అక్కా, తమ్ముళ్ళ మధ్య జరుగుతున్న వార్ ఆ నియోజకవర్గంలో టీడీపీని అట్టడుగుకు నెట్టేస్తోందా? పచ్చ పార్టీలో వరుసకు అక్కా తమ్ముళ్ళయ్యే నేతల తీరుతో అక్కడి కేడర్‌ను అయోమయానికి గురి చేస్తోంది. కత్తులు దూసుకుంటున్న ఆ ఇద్దరి కారణంగా ముచ్చటగా మూడోసారి కూడా ఓడిపోవడం ఖాయమని డిసైడవుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ అక్కా తమ్ముడు ఎవరు?
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఉపాధ్యక్షురాలు పిడితల సాయికల్పనారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముత్తుమూల అశోక్ రెడ్డిల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఆగేలా కనిపించడంలేదు. 2014లో వైయస్సార్సీపి నుంచి గెలుపొంది తర్వాత టిడిపీలో చేరిన అశోక్ రెడ్దిని 2019లో గిద్దలూరు ప్రజలు భారీ తేడాతో తిరస్కరించారు. పిడితల సాయికల్పనరెడ్దికి అశోక్‌రెడ్డి వరుసకు తమ్ముడవుతారు. గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జ్‌గా అశోక్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలకి సాయి కల్పన రెడ్డి దూరంగా వుంటున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో అశోక్ రెడ్డి అందరినీ కలుపుకుని వెళ్ళడంలేదని సాయికల్పనా రెడ్డి వర్గం విమర్శిస్తోంది. దీనికి తోడు అశోక్ రెడ్డి కూడా సాయికల్పనా రెడ్డిని ఆహ్వానించడకుండా తనపని తాను చేసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని ఇద్దరు నేతల తీరుపై పచ్చ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇటీవల చంద్రబాబు గిద్దలూరు వచ్చిన సందర్భంలో కూడా సాయికల్పనా రెడ్డి దూరంగానే వున్నారు. చంద్రబాబు నియోజకవర్గానికి వస్తున్నా నియోజకవర్గ ఇంచార్జ్ ఆశోక్ బాబు తనను ఆహ్వానించకపోవడంతో సాయికల్పనా రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యనేతలు వెళ్ళి చంద్రబాబు సభకు హజరుకావాలని కోరినా..సాయికల్పనా రెడ్డి మాత్రం రానని తెగేసిచెప్పారు. అంతటితో ఆగకుండా చంద్రబాబుకు ఆహ్వనం పలుకుతూ తన వర్గం కట్టిన ఫ్లెక్సీలను కూడా తొలగించి వేశారు. దీంతో వీరిద్దరి వ్యవహరశైలి చంద్రబాబును సైతం అసహనానికి గురిచేసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంపైనే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు నుంచి సాయికల్పన లేదా ఆమె తనయుడు అభిషేక్ రెడ్డి బరిలో ఉండాలని పిడతల కుటుంబం భావిస్తోంది.
తనకు టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని సాయికల్పనారెడ్డి తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. అయితే సాయి కల్పన ఎప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం.. ఫోన్ ద్వారా పలకరించేందుకు ప్రయత్నించినా స్పందించకపోవడం వంటి అంశాలు ఆమెకు పరిస్థితులు ప్రతిబంధకంగా మారాయనే టాక్ నడుస్తోంది. సాయికల్పన ఇండిపెండెంట్‌గా బరిలో దిగితే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ దెబ్బ తిని మరోసారి ఓటమి తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే పార్టీ ప్రతిష్ట మసకబారిపోవడం, నేతల మధ్య అంతర్యుద్ధం వంటివి వైఎస్‌ఆర్ కాంగ్రస్ అభ్యర్థికి గెలుపు నల్లేరు మీద నడకే అని చెబుతున్నారు.
ఓ వైపు అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పీడ్ పెంచారు. సౌమ్యుడుగా పేరున్న రాంబాబు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దూకుడు మీదున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలను నేరుగా కలుసుకోవడం పార్టీలకు అతీతంగా సంక్షేమ పధకాలు అందిస్తూ అందరివాడుగా పేరు తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment