తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో జరిగిన సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై సందేహాలు వస్తున్నాయి. ఆయన తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చేది చెప్పడానికి వ్యాఖ్యలు చేశారు.నిజానికి ప్రజలు ఎన్నుకున్న ఏ ప్రభుత్వాన్ని అయినా కుట్రపూరితంగా పడగొడితే తప్పే అవుతుంది. రేవంత్ కు సహజంగానే తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఉంటుంది. ఇప్పటికి్ప్పుడు రేవంత్ సీటుకు వచ్చిన ప్రమాదం ఏమి లేదు కాని, ఆయన ముందస్తు జాగ్రత్త పడుతున్నట్లు అనిపిస్తుంది. తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారిని ప్రజలు ఉరికించి కొడతారని ,వేపచెట్టుకు కట్టేసి వారి లాగులలో తొండలు వదలుతారని హెచ్చరించారు.
ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తున్నప్పటికీ, అంతర్లీనంగా కాంగ్రెస్ నేతలకే ఈ హెచ్చరిక చేశారేమో అన్న భావన కలుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం తన ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే అదే గొప్ప అవుతుంది. ఒకవేళ పది మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లాగితే ఏమి అవుతుంది. బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎంఐఎం మద్దతు ఇచ్చినా అది సరిపోదు. నిజంగానే ఆ పరిస్థితి వస్తే రాష్ట్రపతి పాలన వస్తుంది కాని, బీఆర్ఎస్ అధికారంలోకి రాదు. అంతేకాక పది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీని వదిలే అవకాశం ఎప్పుడు వస్తుంది? పార్టీలో గ్రూపుల గొడవ పెరిగి, ముఖ్యమంత్రి రేసులోకి ఎవరైనా గట్టి కంటెండర్ వస్తే అప్పుడు జరిగితే జరగవచ్చు.
అది కూడా పార్టీ మారకుండా తమకు నచ్చిన కాంగ్రెస్ నేతకు సపోర్టు చేస్తారు. అంతే తప్ప పార్టీ మారరు. అయినా రేవంత్ కు ఎందుకు అనుమానం వచ్చింది? ఇందులో రెండు లక్ష్యాలు ఉండవచ్యు. ఒకటి బీఆర్ఎస్ తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తోందని చెప్పడం ద్వారా ప్రజలలో సానుభూతి పొందడం, ఇంకొకటి తన సీటుకు ఎవరైనా కాంగ్రెస్ నేత ప్రయత్నిస్తే వారి సంగగతి చూడవలసి వస్తుందని పరోక్షంగా హెచ్చరించడం కావచ్చు. విశేషం ఏమిటంటే ఇంద్రవెల్లి సభలో ఆయనతో పాటు సీఎం.. సీటు ఆశించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. అక్కడే మరో కొందరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క తదితరులు ఉన్నా వారు ధ్రెట్ కారన్న సంగతి తెలిసిందే. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ కు మెజార్టీ రాగానే మల్లు భట్టి తాను సీఎం రేసులో ఉన్నానని ప్రకటించారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే ఆయా సందర్భాలలో తనకు పీసీసీ నాయకత్వం అప్పగించాలని కోరుతుండేవారు. మరో మంత్రి ,పీసీసీ మాజీ అద్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి కూడా ఈ పదవిని ఆశించారు. వీరు భవిష్యత్తులో సీఎం పదవికి పోటీ పడరని అనుకోలేం. తమ సొంత గ్రూపులు కట్టరని భావించలేం. ఇప్పటికైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది రేవంత్ వెనుకే ఉన్నారు. భవష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి వారు మంత్రి కావాలని కోరుకుంటుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలలో 65 సీట్లే వచ్చాయి. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్ల కన్నా కేవలం ఐదు మాత్రమే అధికం అన్నమాట. అందుకే బీఆర్ఎస్ నేతలు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని వ్యాఖ్యానించారు. ఈ మాట కూడా వారు అని ఉండాల్సింది కాదు.
దీనిని ఆసరాగా చేసుకుని రేవంత్ తన ప్రభుత్వాన్ని కూలదోయాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఊళ్లలో ఉరికించి కొడతారని, వేపచెట్టుకు కోదండం వేయించి లాగులలో తొండలను వదలుతారని హెచ్చరించారు. మూతి పళ్లు రాలతాయని, తొక్కుతామని ..ఇలా ఏవేవో మాట్లాడారు. అంత సీరియస్ గా మాట్లాడవలసిన అవసరం లేదు. ఏదో పాసింగ్ రిమార్కు అయితే ఫర్వాలేదు కాని, దానిపై నొక్కి వక్కాణించడం అంటే బహుశా ప్రజల దృష్టి కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కాకుండా ప్రభుత్వం కూల్చివేతపై వచ్చే వదంతుల మీద పడాలని కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే స్తోమత ఉండకపోవచ్చు. బీజేపీ, ఎంఐఎం లతో కలిసి పడవేయాలనుకుంటే అప్పుడు ఈ మూడు పక్షాలకు కలిపి ఏభై సాలుగు సీట్లు అవుతాయి. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఒక ఆరుగురిని లాగితే అప్పుడు ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది.
కాని బిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం. లు సహకరించుకునే పరిస్థితి లేదు. అది కాంగ్రెస్ కు ఉపయోగంగా ఉంటుంది. ఈ లోగా రేవంత్ రెడ్డి కనుక కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తే ఆ కధ వేరుగా ఉంటుంది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ ను కలవడం చర్చనీయాంశం అయింది. ముఖ్యమంత్రిని అభివృద్ది పనుల కోసమే కలిస్తే తప్పు లేదు. అదే టైమ్ లో వదంతులు రాకుండా చూసుకోవాలి. ఒకరకంగా ఇది చెలగాట రాజకీయంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాడానికి అన్ని వ్యూహాలు వేస్తుంది. అదే టైమ్ లో బీఆర్ఎస్ కు తన ఉనికిని పరిరక్షించుకోవడమే పెద్ద సవాలుగా ఉంటుంది. ఈ నేపద్యంలో కాంగ్రెస్ లో గ్రూపులు బలపడకుండా చూసుకోవడమే రేవంత్ ముందు ఉన్న సవాలు అని చెప్పవచ్చు. కనుక ఆయన కేసీఆర్ పేరుతో విమర్శలు చేసినా, అదంతా కాంగ్రెస్ లో సీఎం సీటుకు పోటీపడేవారిని ఉద్దేశించే అయి ఉండవచ్చన్న సందేహం వస్తుంది.దేశంలో అనేక ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి.
కాని అక్కడ ఎవరూ ఎమ్మెల్యేలను చెట్టకు కట్టేసిన దాఖలాలు లేవు. అంతదాకా ఎందుకు రేవంత్ కు గురువైన చంద్రబాబు నాయుడు తన మామ ఎన్ టి రామారావును సీఎం సీటులోనుంచి లాగిపడేశారు. అయినా అప్పుడు చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలను ఎవరూ చెట్టుకు కట్టేయలేదు. తొండలు వదల లేదు. గత టరమ్ లో కర్నాటకలో జెడిఎస్ ,కాంగ్రెస్ కూటమి పడిపోయింది. మద్యప్రదేశ్ లో కమలనాద్ ప్రభుత్వం కూలిపోయింది. రాజకీయాలలో ఏవైనా జరగవచ్చు. 1984లో ఎన్.టి.ఆర్. ను నాదెండ్ల బాస్కరరావు పడకొట్టడానికి ప్రయత్నించినప్పుడు ప్రజా ఉద్యమం వచ్చిన మాట నిజమే కాని, దానివల్ల ప్రభుత్వం పునరుద్దరణ కాలేదు. ఎన్ టి రామారావు మెజార్టీ ఎమ్మెల్యేలను నిలబెట్టుకోవడం వల్లే అని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న వైపు ప్రభుత్వం ఏర్పడుతుంది.
రేవంత్ ఈ సందర్భంగా మాట్లాడిన భాష మాత్రం సహేతుకంగా లేదని చెప్పాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై పరుష పదజాలం వాడినా నడిచిపోయింది. కాని ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోకూడదు. మూతి పళ్లు రాలతాయి.. కిందపడేసి తొక్కుతాం, లాగులలో తొండలు వేస్తారు.. ఇలాంటి విమర్శలు చేయడం వల్ల ఆయన పదవికి అంత హుందానివ్వదు.కేసీఆర్ పై లక్ష కోట్ల అవినీతి ఆరోపణ చేయడం ఆరంబించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పగుళ్ల వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవడానికే రేవంత్ ప్రాదాన్యం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంద్రవెల్లి సభను కాంగ్రెస్ నిర్వహించడం ఏమిటని కొందరు సన్నాసులు ప్రశ్నిస్తున్నారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ టైమ్ లోనే ఇంద్రవెల్లి కాల్పులు జరిగి పలువురు మరణించారు.
ఆ తర్వాత స్థూపం కట్టుకోవడం కూడా కష్టమైంది.కాని ఇప్పుడు అదే కాంగ్రెస్ నివాళి అర్పిస్తోందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే ఇదంతా సమైక్య రాష్ట్ర పాలకుల తప్పు అని,సోనియాగాందీ ఆ తప్పును సరిచేయడానికి తెలంగాణ ఇచ్చారని కొత్త లాజిక్ తెచ్చారు. అలాగే ప్రముఖ గాయకుడు, మాజీ నక్సలైట్ నేత గద్దర్ పేర సినిమా అవార్డులు ఇస్తామని,నంది బదులు గద్దర్ పేరు పెడతామని కూడా రేవంత్ ప్రకటించారు. ఇవన్ని చూస్తుంటే నక్సల్స్ కు సంబందించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం అనుసరిస్తున్న విదానాన్ని రేవంత్ తప్పు పడుతున్నట్లుగా ఉంది. నక్సల్స్ పోరాటాలను తెలంగాణ కాంగ్రెస్ సమర్ధిస్తుందా అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఏది ఏమైనా ఒక క్లారిటీ లేకుండా రేవంత్ వ్యవహరిస్తున్నారేమో అన్న అబిప్రాయానికి తావిస్తున్నారు.
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment