బదిలీలకు వేళాయె..  | All Ready To Telangana Govt Employees Transfers | Sakshi
Sakshi News home page

బదిలీలకు వేళాయె.. 

Published Thu, Jun 13 2019 7:43 AM | Last Updated on Thu, Jun 13 2019 7:43 AM

All Ready To Telangana Govt Employees Transfers - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఇక బదిలీల పర్వం ప్రారంభం కానుంది. సాధారణంగా ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయడం రివాజుగా వస్తోంది. అయితే రాష్ట్రంలో వరుస ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో బదిలీల ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే సమయంలో ఒకేచోట ఎక్కువ కాలం నుంచి పని చేస్తున్న అధికారులను ఎన్నికల నియమావళి ప్రకారం ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కోడ్‌ ముగియగానే సదరు అధికారులను యథావిధిగా జిల్లాలకు బదిలీ చేయడం జరుగుతోంది. అయితే వరుస ఎన్నికలు రావడంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లిన పోలీస్, రెవెన్యూ, మండల పరిషత్, పంచాయతీరాజ్‌ అధికారులు తాత్కాలికంగా బదిలీ అయిన స్థానాల్లోనే నిరవధికంగా ఉండాల్సి వచ్చింది. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, లోక్‌సభ, ప్రాదేశిక ఎన్నికలు పూర్తి కావడంతో ప్రభుత్వం ఉద్యోగులు, అధికారుల బదిలీలపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాకు ఎన్నికల సమయంలో వచ్చిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ తమ జిల్లాలకు వెళ్లేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన జిల్లాకు కేటాయించిన తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఆయా అధికారులు, ఉద్యోగులు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో బదిలీల ప్రక్రియ ఈ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
రాజకీయ మార్గాల ద్వారా ప్రయత్నాలు.. 
ఇక సుదీర్ఘకాలంగా జిల్లాలో విధులు నిర్వహించిన రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్‌ ఉద్యోగులు సైతం ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. వీరిలో అనేక మంది సొంత జిల్లాకు రావడానికి తమకున్న రాజకీయ మార్గాల ద్వారా విపరీత ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ అయిన పోలీస్‌ అధికారులు కూడా తిరిగి జిల్లాలో ఫలానా ప్రాంతానికి వస్తారని, ఫలానా పోస్టింగ్‌ పొందుతారని ఇప్పటికే ప్రచారం జరుగుతుండడం విశేషం. తహసీల్దార్‌ స్థాయి అధికారులకు సంబంధించి సైతం ఇదే తరహా ప్రచారం కొనసాగుతోంది. ఇక ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన తహసీల్దార్లలో అనేక మంది పాలనా వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నం కాకపోవడం, కేవలం ఎన్నికల విధుల పట్లనే దృష్టి సారించి భూ సంబంధ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో జిల్లాలోని పలు మండలాల్లో రెవెన్యూపరమైన పాలన మందకొడిగా కొనసాగుతోందనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. పట్టాదారు పాస్‌ పుస్తకాలు, రైతుబంధు అర్హతకు సంబంధించి రెవెన్యూ పరంగా జరగాల్సిన ప్రక్రియకు సంబంధించి రైతులు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా.. భూ పరమైన అర్జీలను పరిష్కరించాలని కోరినా.. అంటీముట్టనట్లుగా వ్యవహరించారనే విమర్శలు పలు మండలాల్లో వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికల వ్యవహారం పూర్తిగా ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన వ్యవహారాలపై దృష్టి సారించి అధికారులు, ఉద్యోగులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
2016లో జిల్లా విభజన సమయంలో అధికారుల బదిలీలు చేపట్టారు. అనేక మంది జిల్లా కేంద్రంలో ఉన్న అధికారులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆర్డర్‌ టూ సర్వ్‌ ప్రకారం బదిలీ చేశారు. కొద్దినెలలు అక్కడ పని చేసిన అనంతరం మళ్లీ ఖమ్మం వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావించారు. అయితే మూడేళ్లు గడుస్తున్నా బదిలీలు జరగలేదు. అనంతరం ఎన్నికల సమయంలో కొన్ని బదిలీలు చేశారు. సాధారణ బదిలీలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో అనేక మంది తాము కోరుకున్న ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
 
సీపీ బదిలీ? 
ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ బదిలీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే సీపీ బదిలీ అవుతారనే ప్రచారం జరగ్గా.. ఎందుకనో నిలిచిపోయింది. ఎన్నికల కోడ్‌ ముగియడంతో సీపీ బదిలీ అవుతారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఆయన బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు దాటడంతో బదిలీ అనివార్యమని పోలీస్‌ శాఖలో చర్చ జరుగుతోంది. అలాగే ఖమ్మం నూతన సీపీగా గతంలో భద్రాచలం అడిషనల్‌ ఎస్పీగా పనిచేసి.. ప్రస్తుతం రాచకొండలో డీసీపీగా పనిచేస్తున్న ప్రకాష్‌రెడ్డి, కొత్తగూడెం ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న అంబర్‌ కిషోర్‌ఝా, అదేవిధంగా ఐపీఎస్‌ అధికారి రెమా రాజేశ్వరి పేర్లు సైతం వినిపిస్తున్నాయి.

భారీగా పోలీస్‌ అధికారుల బదిలీలు? 
జిల్లాలో భారీ ఎత్తున పోలీస్‌ అధికారుల బదిలీలు అతిత్వరలోనే జరుగుతాయని పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి. దీర్ఘకాలికంగా పలు పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు వరుసగా ఎన్నికలు రావడం, కోడ్‌ అమలులో ఉండడంతో వారి బదిలీలు నిలిచిపోయాయి. కోడ్‌ ముగియడంతో భారీ ఎత్తున బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నగరంలో ఒకరిద్దరు సీఐలు, రూరల్‌లో ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, అదే విధంగా వైరా సబ్‌ డివిజన్‌లో పలువురు ఎస్సైలు, సీఐలకు స్థానచలనం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకు లూప్‌లైన్‌లో ఉన్న అధికారులు సైతం మంచి పోస్టింగ్‌ల కోసం రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చాలాకాలంగా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్‌ అధికారులు సైతం ఉత్తర తెలంగాణలో వేరే జిల్లాలకు బదిలీ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్‌ ప్రాంతాల నుంచి వచ్చిన సీఐ, ఎస్సై స్థాయి అధికారులు తమతమ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. అక్కడ పనిచేస్తూ ఎన్నికల ముందు ఇక్కడకు వచ్చిన కొందరు మాత్రం జిల్లాలోనే ఉండిపోవడానికి రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కావడంతో త్వరలోనే బదిలీలు జరుగుతాయని పోలీస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement