భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం నుంచి దిగిపోయాక తొలిసారి నల్గొండ నుంచి పోరాట శంఖం పూరించారు. ఆయన చెప్పిన విషయాలతో మనం ఏకీభవించవచ్చు. విబేధించవచ్చు. కాని ఒక విషయం మాత్రం అంగీకరించక తప్పదు. ప్రసంగం చేయడంలో, ప్రజలను ఆలోచింపచేయడంలో, అవసరమైతే రెచ్చగొట్టడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని మరోసారి రుజువు చేసుకున్నారు. తాను పులినంటూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవారిని దద్దమ్మలు, చేతకాని చవటలు అంటూ విరుచుకుపడ్డారు.
తన హయాంలో జరిగిన కొన్ని అభివృద్ది పనులు వివరించారు. కరెంటు సరఫరా గురించి ప్రస్తావించారు. మేడిగడ్డకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా వెళ్లడంపై కూడా స్పందించారు. కాగా ఈ ప్రసంగంలో ఎక్కడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా ఆయన ఉచ్చరించకపోవడం గమనించదగిన అంశం. రేవంత్ బహుశా తన స్థాయి కాని వ్యక్తి అని అనుకుని ఉండవచ్చు. లేదా అనవసర ప్రాధాన్యత ఎందుకు అని భావించి ఉండవచ్చు.
కృష్ణా నదిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డు మేనేజ్ మెంట్‌కు అప్పగించడానికి వీల్లేదంటూ కేసీఆర్ నల్గొండలో భారీ సభను నిర్వహించారు. సహజంగానే కేసీఆర్ స్పీచ్‌పై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఆయన వాయిస్ ఏ రకంగా ఉంటుంది? ఎంత పదునైన భాష వాడతారు అన్న ఆసక్తి నెలకొంది. ఆ విషయంలో ఎవరి అంచనాలను ఆయన తగ్గించలేదు. తన శైలిలో ఉచ్ఛస్వరంతో ఆయన మాట్లాడుతుంటే సబికులంతా శ్రద్దగా విన్నారు. ఆయా సందర్భాలలో చప్పట్లు కొట్టారు.
మరో పోరాటానికి ప్రజలు సిద్దపడాలని, ప్రత్యేకించి దక్షిణ తెలంగాణలోని జిల్లాల వారంతా అప్రమత్తం అవ్వాలని ఆయన పిలుపు ఇచ్చారు. కృష్ణా నది జలాలలో ఏభై శాతం వాటాను పొందకుండా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించారాదన్న డిమాండ్ పేరుతో జరిగిన ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సభను గమనిస్తే ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఒకప్పటి కాంగ్రెస్ నేతలు విబి రాజు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డలపై ఒక నానుడి వ్యాప్తిలో ఉండేది. వీబీ రాజు మంత్రిగా ఉంటే సమస్య, చెన్నారెడ్డి మంత్రివర్గం బయట ఉంటే సమస్య అన్నది ఆ నానుడి. అంటే చెన్నారెడ్డి మంత్రిగా లేకపోతే ఏదో ఒక ఉద్యమం తీసుకు వస్తారన్నది అప్పట్లో అందరి భావన. దానికి తగినట్లుగానే ఆయా సందర్భాలలో మంత్రిగా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుండేవారు.
ఉదాహరణకు 1969లో ఆరంభమైన తెలంగాణ ఉద్యమంలో తొలుత ఆయన ప్రమేయం ఏమి లేదు. కాని అప్పట్లో ఆయన ప్రభుత్వంలో లేరు. దాంతో ఆయన తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాన వేసుకుని మొత్తం ఈ ప్రాంతం అంతటా తన ప్రభావాన్ని చూపించారు. తదుపరి తెలంగాణ ప్రజాసమితి పేరుతో పార్టీని పెట్టి పది లోక్ సభ స్థానాలను గెలిచి సంచలనం సృష్టించారు. తదుపరి ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వేరే కథ. ఈ విషయం ఎందుకు గుర్తుకు వచ్చిందంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకఛత్రాధిపత్యంతో ప్రభుత్వాన్ని నడిపారన్నది ఎక్కువ మంది భావన. కానీ..
ప్రతిపక్షంలోకి రాగానే తిరిగి ఉద్యమకారుడి అవతారం ఎత్తగలిగారు. గత ఎన్నికల సమయంలో వివిద ప్రచార సభలలో కేసీఆర్ స్పీచ్ లలో ఉత్తేజం పెద్దగా కనిపించేది కాదు. ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నారన్నట్లుగా అనిపించేది. నల్గొండ సభలో ఆయనలో పాత కేసీఆర్ కనిపించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన ఏ తరహాలో ఉపన్యాసాలు ఇచ్చేవారో, దాదాపు అదే స్టైల్‌లోకి వచ్చారనిపిస్తుంది. తెలంగాణ యాస,భాషతో పాటు, దద్దమ్మలు, చవటలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నవారిపై ద్వజమెత్తారు.
ప్రతిపక్ష నేతగా శాసనసభకు హాజరు కావడానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కాని నల్గొండలో పోరాట సభ పెట్టి ప్రజలలో కొత్త ఆలోచనలు రేకెత్తించారు. ప్రజలను రెచ్చగొట్డానికి కేసీఆర్ ఈ సభను వాడుకున్నారన్న విమర్శలు వస్తే రావచ్చు. కాని ఆయన మళ్లీ ప్రజా జీవనంలో బాగా చురుకుగా ఉండబోతున్నారనిపించింది. తద్వారా బీఆర్ఎస్ క్యాడర్‌లో ఒక ఆత్మ విశ్వాసం పెంచగలిగారు. కేసీఆర్‌కు జనంలో ఆదరణ తగ్గలేదన్న నిరూపించుకునే యత్నం చేశారు.
తాను తెలంగాణ కోసమే పనిచేస్తానని చెప్పడానికి ఈ సభను వాడుకున్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులందరూ చేసిన విమర్శలకు ఒకేసారి జవాబు ఇచ్చారనిపిస్తుంది. కోమటిరెడ్డి రైతు బందు రాలేదని అన్నవారిని చెప్పుతో కొడతానన్న వ్యాఖ్యను ఆయన ప్రస్తావించి రైతుల వద్ద ఇంకా గట్టి చెప్పులు ఉంటాయని హెచ్చరించారు.
తాను విద్యుత్ సరఫరా కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుని 24 గంటలు ఇస్తూ, కాంగ్రెస్ రాగానే కోతలు మొదలయ్యాయని అంటూ అసెంబ్లీలో కూడా జనరేటర్ పెట్టుకున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.నిజంగానే గతంలో ఎప్పుడూ శాసనసభలో ఇలా ప్రత్యేకంగా బయటనుంచి తెప్పించి జనరేటర్ పెట్టలేదు. ఎప్పుడైనా కరెంటు పోయినా వెంటనే వచ్చేది. ఈ పాయింట్ నిజంగానే తెలంగాణ ప్రభుత్వానికి కాస్త ఇబ్బంది కలిగించేదే. దానిని కేసీఆర్ సద్వినియోగం చేసుకున్నారు.
రైతు బంధు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆయన నిలదీశారు. కృష్ణా జలాల వాటాపై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఆయా అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. పులి మళ్లీ వచ్చిందన్న చందంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.
తెలంగాణకు అన్యాయం జరిగితే కట్టెకాలేవరకు పులిలా పోరాడతానని కేసీఆర్ ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాల ఆందోళలనలకు అనుమతి ఇవ్వడానికి అంతగా ఇష్టపడని కేసీఆర్, ధర్నా చౌక్ ను కూడా అనుమతించని కేసీఆర్ ,ఇప్పుడు ప్రతిపక్షంగా పోరాడే హక్కు ఉంటుందని చెప్పడం విశేషం. తనకు ,తన ప్రభుత్వానికి ఒక మచ్చగా మారిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనను ఆయన తక్కువ చేసి చూపించే యత్నం చేశారు.
రేవంత్ నాయకత్వంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ప్రదేశాన్ని చూడడానికి ఎమ్మెల్యేలు వెళ్లడాన్ని ఆయన తప్పుపడుతూ , ఏమిటి వారు చూసేది. బొందలగడ్డ అంటూ వ్యాఖ్యానించారు.నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుంగలేదా? కడెం ప్రాజెకట్టు గేట్లు తగలేదా? మూసి ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోలేదా?అంటూ అది పెద్ద విషయం కాదన్నట్లుగా సమాదానం ఇచ్చారు. గోదావరి లో నీరు ఉన్నా,ఎత్తిపోయకుండా రైతులను ఎండగడుతున్నారని ఆయన ఆరోపించారు.
అదే సమయంలో రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంలు మేడిగడ్డపై చేస్తున్న విమర్శలకు కేసీఆర్ సూటిగా సమాదానం చెప్పినట్లు అనిపించలేదు. తాము తిరిగి డబుల్ స్పీచ్ లో తిరిగి అధికారంలో వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానిదని ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని అవకాశాలను కేసీఆర్ వాడుకున్నారు. ఎన్నికల కోసం ఈ సభ పెట్టలేదంటూనే కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలలో విజయం సాదించడం కోసం ఎజెండాను సెట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
గత శాసనసభ ఎన్నికలలో దక్షిణ తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం ,మహబూబ్ నగర్ జిల్లాలలో బీఆర్ఎస్ బాగా దెబ్బతిన్న నేపధ్యంలో నల్గొండ నుంచే ఈ సభను నిర్వహించడం విశేషం. తద్వారా వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తన పట్టు నిలబెట్టుకోవడానికి ఆయన నాందీ ప్రస్తావన పలికారనిపిస్తుంది.
ఒక రకంగా ఇది ఆయనకు పరీక్షే. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తదితరులు ఎంత యాక్టివ్ గా పనిచేసినా, కేసీఆర్ రంగంలో దిగితే ఉండే ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చూపించడానికి ఈ సభను ఆయన విజయవంతంగా వాడుకున్నారు. కాకపోతే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఇదంతా రాజకీయం కోసమే అని జనం అనుకుంటే మాత్రం కొంత నష్టం జరగవచ్చు. తెలంగాణ సాధనకోసం పలువ్యూహాలు అమలు చేసిన కేసీఆర్ ఈ విషయాలు తెలియనివి కావు. అయినా తాను ఎంచుకున్న మార్గంలో వెళ్లడమే ఆయన శైలి. ఈ సభతో బీఆర్ఎస్ క్యాడర్ లో విశ్వాసం ఎంత మేర పునరుద్దరణ అయింది తెలుసుకోవడానికి పార్లమెంటు ఎన్నికలే గీటు రాయి అవుతాయని చెప్పాలి.
కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment