శాఖమూరు ఎస్సీలకు టీడీపీ నేత బెదిరింపులు
తుళ్లూరు రూరల్ : ‘మేం చెప్పినట్టు వింటే మీకు కొంతైనా ప్రయోజనం ఉంటుంది. వినకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం’ అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు శాఖమూరు దళితులను బెదిరిస్తున్నారు. 1991లో 44 మంది ఎస్సీలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వారికి తెలియకుండా ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చేసిన టీడీపీకి చెందిన బడా రైతు పరిహారం కింద వచ్చే ప్లాట్లు, కౌలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.
ఆ నాయకుడి అక్రమాన్ని ఇటీవల సాక్షి వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఉలిక్కిపడ్డ ఆ నాయకుడు ఎస్సీల్లో కొందరిని బెదిరించే పనిలో నిమగ్నమయ్యాడు. నయానో, భయానో వారిని నోరెత్తకుండా చేసి మొత్తం భూమిని కాజేయాలనేది ఆయన ఎత్తుగడగా తెలుస్తోంది. ఒకవేళ ఒప్పుకోకపోతే సగానికి తెగ్గొట్టి మిగిలిన సగం తన సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
శాఖమూరుకు చెందిన 44 మంది దళితులు, ఎరుకుల కులస్తులకు 1991లో సర్వే నంబర్ 86/ఏ లోని 2.40 ఎకరాలను 4 సెంట్ల చొప్పున నివాస స్థలాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అందులో కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకుంటే... మరి కొందరు ఆర్థిక ఇబ్బందులతో ఖాళీగా ఉంచారు. గ్రామంలో ఖాళీ స్థలం ఉండటంతో టీడీపీ నాయకుడు రెవెన్యూ అధికారుల సహకారంతో రికార్డులను తారుమారు చేసి కాజేసే ప్రయత్నం చేశాడు.
విషయం తెలుసుకున్న రైతులు వైఎస్సార్‌సీపీ నేతలను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సాక్షిలో కథనం రావడంతో రెవెన్యూ అధికారులు తామేమీ చేయలేమని చేతులెత్తేసినట్లు తెలిసింది. దీంతో ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చిన టీడీపీ నాయకుడు ఎస్సీలను పిలిచి తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. ‘ఇంతటితో ఆగిపోతే ఉన్న భూమిలో సగమైనా వచ్చేలా చేస్తా.. లేదంటే పూర్తిగా రాకుండా చేస్తాను. తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీచేసినట్లు బాధితులు వివరించారు.