తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య పత్రాల యుద్దం మరీ రక్తి కట్టించినట్లు అనిపించదు. ప్రభుత్వం బీఆర్ఎస్ పై ఏవో కొన్ని ఆరోపణలు చేయడానికే శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు కనిపిస్తుంది. దానికి సమాధానంగా బీఆర్ఎస్ విడుదల చేసిన స్వేదపత్రం తమ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు సమాధానం కన్నా,సెంటిమెంట్ ప్రయోగానికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్దిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఆర్దిక, విద్యుత్ శాఖల శ్వేతపత్రాలలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టే యత్నం చేశారు. విద్యుత్ ఆర్ధిక రంగంలో వివిధ శాఖల ద్వారా ,కార్పొరేషన్ ల ద్వారా చేసిన అప్పులను ఆయన వివరించారు. మొత్తం మీద 6.71 లక్షల కోట్ల అప్పులు గత ప్రబుత్వం చేసిందని లెక్కగట్టారు.
✍️కాని ఆ అప్పులు వినియోగించిన తీరు, దాని వల్ల మంచి జరిగిందా?లేదా? ఎక్కడ లోపం జరిగింది?దానివల్ల తెలంగాణకు ఏ రకంగా నష్టం వాటిల్లింది అనేదానిపై స్పష్టంగా మాట్లాడినట్లు కనబడదు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రస్తుతం అప్పులు చేయక తప్పని స్థితి. ఆ అప్పులు ఏ రకంగా తెచ్చారు? వాటికి ఎంత వడ్డీ చెల్లించాలి?కరోనా వంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పులు లేకుండా ప్రభుత్వం ఎలా నడవాలి అన్న ప్రశ్నలకు సమాదానం లేదు. పోనీ తాము అప్పులు తేబోమని కాని, అప్పులు తెచ్చినా ఫలానా అందుకే వినియోగిస్తామని కాని భట్టి విక్రమార్క చెప్పలేకపోయారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు చూస్తే కొన్ని కొంత అభ్యంతరకరంగానే కనిపిస్తాయి. నీళ్లు అమ్మి అప్పులు కడతామని వేల కోట్ల అప్పు తేవడం ఆశ్చర్యంగానే ఉంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో మంచినీటిని రెండువేల లీటర్ల వరకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో వాటర్ వర్క్స్ సంస్థ ఆర్దిక పరిస్థితి కుదేలు అయ్యే ప్రమాదం ఏర్పడింది.
✍️ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దానిని మార్చగలుగుతుందా?అన్నది అనుమానమే. ప్రైవేటు సంస్థలు అప్పులు తెచ్చేటప్పుడు ఏదో రకంగా బ్యాంకర్లను ఒప్పించేందుకు రకరకాల అబద్దాలు చెబుతుంటాయి.అంకెలను పెంచి ప్రాజెక్లు రిపోర్లులు ఇస్తుంటాయి. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసిందన్న భావన కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు లక్ష కోట్ల అప్పు తేవడం విశేషం. అది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటే దానికి అంత అప్పు అయినా ఫర్వాలేదు. ఆ అప్పు పూర్తిగా సద్వినియోగం అయి ఉంటే మంచిదే. కాని అక్కడే పలు సందేహాలను ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బారేజీ కుంగడం బీఆర్ఎస్ కు తీరని అప్రతిష్ట తెచ్చిపెట్టింది. విద్యుత్ రంగానికి సంబందించిన శ్వేతపత్రంలో కూడా ఆయా బకాయిల గురించి భట్టి విక్రమార్క వెల్లడించారు. అందులో ప్రభుత్వ సంస్థల బకాయిలే ముప్పైవేల కోట్ల వరకు ఉన్నాయి.
✍️ప్రభుత్వమే అతిపెద్ద బాకీదారుగా ఉంటే ప్రజలు మాత్రం విద్యుత్ బిల్లులు సకాలంలో ఎందుకు చెల్లిస్తారు?దీనిపై ప్రభుత్వ వివరణ ఇచ్చి ఉండాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ మెంట్ ఆఫీస్ లకు సంబంధించి బకాయిలను ఎప్పటికప్పుడు తీర్చివేస్తామని ఎందుకు చెప్పలేకపోయిందన్నది ప్రశ్న. లిఫ్ట్ ఇరిగేష్ స్కీములకు సంబంధించి పెద్ద ఎత్తున సుమారు 15 వేల కోట్ల వరకు పెండింగులో ఉండడం ఊహించిందే.కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అవి బయటపడకుండా కప్పిపుచ్చింది.డిస్కంలకు సంబంధించి ఎనభైఒక్కవేల కోట్ల మేర అప్పులు,నష్టాలు చూస్తే ఆ వ్యవస్థ కోలుకోవడం ఎలా అన్న ప్రశ్న వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మాత్రం విద్యుత్ సరఫరాలో దాదాపు కోత లేకుండానే అందించింది. విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని గతంలో కాంగ్రెస్ ఆరోపించేది. కాని శ్వేతపత్రంలో దానికి ఆధారాలు చూపించలేదు.
✍️గత ప్రభుత్వం చత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినప్పుడు అక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. అయినా అక్రమాలు జరిగాయని భట్టి విక్రమార్క చెబుతారా! కొత్త విద్యుత్ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని విక్రమార్క చేసిన ఆరపణలపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్ చేయడం, దానిపై న్యాయ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అందులో ఏమి బయటపడుతుందన్నది ఇప్పుడే చెప్పలేం.ఈ శ్వేతపత్రాలు ఇవ్వడంలో తప్పు లేదు.కాని గత ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలను కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న రోజులోల చేసినవే.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసినా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో అలవిగాని హామీలను ఎలా ఇచ్చిందన్నదానికి జవాబు దొరకదు. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల సాయం,200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రెండు లక్షల రుణ మాఫీ ,గ్యాస్ బండ ఐదువందల రూపాయలకే ఇవ్వవలసి ఉంది.రైతు భరోసా గా తక్షణం ఎకరాకుపదిహేనువేల రూపాయల చొప్పు ఆర్ధిక సాయం అందించవలసి ఉంది.
✍️దళిత బంధు వంటి భారీ స్కీములు ఉండనే ఉన్నాయి. అన్ని స్కీములకు కలిపి అయ్యే వ్యయం నమూడు లక్షల కోట్లపైనే ఉంటుందన్నది ఒక అంచనా . ప్రభుత్వం వీటికి ఎంత వ్యయం అవుతుది అన్నదాని గురించి కూడా ఏమైనా పత్రాలు విడుదల చేస్తుందా అన్నది డౌటే. ఈ స్కీముల అమలులో ఎలాంటి కోత పెడతారో చూడాలి.ప్రజాపాలన పేరుతో ఈ స్కీములు కావాల్సిన వారు నమోదు చేసుకోవాలని అనడమే కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్నికల మానిఫెస్టోలో అలా చెప్పారా అన్నది ప్రశ్న.ఏపీలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా అర్హులందరికి స్కీములు అమలు చేస్తున్నారు. ఇక్కడ కూడా వలంటీర్ల వ్యవస్థను పెడతామని గతంలో ఒక సందర్భంలో రేవంత్ అన్నారు. బస్‌లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ నిలబెట్టుకున్నప్పటికీ, దాని వల్ల ఆర్టిసికి ఎంత నష్టం వాటిల్లిందన్నది చెప్పాలి.
✍️దానిని ఎలా భర్తీ చేస్తారు? ఈ స్కీము వల్ల ఆటోలు,క్యాబ్ ల వారికి జరుగుతున్న నష్టంపై ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏమి చూపుతుంది?ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి.గత ప్రభుత్వం ఆర్దిక నిర్వహణ సరిగా లేదు కనుక తాము స్కీములు అమలు చేయలేకపోతున్నామంటే ప్రజలు అంగీకరించకపోవచ్చు. వందరోజుల తర్వాత కాంగ్రెస్ జవాబు ఇవ్వక తప్పనిస్థితి ఏర్పడుతుంది. ఇక కేటీఆర్ స్వేదపత్రం పేరుతో ప్రభుత్వానికి జవాబు ఇచ్చినప్పటికీ, అందులో అతిశయోక్తులు కూడా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆరులక్షల కోట్లలో ప్రభుత్వ అప్పు మూడున్నరలక్షల కోట్లేనని, మిగిలినవి గ్యారంటీల కింద తెచ్చిన అప్పులని అన్నారు. ఏ అప్పు అయినా ఒకటే అని అనుకుంటారు. పదమూడు లక్షల కోట్లు వ్యయం చేస్తే ఏభై లక్షల కోట్ల సంపద సృష్టించామని కేటీఆర్ చెబుతున్నారు.
✍️ఆ సంపద నిజంగానే ప్రజలకు ఉపయోగపడితే సంతోషమే. ఆ సంపద ద్వారా ఆదాయం వస్తున్నట్లయితే ఇన్ని వేల కోట్ల బకాయిలు ఎందుకు పెండింగులో ఉన్నది వివరించాలి. ప్రభుత్వం శ్వేతపత్రంలో వెల్లడించిన వాటికి సమాధానం లేనప్పుడు కేటీఆర్ సెంటిమెంట్ ప్రయోగించారు. రాష్ట్రం అప్పుల పాలైందని పదే,పదే ప్రభుత్వం చెబితే తెలంగాణ పరపతి దెబ్బతింటుందని, తెలంగాణ అస్తిత్వం నిలబడిందంటే దానికి కేసీఆర్ కారణమని కేటీఆర్ అంటున్నారు. ప్రభుత్వపరంగా చూస్తే కేసీఆర్ పాలన మరీ అద్వాన్నం అని అనలేకపోయినప్పటికీ, కొన్ని విషయాలలో మితిమీరి వ్యవహరించడం వల్ల నష్టపోయారన్నది వాస్తవం. నిజానికి వారు చెబుతున్నదాని ప్రకారం అంత స్వేదం చేసి సంపాదించి ఉంటే ప్రజలు ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు?వారిని ఎందుకు ఓడించారు?కేవలం రాజకీయ కారణాలతోనే ఓటమిపాలయ్యారా?లేక ప్రభుత్వంలో జరిగిన తప్పుల వల్ల కూడానా అన్నది వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
✍️అప్పుడు కేసీఆర్ మరీ అతిగా వెళ్లకుండా ఉంటే ఇప్పుడు ఈ ఓటమి ఎదురయ్యేది కాదు. అలాగే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంపై అన్నిటిని నెట్టేసి కాలం గడుపుదామన్నా కుదరదు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు ఎప్పటికప్పుడు పెంచుతున్నది రాజకీయ పార్టీలే. వాటిని నెరవేర్చకపోతే ప్రజలు వెంటనే స్పందించే అవకాశం కూడా ఉంటుంది. వారికి కావల్సింది శ్వేతపత్రాలు,స్వేదపత్రాలు కాదు. రాజకీయ పార్టీలు తాము విడుదల చేసిన ఎన్నికల పత్రాలలోని వాగ్దానాలను నెరవేర్చడం.
Comments
Please login to add a commentAdd a comment