సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను రాజకీయ అక్కసుతో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసుకుంటూ వెళ్తోందని భారత్ రాష్ట్ర సమితి ఆందోళన వ్యక్తం చేసింది. గత పదేళ్లలో లక్షలాదిమంది జీవితాల్లో మార్పు తెచ్చిన కార్యక్రమాలను సైతం రాజకీయ దురుద్దేశంతో పక్కన పెడుతోందని పేర్కొంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ వ్యవస్థ శాశ్వతం అనే విషయాన్ని కాంగ్రెస్ మరిచిపోయిందని వారు పేర్కొన్నారు.
ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చిందని, అయితే గృహలక్ష్మిలో భాగంగా ఎంపికై, అధికారిక పత్రాలు అందుకున్న లబ్ది దారుల పరిస్థితి ఏంటో ప్రభుత్వం తెలియజేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది యాదవుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలిగించిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదన్నారు. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా తమ వాటా మొత్తం చెల్లించిన వారికి వెంటనే ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధును కూడా ప్రభుత్వం రద్దు చేయాలని ఆలోచిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా దళితబంధును మరింతగా విస్తరించి రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి, ఇప్పటికే ఎంపికైన లబ్ది దారులకు రూ.10 లక్షలు లేదా కాంగ్రెస్ హామీ ఇచ్చిన రూ.12 లక్షలైనా వెంటనే అందించాలన్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటూ వెళ్లి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేస్తుందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రాల్లో లబ్ది దారులకు అండగా నిలబడేలా నిరసనలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్‌రావు తెలిపారు. లబ్ధిదారుల కోసం పార్టీ బాధ్యులంతా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
అభివృద్ధి పనులు సైతం రద్దు
గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తోందని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు మండిపడ్డారు. మున్సిపాలిటీలకు టీయూఎఫ్‌ఐడీసీ, ఇతర సంస్థల ద్వారా అందించిన అభివృద్ధి నిధుల మంజూరును ప్రభుత్వం రద్దు చేస్తోందని ఆరోపించారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్ల మంజూరును కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. దీనిపై లబ్ది దారులు కోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment