సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులపై అటు అధికారిక వర్గాల్లో, ఇటు రాష్ట్ర ప్రజానీకంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాము కేటాయించిన నిధులతో ఆరు గ్యారంటీల అమలు జరిగి తీరుతుందని సర్కారు చెబుతోంటే.. మరికొన్ని నిధులు అవసరమని అధికార వర్గాలు లెక్కలు కడుతున్నాయి. మరోవైపు ఎన్నికల సమయంలో, మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను యథాతథంగా అమలు చేయాలంటే.. ఇప్పుడు బడ్జెట్‌లో పెట్టిన దానికి సుమారు మూడు రెట్లు ఎక్కువగా నిధులు అవసరమనే చర్చ జరుగుతోంది.
హామీలను సంపూర్ణంగా అమలు చేయాలంటే ఏటా రూ.1.36 లక్షల కోట్లకుపైనే కావాల్సి ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు రూ.53 వేల కోట్లను మాత్రమే కేటాయించింది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఆరు గ్యారంటీల అమలు వ్యవహారం అయోమయంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ గ్యారంటీలను పూర్తిస్థాయిలో కాకుండా, కొందరికే పరిమితం చేసినా ఏటా రూ.80 వేలకోట్లకుపైనే అవసరమని అధికార వర్గాలు అంటున్నా.. దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు.
ఆరు గ్యారంటీల్లో.. 13 పథకాలు
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ‘మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, యువ వికాసం ఉన్నాయి. ఈ ఆరు గ్యారంటీల పరిధిలో మొత్తం 13 పథకాలను అమలు చేయాల్సి ఉంది. వీటిని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు భారీ స్థాయిలో నిధులు అవసరం కానున్నాయి.
రైతు భరోసా..
గత సర్కారు రాష్ట్రంలోని దాదాపు 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి సుమారు 69లక్షల మంది రైతులకు ఏటా ఎకరానికి రూ.10,000 చొప్పున చెల్లించింది. కాంగ్రెస్ తాము అధికారంలోకి వచ్చాక ఎకరాకు రూ.15,000 ఇస్తామని ప్రకటించింది. దీనికి ఏటా సుమారు రూ.22,800 కోట్లు అవసరం.
► రాష్ట్రంలో భూమి లేని కౌలు రైతులు 6.5 లక్షల మంది ఉన్నట్టు అంచనా. వారికి ఏటా రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు ఏటా రూ. 975 కోట్లు కావాలి.
► కాంగ్రెస్ కూలీలకు ఏటా రూ. 12 వేలు ఇస్తామని పేర్కొంది. రాష్ట్రంలో 52లక్షలకుపైగా ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉన్నా యాక్టివ్‌గా ఉన్న జాబ్‌కార్డులు దాదాపు 32 లక్షల మేర ఉన్నాయి. జాబ్‌కార్డులున్న అందరికీ పథకాన్ని వర్తింపజేస్తే ఏటా రూ.6,240 కోట్లు కావాలి, యాక్టివ్ వారికే ఇస్తే రూ.3,840 కోట్లు అవసరం.
► వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పేర్కొంది. రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న కోటీ 30లక్షల టన్నుల ధాన్యానికి బోనస్ ఇవ్వాలంటే రూ.6,500 కోట్లు అవసరం.
గృహ జ్యోతి..
ప్రస్తుతం రాష్ట్రంలో 200యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న గృహ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 95.23 లక్షలు. ఆ కుటుంబాలు ఏటా దాదాపు 9,022 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నాయి. ఒక్కో యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయం సగటున రూ.7గా లెక్కించినా.. ఏటా గృహజ్యోతి అమలు కోసం సుమారు రూ.6,315 కోట్లను విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది.
ఇందిరమ్మ ఇళ్లు..
రాష్ట్రంలో సొంతిల్లు లేనిపేదలకు 20 లక్షల ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అంటే ఏటా నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం కోసం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామన్న హామీ మేరకు.. 20లక్షల ఇళ్లకు మొత్తంగా రూ. లక్ష కోట్లు అవసరం. ఏటా బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. అయితే సర్కారు తాజా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ. ఏడు వేల కోట్లే కేటాయించింది.
చేయూత..
రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 43.68 లక్షల మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. ప్రస్తుతం ప్రతినెలా దివ్యాంగులకు రూ.4వేలు, ఇతర లబ్ధిదారులకు రూ.2 వేలు ఇస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు, ఇతర పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఏటా 5.5 లక్షల మంది దివ్యాంగుల పింఛన్లకు రూ.3,960 కోట్లు, సుమారు 38 లక్షల ఇతర పింఛన్లకు రూ.18,240 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.
యువ వికాసం..
యువ వికాసం పథకంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. విద్యార్థుల ఫీజులు, కోచింగ్ చెల్లింపుల కోసం రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ఏటా దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్ వంటివి పూర్తి చేసుకుంటున్నారు. వీరికి విద్యా భరోసా కోసం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఇస్తారా? ఎలా సర్దుబాటు చేస్తారు. లోన్లు తీసుకుని ఇస్తే వడ్డీ ఎవరు భరిస్తారన్నది తేలలేదు.
మహాలక్ష్మి..
మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కలి్పస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు కోటీ 65లక్షల మంది ఉన్నారు. ఇందులో సుమారు 26 లక్షల మంది ఇప్పటికే వితంతు, ఒంటరి, వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు. వారిని మినహాయించినా మిగతా కోటీ 39లక్షల మందికి ప్రతీనెలా రూ.2,500 లెక్కన ఏటా రూ.41,700 కోట్లు కావాల్సి ఉంటుంది.
► రాష్ట్రంలో మొత్తం 70లక్షల మంది మహిళల పేరిట వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సిలిండర్ రూ.500కే ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఏడాదికి పన్నెండు సిలిండర్లు ఇస్తే.. ఏటా రూ.4,200 కోట్లు గ్యాస్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఆరు సిలిండర్లకే పరిమితం చేస్తే రూ.2,100 కోట్లు చెల్లించాలి.
► ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోంది. దీనికోసం ప్రతి నెలా రూ.300 కోట్ల చొప్పున ఏటా ఆర్టీసీకి రూ.3,600 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment