గులాబీ పార్టీలో వాళ్లిద్దరూ నోరు తిరిగిన నాయకులు. సబ్జెక్ట్ ఏదైనా, సమస్య ఏదైనా అనర్గళంగా స్పీచ్‌లు ఇవ్వగల సత్తా వారికుంది. అందుకే ఇప్పుడు ప్రజా సమస్యలపై గళం విప్పుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెమట్లు పట్టిస్తున్నారు. ఒకదాని తర్వాత మరొక అంశం తీసుకుంటూ ఎక్కడి కక్కడ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. ఇద్దరు బావా, బావమరుదులు తమకున్న నాలెడ్జ్‌తో కాంగ్రెస్ నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇంతకీ వారిద్దరూ బావ మరుదులు ఎవరో చూద్దాం.
భారత రాష్ట్ర సమతి పార్టీలో మాటకారులు ఎక్కువే. సబ్జెక్ట్ ఏదైనా అనర్గళంగా మాట్లాడగలిగే సత్తా ఇద్దరు నేతలకు ఉంది. సమస్య ఏదయినా, ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే అంశం ఏదైనా తూటాల్లాంటి మాటలతో అదరగొట్టేస్తారు గులాబీ పార్టీకి రెండు కళ్ళుగా ఉన్న బావ హరీష్ రావు, బావమరిది కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందంటూ విరుచుకుపడుతున్నారు ఈ ఇద్దరు నేతలు. రోజుకో సమస్యతో ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. దీనికి వీరిద్దరూ ఎంచుకున్న ప్లాట్ ఫాం ఎక్స్ లేదా ట్విట్టర్. ట్విట్టర్ లో ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ కరువవుతుంది. ఈ ఇద్దరు నేతలు ప్రజాసమస్యలపై చేస్తున్న కామెంట్స్‌తో ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారని గులాబీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రైతులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలవారి సమస్యలపై గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు సంధిస్తున్నారు.
కేటీఆర్, హరీష్ రావును తట్టుకోవడం అంటే చాలా కష్టం అంటున్నారు. నిత్యం ప్రెస్స్ మీట్స్, గంటకో ట్వీట్ చేస్తున్నారు. కేవలం రెండు నెలల సమయం ప్రభుత్వానికి ఇచ్చి, ఆతర్వాత ముప్పేట దాడి మొదలు పెట్టారు ఈ ఇద్దరు నేతలు. అయితే ప్రభుత్వం వైపు నుంచి అంతే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఎవరూ సాహసం చేయటం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వరి ధాన్యం విషయంలో ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. శాంతి భద్రతలు విషయంలో ఒక్క పోస్ట్ తో పోలీస్ యంత్రాంగం కదిలింది. కరెంట్ సమస్యపై ప్రభుత్వం చేసిన ఆరోపణలకు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన అంశంపై బీ ఆర్ ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ సర్కార్‌కు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఏ చిన్న లూప్ హోల్ కనపడకుండా ఓ రేంజ్ లో వీరిద్దరూ సమాధానాలు ఇస్తున్నారు.
ఏ సమస్య మీద అయినా కొంత ఆలస్యంగా స్పందించినప్పటికీ సబ్జెక్ట్, ఆధారాలతో సహా బయటికి వదులుతున్నారు. దీంతో ప్రభుత్వం సమాధానం కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. అధికారంలో ఉన్నప్పటికంటే బావ మరుదులు హరీష్‌రావు, కేటీఆర్‌లు ప్రతిపక్షంలోనే సమన్వయంతో పనిచేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ సర్కార్‌కు సరైన ప్రత్యర్థులు వీరిద్దరే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment