహసీల్దార్‌ల బదిలీల్లో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల సిఫార్సులకు పెద్దపీట వేశారు. గత నాలుగైదు రోజులుగా తహసీల్దార్ల బదిలీలపై ప్రచారం ఉన్నా ప్రజాప్రతినిధుల సిఫార్సుల వల్ల అధికారులు గోప్యత ప్రదర్శించారు. హఠాత్తుగా బుధవారం రాత్రి జిల్లాలో 14 మంది తహసీల్దార్ల బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ బదిలీల్లో అధికారులు ఎమ్మెల్యేల సిఫార్సులు అమలు చేయక తప్పని పరిస్థితి.
ఇంకా వ్యవధి ఉండగానే బదిలీలు
కాగా ఏజెన్సీ కేంద్రం రంపచోడవరంలో పనిచేస్తున్న తహసీల్దార్ ఎల్.శివకుమార్‌ది శ్రీకాకుళం జిల్లా. రంపచోడవరం వచ్చి 10 నెలలలోపే అయింది. సొంత జిల్లాకు దగ్గరగా ఉంటుందని తునిలో పోస్టింగ్ కోసం ప్రయత్నించిన ఆయనకు చివరికి సామర్లకోటలో పోస్టింగ్ ఇచ్చారు.
సామర్లకోట నుంచి సునీల్‌బాబును కాకినాడ కలెక్టరేట్ సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. సునీల్‌బాబు అక్కడకు వచ్చి రెండేళ్లయ్యింది. నిబంధనల ప్రకారం ఆయనను బదిలీ చేయాల్సిన అవసరం లేదు. కానీ పెద్దాపురం డివిజన్‌లో పో స్టింగ్ ఇప్పిస్తామని అప్పటికే తెలుగుతమ్ముళ్లు ఒకరి నుంచి ఐదు లక్షలు మూటగట్టుకున్నారని, నియోజకవర్గంలో ముఖ్య నేతకు చేరాల్సింది చేరాకే పోస్టింగ్‌కు సిఫార్సు లేఖ ఇచ్చారని అంటున్నారు.
మాట వినని వారికి స్థానచలనం
అనపర్తి నియోజకవర్గంలో రంగంపేట మండలం మినహా అనపర్తి, పెదపూడి, బిక్కవోలు తహసీల్దార్లకు బదిలీలు ముఖ్యనేత చెప్పుచేతల్లోనే జరిగాయి. అనపర్తిలో పనిచేస్తున్న రియాజ్ హుసేన్ మాటవినడం లేదని, టీడీపీకి సానుకూలంగా లేరనే కారణంతో కోరుకొండ పంపించారు. పెదపూడి నుంచి ఎం.సావిత్రిని నిబంధనల ప్రకారం బదిలీ చేయాల్సిన అవసరం లేదు. టీడీపీ నేతలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని ఆమెను రెండేళ్లు పూర్తికాకుండానే తిరిగి కలెక్టరేట్‌కు బదిలీ చేశారు.
బిక్కవోలులో పనిచేస్తున్న వెంకటేశ్వరరావు 2010 నుంచి 2013 మే వరకు అనపర్తిలో పనిచేసి ఆ తరువాత బిక్కవోలు వచ్చారు. అప్పటి నుంచి బిక్కవోలులో పనిచేస్తున్న ఆయనకు తాజా బదిలీల్లో పెదపూడి తహసీల్దార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ కడియంలో పనిచేస్తున్న పిల్లా రామోజీని రంపచోడవరం బదిలీ చేశారు. గత బదిలీల్లో కడియం కోసం ఒక అధికారి ఆ నియోజకర్గ నేతకు ఐదు లక్షలు సమర్పించుకున్నారనే విమర్శలున్నాయి. ఇప్పుడు కూడా అది జరగబట్టే రెండేళ్లు కూడా తిరగకుండానే రామోజీని రంపచోడవరం పంపించేశారంటున్నారు.
రెండేళ్లు కూడా పూర్తికాకుండానే రాజమహేంద్రవరం అర్బన్‌లో ఉన్న పీవీవీ గోపాలకృష్ణను గోకవరం బదిలీ చేశారు. కోరుకొండ తహసీల్దార్‌గా పనిచేస్తున్న పోసియ్యను రాజానగరం నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ ముఖ్యనేత సిఫార్సు మేరకు రాజమహేంద్రవరం అర్బన్‌కు బదిలీ చేశారంటున్నారు. ఈ రకంగా జిల్లాలో తహసీల్దార్ల బదిలీల్లో రాజకీయ జోక్యం, నేతల సిఫార్సుల ముందు నిబంధనలు తోక ముడిచారుు. అధికారుల బదిలీల మాటేమో గానీ ఆయా మండలాల పరిధుల్లోని ప్రజలు ఇబ్బందులు పడక తప్పేట్టు లేదు.