అధికార పార్టీ నాయకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయూరైంది జిల్లాలో పరిస్థితి. అధికారులకు సైతం వారు చెప్పిందే వేదంగా మారింది. టీడీపీ నేతలు కుక్కను చూపించి, అది గాడిద అంటే అధికారులు అవునంటూ డూ డూ బసవన్నల్లా తలాడించేస్తున్నారు. అలాగే నిర్ధారించేస్తున్నారు.
మగ మహారాజులను మహిళలుగా మార్చడమే కాదు.. ఏకంగా వారికి పింఛను సైతం మంజూరు చేశారు. భర్తలు బతికుండగానే స్త్రీలను వితంతువులను చేశారు. నడి వయస్కులను వృద్ధుల్ని చేశారు. శ్రీమంతులను కడుబీదలుగా చిత్రీకరించారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులకు సామాజిక పింఛన్లు మంజూరు చేశారు. గిద్దలూరు మండలంలో వెలుగు చూసిన ఈ తతంగాన్ని చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే!
గిద్దలూరు రూరల్ గిద్దలూరు మండలంలో తాజాగా లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు మంజూరయ్యూయి. మొత్తం 18 పంచాయతీలకు గాను 495 (వృద్ధాప్య, వితంతువు, వికలాంగుల) పింఛన్లను శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. పింఛను పుస్తకాలపై శుక్రవారం అధికారుల సంతకాలు కూడా పూర్తయ్యూయి.
వీటిలో భాగంగా సంజీవరాయుడుపేట గ్రామ పంచాయతీకి 28 పింఛన్లు మంజూరు కాగా అందులో 13 తప్పుల తడకలుగా ఉన్నాయి. మరికొన్ని గ్రామాల్లోనూ అనర్హుల పేర్లతోనూ మంజూరయ్యూయి. టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యుల సిఫార్సుల మేరకు పింఛన్లు మంజూరు చేసి, స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చేతుల మీదుగా వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
సంజీవరాయుడుపేట గ్రామంలో చాగం పెద్దకోటిరెడ్డికి వితంతు పింఛను మంజూరు చేస్తూ పుస్తకం తయారు చేశారు. దీనిపై అధికారుల సంతకాలు కూడా పూర్తయ్యూరుు. అందులో కోటిరెడ్డి వయస్సు 55 ఏళ్లుగా పేర్కొన్నారు. దీని ప్రకారం వృద్ధాప్య పింఛనుకు కూడా ఆయన అనర్హుడే.
ఇదే గ్రామానికి చెందిన పెల్లురి లక్షీదేవి, పందరబోయిన గురవమ్మ, ఎం.సైదాబీ ముగ్గురికి భర్తలు బతికి ఉండగానే వితంతువు పింఛన్లు మంజూరు చేశారు.
మార్తాల సుబ్బారెడ్డి, వేములపాటి కేశవులు, రాజుపాలెం బాలమ్మ, ముత్యాలపాటి చెన్నయ్య, శిరిగిరి పోలయ్య, పెల్లురి కువ్వన్న, చాగం ఎలమందారెడ్డి ఈ ఏడుగురూ 40 నుంచి 55 ఏళ్ల వయసు లోపు వారే. వీరందరికీ 60 ఏళ్లు పైబడినట్లు చూపి వృద్ధాప్య పింఛను మంజూరు చేశారు.
ఇదే గ్రామంలో ఆర్మీ ఉద్యోగి అవివాహిత కుమార్తె ముత్యాలపాటి చెన్నమ్మకు వికలాంగుల పింఛను మంజూరు చేశారు.
8 ఎకరాల భూమి ఉన్న పొందుగుల చెన్నమ్మకు వితంతు పింఛను మంజూరు చేశారు.
మండలంలోని ఆదిమూర్తిపల్లి గ్రామ పంచాయతీలో రిటైర్డ్ వీఆర్వో శింగరరెడ్డి భార్యకు వృద్ధాప్య పింఛను మంజూరు చేశారు.
ముండ్లపాడు గ్రామ పంచాయతీలో నడి వయస్కులకు రికార్డుల్లో ఎక్కువ వయసు నమోదు చేసి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తూ పుస్తకాలు పంపిణీకి సిద్ధం చేశారు.
వీటన్నిటిపై ఎంపీడీఓ జె.రాజశేఖరరావును వివరణ కోరగా డీఆర్‌డీఏ నుంచి తప్పులు వచ్చినట్లు సమాధానం చెప్పడం గమనార్హం.