సందర్భం
ముఖ్యమంత్రి పదవిని లక్కీ లాటరీలా పొందినవారు కొందరు, పైరవీలతో చేజిక్కించుకున్నవారు కొందరు, తెలివిగా పావులు కదిపి సాధించినవారు కొందరు... ఈ కేటగిరీల్లో కాంగ్రెస్ ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఎందరినో చూశాం. పూర్తి ప్రజాదరణతో ఒకే ఒక్కడై నిలిచి, గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన వ్యక్తి... కాదు శక్తి... డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే! జమ్మలమడుగులో పుట్టి, స్వగ్రామం పులివెందులలో, బళ్లారిలో చదివి, గుల్బర్గాలో మెడిసిన్ చేసి డాక్టరుగా పులివెందులలో రూపాయి డాక్టరుగా ఊరి జనానికి చేరువయ్యారు.
చిన్ననాటి నుండీ గాంధీ, నెహ్రూలపై పెరుగుతూ వస్తున్న అభిమానం ఆయనను కాంగ్రెస్‌కు చేరువ చేసింది. పులివెందుల డిగ్రీ కాలేజీ స్థాపించి విద్యాభివృద్ధికీ, 20 పడకల ఆసుపత్రి నిర్మించి, పేదలకు ఉచిత వైద్యం చేసి ఊరి చుట్టుపక్కల ప్రజలకూ దగ్గరయ్యారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడై 1978లో కాంగ్రెస్ చీలిక రాగా ‘రెడ్డి కాంగ్రెస్’ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రతిసారీ గెలుస్తూ వచ్చారు. యువజన సర్వీసులు, ఎక్సైజ్, విద్యా శాఖలకు మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
1999 అసెంబ్లీ ఎన్నికల్లో తన నాయకత్వంలో 91 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్ష నాయకుడిగా సత్తా చాటారు. 2004 ఎన్నికలకు ఏడాది ముందు జనంలోకి వెళ్ళారు. ఆ ఏడాది ఏప్రిల్ 3న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పాదయాత్రకు శ్రీకారం చుట్టి, ఆంధ్రప్రదేశ్ చివరి గ్రామం ఇచ్ఛాపురం వరకూ దాదాపు 1600 కిలోమీటర్లు వైఎస్ పాదయాత్ర చేశారు. దారి పొడవునా, గ్రామ గ్రామాన ప్రజల కష్టనష్టాలను కళ్ళారా చూశారు. చెవులారా విన్నారు. భగ్గున మండుతున్న ఎండల్లో కాలినడకలో ప్రజలు ఎన్నెన్ని అవస్థలు పడుతున్నారో గమనించారు.
ఓ పక్క కరువు, మరోవంక గంజినీళ్లకు కూడా నోచుకోని అభాగ్యులు, విద్యుత్ కొరత వల్ల బోర్లు పనిచేయక అచేతనులైన రైతన్నల దౌర్భాగ్య స్థితి, నిరుద్యోగుల నిస్తేజం... ఇవన్నీ ఆయనను కొత్త మనిషిగా తీర్చిదిద్దాయి. ‘ఇందిరమ్మ రాజ్యం’ తెస్తాననీ, అన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాననీ ప్రజలకు మాటిచ్చారు. నమ్మకం కలిగించారు. వ్యవసాయ ప్రధానమైన గ్రామీణ ప్రజలకు విద్యుత్ చార్జీలు భారం కావడం, ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని కరెంటు సరఫరా ప్రాథమిక అవరోధంగా గుర్తించి ‘ఉచిత విద్యుత్’ హామీ ఇచ్చి ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఆ ఫైలు పైనే చేస్తానన్నారు.
సరిగా పండక, అరకొర దిగుబడి తెగనమ్మితే పెట్టుబడి ధర కూడా రాక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలు విని, చదివి ఆయన చలించి పోయారు. వివిధ వర్గాల ప్రజల జీవన్మరణ సమస్యలను ఎలాగైనా సరే పరిష్కరించాలని నిశ్చయించుకున్నారు. పాదయాత్ర క్రమంలో రాజమండ్రి నగరం వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల విశ్రాంతి అనంతరం మళ్ళీ నిర్విరామంగా ఇచ్ఛాపురం వరకూ నడక సాగించి, 64 రోజుల పాదయాత్ర (3 రోజుల విరామంతో కలిపి 67 రోజులు) లక్ష్యం పూర్తి చేశారు.
అంతలో 2004 ఎన్నికల నగారా మోగింది. వైఎస్ హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. అంతకు పదేళ్ళ ముందు 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. కొద్దికాలానికే ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ణి చేసి, తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసి, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు చంద్రబాబు.
అలాంటి చంద్రబాబు బీజేపీ ఆసరా తోడై, 1999లో మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టారు. ప్రజలంటే గొఱె<లనీ, ఎన్నికలంటే కాస్త పేరున్న పార్టీతో జతకట్టి సునాయాసంగా గెలవచ్చనీ పాత అనుభవ పాఠాల ద్వారా నమ్మి, ఈసారి 2004 ఎన్నికల బరిలోనూ దూకారు. అలిపిరి మందుపాతర పేలుడులో త్రుటిలో బతికి బయటపడిన ఘటన సానుభూతి తెచ్చి గెలిపిస్తుందని నమ్మారు. సానుభూతి చల్లారకుండా ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు దిగారు. ప్రచార పర్వంలో ఎక్కడా సానుభూతి జాడలేదు సరికదా ప్రజాగ్రహం ఎదురైంది. కాంగ్రెస్ అఖండ విజయం, వైఎస్ ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2004 మే 14న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. అది మొదలు ప్రజలకు ఎలా మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఆయనకు మరొకటి లేదు. రైతులకు సహకార రుణమాఫీ కోసం కేంద్రాన్ని ఒప్పించారు. పీకల లోతు అప్పుల్లో మునిగి ఉన్న రైతులకు రుణ విముక్తి కలిగించారు. ‘ఆరోగ్యశ్రీ’తో అత్యంత ఖరీదైన వైద్యాన్ని నిరుపేదలకు అందించారు. పేదరికం కారణంగా పౌష్టికాహార లోపంతో గుండెజబ్బుల బారిన పడిన పసిపిల్లలకు ఉచిత శస్త్రచికిత్సలు చేయించారు.
‘108 వాహనం’ ద్వారా అత్యవసర అంబులెన్సు వాహనాలను రాష్ట్రమంతటా అందుబాటులోకి తెచ్చారు. బీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య కోసం ‘ఫీజు రీ–ఇంబర్స్‌మెంట్’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ముస్లిమ్ మైనారిటీ విద్యార్థులకు 4 శాతం రిజర్వేషన్లతో ఇంజనీరింగ్ విద్యను అందించారు.
‘జలయజ్ఞం’తో భారీ, మధ్యతరహా, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్రం నలుమూలలా విస్తరించే పథకాలకు శ్రీకారం చుట్టారు. కోటి ఎకరాల సాగుభూమితో రాష్ట్రం అన్నపూర్ణగా విరాజిల్లాలని పట్టుదలతో కృషి చేసారు. అంతకు ముందు నామమాత్రంగా ఉండే వికలాంగ, వృద్ధాప్య పింఛన్లను ఇబ్బడిముబ్బడిగా పెంచారు. ఎస్సీ, ఎస్టీ పథకాల రుణమాఫీతో ఊరట కలిగించారు.
‘ఇందిరమ్మ ఇళ్ల’ను ‘ఇందిరమ్మ ఊళ్ళు’ అనేలా గణనీయంగా నిర్మించారు. ప్రకృతి కూడా పరవశించిందేమో... హర్షాతిరేకంతో వర్షాలను చాలినంతగా రాష్ట్రమంతటా కురిపించింది. గ్రామదేవతల, దేవాలయ ఉత్సవాలు ఊరూరా పునః ప్రారంభమయ్యాయి. దేశం ఆంధ్రప్రదేశ్ వైపు తల తిప్పి చూడసాగింది. కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు సైతం ‘ఆరోగ్యశ్రీ’తో పాటు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన మరికొన్ని పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేశారు.
2009 ఎన్నికల్లోనూ వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిష్ఠించి, మరింత జాగరూకతతో సాగుతూ, పథకాల అమలు తీరు ఎలా ఉందో ప్రజల నుండి నేరుగా తెలుసుకోవాలన్న కోరికతో ‘రచ్చబండ’ ప్రవేశపెట్టారు. తొలి సమావేశానికి హాజరవడానికి హెలికాప్టర్‌లో చిత్తూరు జిల్లాకు పోయే క్రమంలో వాతావరణం ప్రతికూలించింది. కంట్రోల్ రూముతో సంబంధాలు తెగిపోయాయి. మరునాడు ఊహించని విషాద వార్త వెల్లడైంది. ‘నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోయింది. వైఎస్ ఇకలేరు’! ఈ వార్తను తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా సుమారు 700 గుండెలు ఆగిపోయాయి. ఇంతగా ప్రేమను పొందిన నాయకుడు చరిత్రలో మరొకరు లేరు.
2009 సెప్టెంబరు 3వ తేదీ జన హృదయ విజేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక లేరని లోకానికి తెలిసిన రోజు. అదే రోజు గణేశ నిమజ్జనం. ‘గణేశ్ మహరాజ్‌కీ జై’, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో, పిల్లలు, పెద్దలు సహా అశేష జనసందోహంతో, నృత్యాలు, ఆటపాటలు, టపాసుల, డప్పులు, ఆర్కెస్ట్రాల కోలాహలంతో 24 గంటలపాటు నిర్విరామంగా సాగాల్సిన హైదరాబాద్ గణేశ్ నిమజ్జనోత్సవం అంతే జనంతో నిర్వికారంగా, ఎటువంటి ఆర్భాటం లేకుండా ఒక మహా మౌనప్రదర్శన అన్నట్టుగా సాగిపోయింది. లెక్కకు మిక్కిలిగా పూనుకున్నా జరగదనిపించే ఆ సంఘటన ఆ జననేత పట్ల గొప్ప గౌరవానికి తార్కాణం. ‘పథకాలంటే ఇవీ, పరిపాలన అంటే ఇదీ, పాలకుడంటే ఇలా...’ అని మామూలు వ్యక్తుల నుండి మేధావుల దాకా అనుకునేలా సాగిన ఆయన రాష్ట్ర నాయకత్వ హయాం ‘న భూతో న భవిష్యతి!’
తిరుమలగిరి సురేందర్
– వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment