రాజా చేయ్యి వేస్తే... | tdp leader hulchul in chodavaram constituency | Sakshi
Sakshi News home page

రాజా చేయ్యి వేస్తే...

Published Sun, Oct 2 2016 9:06 AM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

రాజా చేయ్యి వేస్తే... - Sakshi

రాజా చేయ్యి వేస్తే...

- జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
 

చోడవరంలో టీడీపీ నేత మైనింగ్ దందా

అనుమతులు గోరంత.. తవ్వకాలు కొండంత

అడ్డొస్తే అంతే సంగతులు.. పోలీసులతో వేధింపులు

ప్రజల బాగోగులు గాలికి.. ఆయన ఆర్జన ఆకాశానికి

 
ఏ మాటకా మాటే చెప్పాలి.. చోడవరంలో టీడీపీ కీలక నేత రూటే సెపరేటు..
 
ఆమాం బాపతు చిల్లర వసూళ్లు.. పైసా వసూల్ పంచాయితీలు ఆయనగారికి ఏమాత్రం ఇష్టం ఉండదు.
 
ఎంతైనా.. నియోజకవర్గానికి రాజులాంటోరు కదా.. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నదే ఆయనగారి సిద్ధాంతం..
 
అందుకే ఏకంగా కొండలు, గుట్టలను మింగేసే పనిలో పడ్డారు.. కొండలంటే.. అలాంటిలాంటివి కావు.. కోట్ల విలువ చేసే నిక్షేపాల కొండలు..
 
గ్రానైట్, క్వార్ట్జ్‌లాంటి విలువైన నిక్షేపాలున్న కొండలను గుర్తించడం.. వాటిని కొల్లగొట్టడం.. ఇదే ఆయనకు నిత్యకృత్యం.
 
అలా రూ.కోట్లకు కోట్లు కూడబెట్టి ఖజానా నింపుకొంటున్నారు.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఇదే దందా సాగించిన ఆయనగారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత  ఈ రెండున్నరేళ్లలో మరింత రెచ్చిపోయారు. అడ్డూఅదుపూ లేకుండా కొండలను కరిగించేస్తున్నారు.
 
రవ్వంత మైనింగ్ అనుమతులు తీసుకుని.. కొండంతా తవ్వేసుకోవడం.. లీజులను అమ్మేసి గుడ్‌విల్ దండుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య..
 
క్వారీల తవ్వకాలకు పరిసర ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అధికారం అడ్డుపెట్టుకుని కేసుల పేరుతో బెదిరించి అడ్డు తప్పిస్తారు..

 
ప్రజా సమస్యలను లేశమాత్రమైనా పట్టించుకోకుండా.. క్వారీయింగ్ కింగ్ అనిపించుకోవడమే లక్ష్యంగా.. అలా ముందుకు సాగుతున్న ఈ టీడీపీ కీలక నేత నిర్వాకాలెలా ఉన్నాయో.. ఒక్కసారి వీక్షిద్దాం రండి.. విశాఖతీరానికి.. జిల్లాలో గ్రానైట్ కింగ్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది చోడవరంలోని టీడీపీ కీలక నేత పేరే. కొండ కనిపిస్తే చాలు.. ఒక బిడ్ వేసి కొండ మొత్తం తొలిచేసి.. కాసులుగా మార్చుకోవడం.. ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనేది టీడీపీ శ్రేణులే అంగీకరించే వాస్తవం. మాడుగుల, రావికమతం, రోలుగుంట మండలాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ ఈయనకు క్వారీలు ఉన్నాయి.
 
కొన్ని స్వయంగా ఆయన పేరిటే ఉండగా, మిగిలినవాటిని బినామీ పేర్లతో నడిపిస్తుంటారు. ముందుగా తన సొంత సర్వేయర్లతో సర్వే చేయించుకొని విలువైన రాయి ఉన్న కొండలను గుర్తిస్తారు. వెంటనే అక్కడ మైనింగ్‌కు దరఖాస్తు పడేస్తారు. తన హోదాను ఉపయోగించి అధికారులపై ఒత్తిడి తెచ్చి అనుమతులు తెచ్చేసుకుంటారు. ఆనక నచ్చితే స్వయంగా మైనింగ్ చేయడం.. లేదంటే సదరు లీజు హక్కులను భారీమొత్తానికి అమ్మి సొమ్ము చేసుకోవడం జిల్లావ్యాప్తంగా ఈయనొక్కరికే చెల్లిన వ్యాపారం.
 
 
అనుమతి 15 హెక్టార్లు.. తవ్వకం 25 హెక్టార్లు

తక్కువ విస్తీర్ణానికి లీజు పొందడం.. దాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడం ఈయనగారి సిద్ధాంతం. వమ్మలి జగన్నాధపురంలో ఉరలోవ కొండ గ్రానైట్ క్వారీలో సదరు నేతకు ప్రధాన భాగస్వామ్యం ఉంది. ఇక్కడ 15 హెక్టార్లలో మైనింగ్‌కే అనుమతి తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు 25 హెక్టార్లకు పైనే అక్రమంగా క్వారీ చేసినట్టు తెలుస్తోంది.
 
ఇక ఈ క్వారీ చుట్టుపక్కల ఉన్న రైతుల భూములను తక్కువ ధరకే దక్కించుకొని బినామీల పేరున పెట్టారు. క్వారీకి రోడ్డు వేసేందుకు  భూములు ఇవ్వాలని అడగ్గా కొందరు రైతులు నిరాకరించారు. దీంతో వారిని బెదిరించి మరీ రోడ్డు వేయించారు.
 
క్వారీలే.. క్వారీలు

 కోటవురట్ల సమీపంలో ఈయన పేరిటే ఓ క్వారీ నడుస్తోంది. తోటకూరపాలెం, గుడ్డిప క్వారీల్లో  కొంత భాగస్వామ్యం ఉన్నట్టు సమచారం. కొట్నాబిల్లి  గ్రానైట్ క్వారీని తన కుటుంబ సభ్యుల పేరిట కొంత కాలం నిర్వహించారు. ఇటీవలే స్లీపింగ్ పార్టనర్‌గా మారి మరొకరికి లీజు హక్కులు అమ్మేశారు. టి.అర్జాపురం డోలన్నపాలెం, అజయ్‌పురం, జెడ్.బెన్నవరంక్వారీలకు అనుచరుల పేరిట లీజు పొంది.. తర్వాత చెన్నై, హైదరాబాద్‌లకు చెందిన బడా వ్యాపారులకు అమ్మేసుకున్నట్టు తెలిసింది.

ఇవే కాకుండా పొరుగు జిల్లాల్లోనూ క్వారీలు ఉన్నట్టు తెలుస్తోంది. గ్రానైట్, క్వార్ట్జ్, ఇతర గనుల క్వారీ వ్యాపారం చేసే యజ మానులందర్నీ వడ్డాది కేంద్రంగా అప్పుడప్పుడు సమావేశపరుస్తుంటారు.  రాజకీయంగా అండగా ఉంటానంటూ భరోసా ఇస్తూ మైనింగ్ కింగ్ అనిపించుకోవడానికి సదరు నేత ఉబలాటపడిపోతుంటారట.
 
అడ్డగోలు రవాణాతో రోడ్లు ధ్వంసం
నియోజకవర్గంలోని ప్రధాన రహదారులపై పెద్దపెద్ద గోతులు పడిపోవడానికి, బొడ్డేరు వంతెన కూలిపోవడానికి, వడ్డాది, తాచేరు, గోవాడ, వంతెనలు శిథిలమవ్వడానికి సదరు నేత క్వారీల నుంచి లారీల్లో భారీగా తరలిస్తున్న గ్రానైట్ రాళ్లే కారణమనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఈ విషయమై ముఖ్యమంత్రి మొదలు జిల్లా కలెక్టర్ వరకు అనేకసార్లు ఆయా ప్రాంతాల వారు ఫిర్యాదులు పంపించారు. కానీ మైనింగ్ కింగ్ దందాకు మాత్రం ఎవ్వరూ అడ్డుకట్టవేయలేకపోయారు అనేకంటే అసలు పట్టించుకోలేదనడమే సమంజసం.
 
అడ్డొస్తే... అంతే సంగతులు
క్వారీల్లో జరిగే బ్లాస్టింగ్‌ల కారణంగా పెద్దపెద్ద రాళ్లు పొలాల్లో పడి పంటలు పాడైపోతున్నాయని రైతులు ఆందోళన చేస్తే చాలు.. ఆయన ఆగ్రహోదగ్రుడై పోతారు. అధికారం అడ్డుపెట్టుకుని పోలీసులను ప్రయోగించి ఆందోళనకారులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుంటారు. ఈయన పేరిటే ఉన్న ఎరుకవాడ క్వారీతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఉద్యమిస్తే.. పోలీసులతో ఉక్కుపాదం మోపి ఆందోళనకు అడ్డుకట్ట వేశారు.

ఇటీవలే ఈ క్వారీని నెలకు రూ.లక్ష చొప్పున గుడ్‌విల్ ఇచ్చే ఒప్పందంతో వేరొకిరి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఇక తాయిలాలతో గ్రామాల్లో కొందరికి ఎర వేసి ఊళ్లో తగాదాలకు కూడా ఆజ్యం పోస్తుంటారు. బిడ్ వేసిన కొండ పరిసర గ్రామాల్లో నివసించే వారిలో ఒకరిద్దరిని డబ్బు ఆశ చూపి తన మనుషులుగా మార్చుకుంటారు. ఆయా గ్రామాల నుంచి మైనింగ్‌కు అభ్యంతరాలు రాకుండా.. సదరు వ్యక్తుల ద్వారా కథ నడిపిస్తారు. అదేవిధంగా కొండకు ఆనుకొని ఉన్న భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు కూడా వీరి ద్వారానేలావాదేవీలు నడిపేస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement