
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల తర్వాత కూడా రెవెన్యూ కార్యకలాపాల్లో కదలిక కనిపించడం లేదు. వాస్తవానికి ఎన్నికలకు ముందే (షెడ్యూల్ వెలువడి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడే) రెవెన్యూ లావాదేవీలు నిలిచిపోయాయి. ఎన్నికల విధుల్లో నిమగ్నమైన జిల్లాల కలెక్టర్లు కీలకమైన ధరణి పోర్టల్‌తోపాటు ఇతర కార్యకలాపాలన్నింటినీ పక్కన పెట్టేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం దాటినా వాటిని పట్టించుకోకపోవడంతో రెవెన్యూ వ్యవస్థ సుప్తచేతనావస్థకు చేరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో ఆ ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయోనన్న ఆలోచనతో కలెక్టర్లు తమ దగ్గరకు వచ్చిన ఫైళ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టేయడం, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కూడా పట్టించుకోకపోవడంతో తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది రెవెన్యూ పనులు తప్ప మిగిలిన పనులతో కాలం వెళ్లదీస్తుండటం గమనార్హం.
ధరణిపై సమీక్షించినా...
వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి ధరణి పోర్టల్‌పై సమీక్షించి 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్‌ను ఆదేశించారు. కానీ రెవెన్యూ ఫైళ్ల పరిష్కారం అంశం ఈ సమావేశంలో చర్చకు రాలేదు. ధరణి పోర్టల్ కింద 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సమావేశంలో భాగంగా రెవెన్యూ అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమస్యల పరిష్కారంపైన ఆయన ఎలాంటి ఆదేశాలివ్వకపోవడం గమనార్హం. దీనికితోడు రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కూడా నిలిచిపోయింది.
జీవో 58, 59తోపాటు ఇతర జీవోల ద్వారా జరగాల్సిన ఈ ప్రక్రియ కూడా ఎన్నికల కారణంగానే ఆగిపోయింది. ఎన్నికల తర్వాత తమ విన్నపాలకు పరిష్కారం లభిస్తుందని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఆ దరఖాస్తులను కూడా కలెక్టర్లు పరిష్కరించడం లేదు. అటు ధరణి పోర్టల్, ఇటు భూముల క్రమబద్ధీకరణ నిలిచిపోయిన నేపథ్యంలో కేవలం ధరణి పోర్టల్ ద్వారా భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు, ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి, క్రిస్మస్ తోఫాను పంపిణీ చేయడానికే పరిమితమయ్యామని, భూ సంబంధిత సమస్యలపై తమ కార్యాలయాలకు వచ్చే వారికి సమాధానం చెప్పుకోలేక పోతున్నామని తహసీల్ కార్యాలయాల సిబ్బంది వాపోతున్నారు.
అటు ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంతోపాటు భూముల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని, కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారనే కారణంతోనే వ్యవస్థ స్తంభించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ వ్యవహారాలపై స్పష్టతనివ్వాలని, అప్పుడే భూ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ల నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులు, ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment