తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నెల రోజుల పాలన సంతృప్తి ఇచ్చిందని చెప్పారు. సంతోషమే. కాకలు తీరిన యోధుడుగా పేరొందిన బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి, ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రేవంత్ పాలన నెలరోజులు సాఫీగానే సాగిపోవడం వరకు ఓకే.కాని తన పాలనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాకుండా ప్రజల నుంచి పొందగలిగితే ఆయనకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మీడియా లో రేవంత్ సంతృప్తి ప్రకటించడం తప్పు కాదు. తానే ఏదైనా ఆడ్వర్స్ వ్యాఖ్య చేస్తే దాని ప్రభావం ప్రభుత్వంపైన, మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన ఉంటుంది.ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న అలాగే చెబుతారు. కాని ఒక్కసారి మొత్తం పరిస్తితిని సమీక్షిస్తే ప్రభుత్వం వచ్చిన కొత్త కనుక ఎవరికి వారు సర్దుకుపోతున్నట్లుగా అనిపిస్తుంది.ఎవరైనా కామెంట్ చేసినా వారిపై ఎదురు విమర్శలు చేస్తున్నారు.
ప్రభుత్వం వచ్చి నెల రోజులే అయినా విమర్శలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.మంత్రులు కాని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాని ప్రస్తుతానికి ఒకింత అయోమయ పరిస్థితిలో ఉన్నారనిపిస్తుంది. కెసిఆర్ ప్రభుత్వాన్ని ఓడించగలిగారు కాని, తాము ఈ ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లుగా ఉంది. ఆయా నిర్ణయాలను మార్చుకోవలసి రావడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడం ఎలా అన్నది అర్ధం కాక తలపట్టుకుంటున్న తీరు కనిపిస్తూనే ఉంది. ఇవి ఒక ఎత్తు అయితే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి ముఖ్యమంత్రి పదవిపై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించేవి. మల్లు భట్టి నేరుగా అనకపోయినా, ఆయన మనసులోని మాటను భార్య బయటపెట్టారని అనుకోవచ్చు.
మరో వైపు ఇంకో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు క్యాబినెట్ లో బాగా ప్రాదాన్యం ఉందని చెప్పడంపై కూడా కాంగ్రెస్లో చెవులు కొరుక్కుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘట్టాలు మరెన్నో వచ్చే అవకాశం ఉంది. కర్నాటకలో సైతం పదవుల పంచాయతీ తెగడం లేదు. తెలంగాణ కూడా అందుకు భిన్నంగా ఉండకపోవచ్చు. ఈ అంశాన్ని పక్కనబెడితే రేవంత్రెడ్డి కొన్ని తప్పులు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. రేవంత్ దురుద్దేశంతో పొరపాట్లు చేశారని చెప్పకపోయినా, ఆయన కొన్ని నిర్ణయాలలో కొంత అనుభవ రాహిత్యం తెలుస్తుంది. ఉదాహరణకు ఫార్మాసిటీ రద్దు ప్రకటన ప్రభుత్వానికి నష్టం చేసిందన్న అభిప్రాయం ఉంది.దాంతో సర్దుబాటు ధోరణికి వెళ్లి పార్మాసిటీని ఏదో విభజిస్తామని,ఇంకేదో చేస్తామని చెప్పినా, దానిలో స్పష్టత లేదు.
ఫార్మాసిటీ ఆధారంగా జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు దెబ్బతిన్నాయన్న భావన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మందగించింది. ఈ ప్రభుత్వం వచ్చాక అది ఇంకా మెరుగు కాలేదు. కొద్ది రోజుల క్రితం కూడా మీడియాలో వచ్చిన కధనాలు చూస్తే వేలాది అపార్టుమెంట్ల అమ్మకాల కోసం ఎదురు చూస్తున్నాయి. భూముల క్రయ,విక్రయాల లావాదేవీలు ఆశించినంతగా పుంజుకోలేదు.గత ప్రభుత్వ టైమ్ లో అట్టహాసంగా ప్రచారం పొందిన ఎఫ్ 1 కార్ రేసింగ్ ఒప్పందాన్ని రద్దు చేయడం , ఆ సంస్థను తిరిగి డబ్బు చెల్లించాలని నోటీసు ఇవ్వడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చూడాల్సి ఉంది.
రేవంత్ పై దాడి చేసే మీడియా లేకపోయింది కాబట్టి సరిపోయింది కాని, ఈపాటికి గందరగోళం సృష్టించి ఉండేవి. ఉదాహరణకు ఎపిలో ఇలాంటి నిర్ణయాలు ఏవి జరిగినా ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర ఎల్లో మీడియా రచ్చ,రచ్చ చేసి ఉండేవి. తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని సమాచారం వచ్చింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం. గతంలో జగన్ ప్రభుత్వం ఎపిలో పిపిఎల సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఎంత రభస చేశాయో గమనిస్తే, ప్రస్తుతం తెలంగాణలో రేవంత్కు అలాంటి ఇబ్బందులు లేవని అర్ధం చేసుకోవచ్చు. దానికి కారణం ఈనాడు రామోజీరావుకు తెలంగాణలో ఆస్తులు అధికంగా ఉండడం, తాను భుజాన వేసుకుని తిరిగే తెలుగుదేశం పార్టీ కూడా రేవంత్కు పరోక్షంగా మద్దతు ఇస్తుండడంతో ఆయన నోరు మెదపడం లేదు. ఇక ఆంద్రజ్యోతి రాదాకృష్ణ అయితే ప్రస్తుతానికి రేవంత్ ప్రభుత్వాన్ని తెగ పొగిడేస్తున్నారు.
దీనికి కూడా ఒక కధ లేకపోలేదు. మధ్యలో కొద్దిరోజులు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలని కొన్ని కదనాలు ఇచ్చారట.దాంతో రేవంత్ దిగి వచ్చి రాధాకృష్ణ కోరినట్లు వ్యవహరించారన్న అభిప్రాయం వ్యాప్లిలోకి వచ్చింది. ముఖ్యంగా ఏ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా , ఆంధ్రజ్యోతికి మాత్రం ఇవ్వక తప్పలేదు.దానికి కారణం రాదాకృష్ణ బ్లాక్ మెయిలింగేనని రాజకీయవర్గాలలో ప్రచారం అయింది. పైగా రేవంత్ను ముఖ్యమంత్రిగా కాకుండా, అదేదో తన అదీనంలో ఉన్న వ్యక్తి మాదిరి ఆయన ఇంటర్వ్యూ చేశారని పలువురు వ్యాఖ్యానించారు. రాధాకృష్ణ ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్, వ్యవహార శైలి అంత అహంకారపూరితంగా ఉన్నాయని అంటున్నారు.
రేవంత్ వీటిని భరించడమే కాకుండా, రాధాకృష్ణ ట్రాప్లో పడి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని పరోక్షంగా కించపరుస్తున్నట్లుగా మాట్లాడారని సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం అయింది.ప్రత్యేకించి ఎమ్మెల్యేల ఫిరాయింపులు, కొనుగోళ్ల లావాదేవీలు మొదలైనవాటికి సంబందించి అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ ప్రకృతి జవాబు ఇచ్చిందన్నట్లుగా వ్యాఖ్యానించడం నిజంగానే అభ్యంతరకరం అని చెప్పకతప్పదు. నిజానికి ఏపాటి కొద్ది అనుభవం ఉన్న జర్నలిస్టు అయినా ఒక ప్రశ్న కచ్చితంగా వేసి ఉండేవారు.రేవంత్ కూడా గతంలో ఒక నామినెటేడ్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో పట్టుబడిన సంగతిని గుర్తు చేసేవారు.ఆ ప్రశ్న వేయకుండా వైఎస్ ఆర్ ను కించపరిచేలా రాధాకృష్ణ ప్రశ్నించడం, దానికి రేవంత్ సమర్ధించడం బాగున్నట్లు అనిపించదు.అయినా ప్రస్తుతం రేవంత్ నిస్సహాయుడని అనుకోవాలి.
ఇదే రేవంత్ ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ ఆర్ ను పొగిడిన ఘట్టాలు మరచిపోయి మాట్లాడినట్లు అనిపిస్తుంది.ఎపి ముఖ్యమంత్రి జగన్ పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలను రాధాకృష్ణ చేయించారు. జగన్ పోన్ చేసి అభినందించలేదని రాధాకృష్ణ అన్నప్పుడు అలా ఎందుకు! ఎక్స్ లో శుభాకాంక్షలు తెలిపారు కదా అని అనిఉండాల్సింది.అలాకాకుండా భిన్నంగా మాట్లాడడం అంత సరికాదనిపించింది. పైగా ఇదే రాధాకృష్ణ గతంలో జగన్ పోన్ చేస్తే రేవంత్ పోన్ ఎత్తలేదని, అదేదో గొప్ప విషయంగా రాశారు. రేవంత్ను రాదాకృష్ణే నడిపిస్తున్నారన్న భావన ప్రబలితే అది ఆయనకే నష్టం అని చెప్పాలి. ప్రజావాణి, ప్రజాపాలన వంటి విషయాలలో ప్రభుత్వానికి అంత మంచి మార్కులేమీ రాలేదు.
ఆర్టిసి బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం వరకు కాస్త పాజిటివ్ గా ఉన్నా దాని దుష్పరిణామాల ప్రభావం ఎక్కువగా కనిపించేలా ఉంది.ప్రజా పాలన పేరుతో సంబంధిత ఆరు గ్యారంటీల స్కీముల కోసం తెలంగాణ ప్రజలు లక్షల సంఖ్యలో రోడ్లపై క్యూ కట్టవలసి రావడం, ఆ దరఖాస్తులు ఒక చోట రోడ్లపై కనిపించడం కూడా అప్రతిష్టే అయింది.ఇక్కడే ఎపి తో పోల్చుకుని తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. రైతు భరోసా కింద గత నెల తొమ్మిదిన వేస్తామన్న పదిహేనువేల రూపాయలు రైతుల ఖాతాలలో పడకపోవడం అసంతృఫ్తికి దారి తీసింది.ఇళ్లకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే ఇవ్వడం వంటివి ఇంకా మొదలు కాలేదు. ఇవన్ని ఒక రూపానికి వచ్చి ఎప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్దుకుంటుందో ఎవరూ చెప్పలేరు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్.
Comments
Please login to add a commentAdd a comment