టీడీపీలో విశ్వసనీయత లేదు
గిద్దలూరు, న్యూస్‌లైన్ : ‘టీడీపీకి విశ్వసనీయత లేదు, అక్కడ సామాన్యులకు పదవులు దక్కవు, కేవలం డబ్బున్న వారికే టికెట్లిస్తున్నారు. తెలుగుదేశం కార్పొరేట్ పార్టీగా మారిపోమయింద’ని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనా రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వసనీయత లేని చోట ఉండలేక పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని సాయికల్పనారెడ్డి ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలను సోమవారం గిద్దలూరులోని తన నివాసంలో విలేకరులకు వివరించారు.
‘2009 ఎన్నికల సమయంలో పాతాలంలో కలిసిన టీడీపీకి గిద్దలూరులో సార థి లేరు. తనను బతిమిలాడితే పార్టీలో చేరా. నాలుగేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన నన్ను చంద్రబాబు మోసం చేశారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. టికెట్ మీకే ఇస్తున్నామంటూ సుజనాచౌదరి మార్చి 15వ తేదీ నుంచి చెబుతూ వచ్చారు. చివరి నిమిషం వరకు నమ్మించారు. కానీ పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఎంత వరకు సమంజసమ’ని ఆమె దుయ్యబట్టారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎంతో ఖర్చు చేసి అభ్యర్థుల గెలుపునకు పోరాడిన తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేసిన పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నానన్నారు. కార్యకర్తలు, నాయకుల నిర్ణయం మేరకు పార్టీకి, పదవికి, తన కుమారుడు అభిషేక్‌రెడ్డి, తన అనుచరులతో సహా రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఇంతటి మోసానికి పాల్పడిన టీడీపీలో తాను బతికుండగా చేరబోనని తెగేసి చెప్పారు.
వైఎస్సార్ సీపీకే మా మద్దతు
పార్టీ కోసం కష్టపడిన నాయకుణ్ని గుర్తించి టికెట్ ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే వెయ్యి రెట్లు మేలని, కార్యకర్తలకు భరోసా ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి అని జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అన్నారు. వైఎస్సార్ సీపీకి మద్దతు ఇచ్చేందుకు తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవ చేశారని, ఇప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. రెండు రోజుల్లో పార్టీలో చేరతామరి స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
పిడతల కుటుంబానికి ప్యాకేజీలా..
‘గిద్దలూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి పిడతల కుటుంబం రాజకీయంగా ముందుంది. అలాంటి కుంటుంబానికి ప్యాకేజీలు తీసుకునే అవసరం లేద’ని సాయికల్పన తనయుడు పిడతల అభిషేక్‌రెడ్డి అన్నారు. ఒక సామాజికవర్గం పనికట్టుకుని తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మేము ప్యాకేజీ తీసుకున్నామని రుజువు చేస్తే అంతకు రెండింతలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రుజువు చేయలేకపోతే ఏం చేస్తారో ఆరోపణలు చేస్తున్న వారు చెప్పాలని అభిషేక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తమకు సహకరించిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ పరిధిలోని నల్లబండ బజారుకు చెందిన బొంతా లక్ష్మీదేవి, నాయకులు ముత్తుముల మధుసూదన్‌రెడ్డి, పాలుగుళ్ల హనుమంతారెడ్డిలు సాయికల్పనకు మద్దతు తెలిపారు.
టీడీపీకి పలువురు నేతల గుడ్‌బై
టీడీపీకి సాయికల్పన, అభిషేక్‌రెడ్డిలతో పాటు ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కొండెపోగు దేవప్రభాకర్, జిల్లా టీడీపీ కార్యదర్శి కుసుమాల మహానందియాదవ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి తోట శ్రీనివాసులు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి చెరుకుపల్లె లక్ష్మయ్య, గిద్దలూరు, కొమరోలు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్మునూరి బాబూరావు, గౌరి జయరావు, నాయకులు పసుపుల చిన్న ఓబయ్యయాదవ్, కొమరోలు మండల యూత్ ప్రధాన కార్యదర్శి బిజ్జం చిన్ననరసయ్య, తిమ్మాపురం గౌడ సంఘం అధ్యక్షుడు చిలక కాశీరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దండూరి సోమయ్య, రాచర్ల మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ రసూల్, రాచర్ల టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ షేక్షావలి, రాచర్ల మండల టీడీపీ సమన్వయకర్త గోపవరపు పాండురంగారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాలను పంపినట్లు వారు తెలిపారు.