Transfer employees
-
317 జీవోలో సవరణ...వారికి ఊరట..!
సాక్షి, హైదరాబాద్: జోనల్ విధానం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నిచోట్లా తీవ్ర వివాదాస్పదమైన స్పౌజ్, పరస్పర బదిలీలకు అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం అవసరమైన సమాచారం తెప్పించింది. ఉపాధ్యాయ సంఘాలకు ఈ మేరకు సీఎంవో నుంచి హామీ లభించినట్టు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో జీవో విడుదల చేసే వీలుందని అధికార వర్గాలు కూడా తెలిపాయి. భార్యాభర్తలు ఒకేచోట పనిచేసే విధంగా చూస్తామని 317 జీవో సందర్భంగా విద్యాశాఖ భరోసా ఇచ్చింది. అయితే జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేటాయింపుల సందర్భంగా ఈ సమతూకం కుదరలేదు. స్పౌజ్ బదిలీలపై విడుదల చేసిన కొన్ని మార్గదర్శకాలు ఆటంకంగా మారాయి. భార్య రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే.. భర్త కేంద్ర ఉద్యోగిగా ఉన్న కేసులూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో స్పౌజ్ కేసులు అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. అధికారిక సమాచారం మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు 1,110, ఇతరులు 1,458 కలిపి మొత్తం 2,568 మంది స్పౌజ్ కేసుల కింద తమను ఒకేచోట ఉంచాలని పట్టుబట్టారు. అయితే ఈ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం 13 జిల్లాల్లో బదిలీలు నిలిపివేయడంతో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో వీటిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ‘సీనియారిటీ బదిలీ’ల్లోనూ వెసులుబాటు సీనియారిటీ ప్రకారంగా జరిగిన బదిలీల విషయంలోనూ కొంత వెసులుబాటు ఇవ్వాలని నిర్ణయించారు. కోరుకున్న ప్రదేశానికి వచ్చేందుకు మరో టీచర్ అంగీకరిస్తే పరస్పర బదిలీలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించనుంది. పరస్పర బదిలీలు, స్పౌజ్ కేసులపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయం తమకు తెలిపిందని పీఆర్టీయూ టీఎస్ నేతలు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. -
ఫలానా చోటికే బదిలీ చేయాలని ఉద్యోగి పట్టుబట్టజాలడు
న్యూఢిల్లీ: ఉద్యోగి ఫలానా ప్రాంతానికే బదిలీ చేయాలని పట్టుబట్టజాలడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూపీకి చెందిన మహిళా లెక్చరర్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధబోస్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ‘ఒక ఉద్యోగి/ ఉద్యోగిని తనను ఫలానా చోటికే బదిలీ చేయాలనీ లేదా బదిలీ చేయరాదని పట్టుబట్టకూడదు. యాజమాన్యమే అవసరాలను అనుగుణంగా బదిలీలను చేపడుతుంది’అని పేర్కొంది. అమ్రోహాలోని కళాశాలలో పనిచేస్తున్న మహిళా లెక్చరర్ తనను గౌతమ్‌బుద్ధ నగర్‌లోని కళాశాలకు బదిలీ చేయాలని అధికారులను కోరగా తిరస్కరించారు. దీనిపై ఆమె అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నాలుగేళ్లుగా అమ్రోహాలో పనిచేస్తున్న ఆమె, గతంలో 2000–2013 వరకు దాదాపు 13 ఏళ్లపాటు గౌతమబుద్ధ నగర్లో పనిచేసినట్లు గుర్తించిన హైకోర్టు తిరిగి అక్కడికే బదిలీ చేయాలని కోరడం సరికాదని పేర్కొంది. పనిచేసిన ప్రాంతానికే తిరిగి బదిలీ చేయాలని పట్టుబట్టరాదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
రెవెన్యూ శాఖలో భారీ ప్రక్షాళనలు
సాక్షి, మేడ్చల్ జిల్లా : రెవెన్యూ శాఖలో భారీ ప్రక్షాళనకు జిల్లా అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. తాజాగా మేడ్చల్ జిల్లాలో 11 మంది తహసీల్దార్లను బదిలీ చేసిన యంత్రాంగం మంగళవారం మరో 12 మంది ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల కీసర తహసీల్దార్ నాగరాజు రాంపల్లి దాయార రెవెన్యూ పరిధిలో భూ మార్పిడి, పట్టాదారు పాసు పుస్తకాల జారీ విషయంలో రియల్టర్ బ్రోకర్ల వద్ద నుంచి రూ. 1.10 కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై జిల్లా అదనపు కలెక్టర్ కె.విద్యాసాగర్ ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలుస్తున్నది. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖలో అవినీతి ఉద్యోగుల ఏరివేత ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున బదిలీలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని భూముల ధరలకు రెక్కలు రావటంతో రెవెన్యూ శాఖలో అవినీతికి అందులేకుండా పోయింది. భూరికార్డుల ప్రక్షాళనతో ఆరంభమైన రెవెన్యూ శాఖ అవినీతి భాగోతం పరాకాష్టకు చేరుకుంది. అందులో భాగంగా కీసర నుంచి మొదలుకొని అనేక సంఘటనలు వెలుగు చూశాయి. (చదవండి : గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) ఇదిలా ఉండగా, జిల్లాలో 12 వేల ఎకరాలకు సంబంధించిన భూములు పలు వివాదాలతో పలు కోర్టుల్లో మగ్గుతుండగా, వందలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములపై కన్నేసిన కొందరు కబ్జాదారులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నగర శివారులోని కోట్లాది రూపాయల విలువ చేసే భూములను పరిరక్షించాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ముఖ్యంగా రెవెన్యూ శాఖపై ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ, అసైన్డ్ భూములు పరిరక్షణ, వివాదాల్లోని భూములకు సత్వర పరిష్కారం తదితర విషయాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార యంత్రాంగం రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా బదిలీలకు తెరలేపినట్లు తెలుస్తున్నది.(చదవండి : విచారణకు సహకరించని ఎమ్మార్వో నాగరాజు!) అందులో భాగంగా జిల్లాలో 12 మంది ఆర్ఐలు (గీర్దావరులు), సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ కలెక్టర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గీర్దార్వర్ (ఆర్ఐ) కిరణ్‌కుమార్ కీసర మండలంతోపాటు శామీర్‌పేట్‌లో పని చేసిన కాలంలో పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. కీసరలో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ నాగరాజుకు ఆర్ఐ కిరణ్‌కుమార్ ప్రధాన అనుచరుడిగా పేరుంది. అలాగే నాగారం మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడలో అసైన్డ్ భూముల్లో ఇళ్లు వేసుకున్న పేదల నుంచి ఒక్కొకరి నుంచి రూ. 50 వేల నుంచి రూ. లక్ష స్థానిక వీఆర్‌ఓతో కలిసి వసూలు చేశారనే ఆరోపణల్లో కిరణ్ కుమార్ ప్రధాన వ్యక్తిగా స్థానిక ప్రజల్లో ప్రచారం ఉంది. వెలుగులోకి రాని అవినీతి ఆర్ఐలకు కూడా బదిలీల్లో చోటు లభించింది. త్వరలో పెద్ద ఎత్తున వీఆర్ఓ, వీఆర్ఏల బదిలీలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రెవెన్యూ ప్రక్షాళన!
భూ రికార్డుల ప్రక్షాళన నుంచి రెవెన్యూ సేవలు పూర్తిగా నత్తనడకన సాగుతున్నాయి. పట్టా మార్పిడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అక్రమంగా ఇతరులకు పట్టాలు చేయడం, కబ్జాదారులకు సిబ్బంది పరోక్షంగా సహకరిస్తుండడం, తప్పుడు సర్వే నంబర్లు నమోదు తదితర ఆరోపణలు కోకొల్లలు. పైగా తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు, సాధారణ ప్రజలు నిత్యం పనులు మానుకొని తహసీల్దార్ కార్యాలయాలకు చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. పాస్‌పుస్తకాల కోసం తిప్పించుకోవడం, రికార్డుల్లో తప్పులు సరిదిద్దడంలో ఎనలేని నిర్లక్ష్యాన్ని రెవెన్యూ సిబ్బంది ప్రదర్శిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు, అధికారులు ఆమ్యామ్యాలు సమర్పించుకున్నా పనుల్లో పురోగతి లేదు. ఓపిక నశించిన కొందరు రైతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలూ జిల్లాలో చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా చాలా మంది అధికారులపై డీఆర్ఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. వీటిని పరిగణించిన యంత్రాంగం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఒకే ప్రాంతంలో ఎక్కువ కాలం పనిచేసిన వారిని బదిలీ చేస్తోంది. ఈ చర్యలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు జిల్లా రెవెన్యూశాఖలో ప్రక్షాళన మొదలైంది. అవినీతి ఆరోపణలు, సేవల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శల నేపథ్యంలో అధికారులపై బదిలీ వేటు పడుతోంది. కేడర్ వారీగా ఉద్యోగులకు స్థాన చలనం కల్పిస్తున్నారు. మూడురోజుల కిందట గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఓ)ను మూకుమ్మడిగా బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇచ్చిన యంత్రాంగం.. తాజాగా డిప్యూటీ తహసీల్దార్లను మార్చింది. 13 మందిని బదిలీ చేసి ఆయా ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చింది. భూ వ్యవహారాల్లో కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు అందిన కాడికి వెనకేసుకుంటున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పాతుకుపోయి స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అర్హులకు పదోన్నతులు.. ఒక పక్క బదిలీలు చేస్తున్న యంత్రాంగం.. మరోపక్క అర్హులకు పదోన్నతులు కల్పిస్తోంది. సీనియారిటీ ప్రాతిపదికన 32 మంది వీఆర్ఓలకు నాయబ్ తహసీల్దార్ కేడరైన సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించింది. అలాగే మరో 14 మంది సీనియర్ అసిస్టెంట్లను రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను సీనియర్ అసిస్టెంట్లుగా బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇచ్చారు. రెవెన్యూశాఖలో సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులను నాయబ్ తహసీల్దార్ కేడర్‌గా పరిగణిస్తారు. అయితే, ఒక్కో అధికారి సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా రెండేళ్ల చొప్పున పనిచేయాల్సి ఉంటుంది. అంటే నాయబ్ తహసీల్దార్ కేడర్‌లో నాలుగేళ్ల పాటు పనిచేసిన వారికి డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతులు కల్పిస్తారు. త్వరలో తహసీల్దార్ల బదిలీలు! వీఆర్ఓ నుంచి డిప్యూటీ తహసీల్దార్ల వరకు అధికారుల బదిలీలు జరిగాయి. ఇక మిగిలింది తహసీల్దార్లు, ఆపై స్థాయి అధికారులే. వీరికి కూడా త్వరలో స్థాన చలనం తప్పదని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 12 మంది తహసీల్దార్లు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులను బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశాల మేరకు వీరికి స్థానచలనం కలిగింది. హైదరాబాద్‌కు ఎనిమిది మంది, సంగారెడ్డి జిల్లాకు ముగ్గురు, నల్లగొండకు ఒకరు బదిలీ అయ్యారు. ఒకే ప్రాంతంల్లో మూడేళ్ల పాటు పనిచేయడంతోపాటు మాతృ జిల్లాలకు చెందిన తహసీల్దార్లకు బదిలీ వర్తించింది. ఎన్నికలు ముగియడంతో వారు తిరిగి మన జిల్లాకు బదిలీపై వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీడీఓలు కూడా శాసనసభ ఎన్నికల సమయంలో ఎంపీడీఓలు బదిలీపై వెళ్లారు. మూడేళ్లపాటు ఒకే ప్రాంతంలో పనిచేసిన 19 మందికి స్థాన చలనం కలిగింది. వీరు కూడా త్వరలో జిల్లాకు రానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయం ప్రభుత్వం పరిశీలనలో ఉందని పేర్కొంటున్నాయి. -
కుర్చీలాట
సాక్షి ప్రతినిధి, వరంగల్ : పోలీసు శాఖలో కుర్చీలాట మొదలైంది. ఎస్బీ, వీఆర్, సీబీసీఐడీ, ఇంటలిజెన్స్, ట్రాన్స్‌కో, సీసీఎస్, సైబర్ క్రైం, కమ్యూనికేషన్స్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు లా అండ్ ఆర్డర్లో పోస్టింగ్ కోసం ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసినందున త్వరలోనే పెద్ద ఎత్తున బదిలీలు ఉంటాయన్న సమాచారం మేరకు ఆశావహులు తాము కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం ‘ఖర్చీప్’ వేసుకుంటున్నారు. ఈనెల 21వ తేదీ తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు ఉంటాయని.. ఎస్ఐ, ఎంపీడీఓ, తహసీల్దార్ మొదలు ఐఏఎస్, ఐపీఎస్‌ల వరకు బదిలీలు జరుగుతాయని ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఇందులో మిగతావన్నీ పక్కన పెడితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కోసం పలువురు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కోడ్ ముగిసింది... ఎన్నికల కోడ్ ముగియడమే తరువాయి అన్నట్లుగా పోస్టింగ్‌ల కోసం పలువురు ఇన్స్పెక్టర్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 26 పోలీసు సర్కిళ్లు ఉంటే.. 11 సర్కిళ్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు సంబంధిత ఉన్నతాధికారులకు చేరినట్లు తెలిసింది. ఎన్నికల కోడ్‌లో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లి... మళ్లీ ఈ జిల్లాలో పోస్టింగ్ ఆశిస్తున్న పలువురు సీఐలు ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి ఇప్పటికే కమిషనరేట్‌కు చేరుకున్నారు. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు గవర్నర్లు హాజరవుతున్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బందోబస్తులో ఉన్నతాధికారులు, సిబ్బంది నిమగ్నం కాగా.. 21వ తేదీ తర్వాత సీఐల బదిలీల ఉత్తర్వులు వెలువడనున్నాయి. పోటాపోటీ పోలీసు పోస్టింగ్‌లన్నీ పొలిటికల్ కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం లా అండ్ ఆర్డర్ స్థానాలకు వచ్చేందుకు పలువురు పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 26 సర్కిళ్లకు గాను సుమారు 15 సర్కిల్ కార్యాలయాల్లో పోస్టింగ్ కోసం సీఐలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది రెండు నుంచి మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సీఐలను కదిలించాలన్న లక్ష్యంతో ఆయా స్థానాలను ఎంచుకుంటున్నారు. కాగా ఇందులో పదింటికైతే పోస్టింగ్ కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు ఆశావహులు వెనుకాడటం లేదు. మట్టెవాడ, ఇంతెజార్గంజ్, హన్మకొండ, కాజీపేట, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం, భూపాలపల్లి, వర్ధన్నపేట, హసన్‌పర్తి, ములుగు, తాడ్వాయి, తొర్రూరు, పాలకుర్తి, మహబూ బాబాద్ టౌన్ తదితర సర్కిళ్లలో పోస్టింగ్‌లు సాధిస్తే చాలు.. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లేనన్న ప్రచారం ఉంది. అందుకే ఈ ఠాణాల్లో పోస్టింగ్ కోసం పెద్ద మొత్తంలో పైరవీలు, ఉన్నతా«ధికారులపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుండటం చర్చనీయాంశం అవుతోంది. స్థానాలు ఎంపిక చేసుకున్న పలువురు? కోరుకున్న చోట కొలువు చేయాలనుకుని భావిస్తున్న కొందరు సీఐలు ఆ ఠాణాల్లో ఖర్చీఫ్(లేఖ)లు వేసుకుంటున్నారు. వరంగల్ కమిషనరేట్‌తో పాటు జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పలు పోలీసు స్టేషన్లకు మంచి గిరాకీ ఉంది. మట్టెవాడ, ఇంతెజార్గంజ్, హన్మకొండ, కాజీపేట, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం, భూపాలపల్లి, వర్ధన్నపేట, హసన్‌పర్తి, ములుగు, తాడ్వాయి, తొర్రూరు, పాలకుర్తి, మహబూబాబాద్ టౌన్ తదితర సర్కిళ్లలో పోస్టింగ్‌ల కోసం సీఐల మధ్యన ‘కుర్చీలాట’ సాగుతోంది. ఎవరెవరు.. ఎక్కడెక్కడికి... హన్మకొండ సీఐ సంపత్‌రావు ఇక్కడకు వచ్చి మూడేళ్లు పూర్తి కావొస్తుండగా ఆయనకు పదోన్నతి వచ్చే అవకాశముంది. దీంతో ఆయన స్థానం చేజిక్కించుకునేందుకు కనీసం అర డజన్ మంది ప్రయత్నం చేస్తున్నారు. కమిషనరేట్‌లోని ఓ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, వర్ధన్నపేట డివిజన్లోని ఓ సీఐతో పాటు మరో ‘రాజు’ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇక మట్టెవాడకు జీవన్‌రెడ్డి ఎన్నికల కోడ్ బదిలీల్లో భాగంగా రాగా, తాజాగా జరగనున్న బదిలీల్లో ఈ స్థానాన్ని ఈస్ట్ జోన్ నర్సంపేట డివిజన్లో కీలక స్టేషన్‌కు చెందిన సీఐ పక్కా చేసుకున్నట్లు తెలిసింది. ఇంతెజార్గంజ్ స్థానం కోసం ఖమ్మంలో ఉన్న ఓ సీఐ ప్రయత్నం ఫలించినట్లేని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన ఐదు రోజుల క్రితమే ఖమ్మం నుంచి కమిషనరేట్‌కు వచ్చారు. ఖాళీగా ఉన్న కేయూసీ స్థానం కోసం వరంగల్ అర్భన్ స్పెషల్ బ్రాంచ్‌లో పని చేస్తున్న సీఐ పేరు వినిపిస్తోంది. సుబేదారి సీఐ సదయ్య సుమారు రెండేళ్లుగా పని చేస్తుండగా.. ఇక్కడికి వచ్చేందుకు సీసీఎస్‌లో పని చేస్తున్న ఓ సీఐ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. కాజీపేటలో ప్రస్తుతం అజయ్‌కుమార్ ఉండగా, గతంలో సుబేదారిలో పని చేసి ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న ఓ సీఐ ఈ స్థానంలోకి వచ్చేందుకు సిఫారసు లేఖ పొందినట్లు తెలిసింది. గతంలో కేయూసీ సీఐగా పని చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మరో సీఐ పేరు కూడా వినిపిస్తుంది. ధర్మసాగర్ సీఐగా శ్రీలక్ష్మి రెండేళ్లుగా పని చేస్తుండగా ఈ స్థానానికి వచ్చేందుకు యత్నిస్తున్న వారిలో నర్సంపేట సబ్‌డివిజన్‌లోని ఓ సీఐతో పాటు కేయూసీకి ట్రై చేస్తున్న ఎస్బీ సీఐ పేరు కూడా వినిపిస్తోంది. హసన్‌పర్తిలో ప్రస్తుతం తిరుమల్ సీఐగా ఉండగా.. ఇక్కడ పోస్టింగ్ కోసం వరంగల్ ట్రాఫిక్‌లో సీఐగా పని చేస్తున్న ఒకరు ప్రజాప్రతినిధితో గ్రీన్‌సిగ్నల్ పొందినట్లు తెలిసింది. పది నెలల కిందట మామునూరు సీఐగా వచ్చిన కిషోర్ ఇటీవలే 15 రోజుల సెలవుపై వెళ్లి రాగా, జనగామ డివిజన్లోని ఓ సీఐ ఈ పోస్టింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఉమ్మడి జిల్లాలో పలు హాట్ స్టేషన్ల కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండటం పోలీసుశాఖలో చర్చనీయాంశమైంది. ఈ ‘ఠాణా’లు హాట్ గురూ రాష్త్ర వ్యాప్తంగా పోలీసు పోస్టింగ్‌లన్నీ కూడా ఎమ్మెల్యేల అనుమతి, సూచన మేరకు జరుగుతాయన్న ప్రచారం ఉంది. ఉమ్మడి వరంగల్‌లోనే ఇదే పరిస్థితి ఉంది. శాసనసభ ఎన్నికల ముందు ఎలక్షన్ కోడ్‌లో భాగంగా మూడేళ్ల సర్వీస్ దాటిన అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీపై వివిధ ప్రాంతాలకు వెళ్లారు. అప్పటి నుంచి వారికి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతో పోస్టింగ్‌ల కోసం టచ్‌లో ఉన్నారు. గత నెల 23తో ఎన్నికల కోడ్ ముగియగా, ఈనెల 21 తర్వాత ఉమ్మడి వరంగల్‌లో భారీగా బదిలీలు జరిగే అవకాశం ఉంది. దీని కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇంటి ముందు కొందరు పోలీసు అధికారులు క్యూ కడుతున్నారు. దీంతో పాటు వారి ప్రధాన అనుచరులు, కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు అభిమానించే వ్యక్తులను సైతం ప్రసన్నం చేసుకుని సిఫారసు లేఖలు సంపాదించే పనిలో నిమగ్నమయ్యారు. -
త్వరలో బదిలీలు.!
ఆదిలాబాద్‌అర్బన్: ఏ ఎన్నికలు జరిగిన ప్రభుత్వ అధికారుల బదిలీ అనేది సాధారణం. ఎన్నికల్లో కీలకంగా వ్యవహారించే వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులతో పాటు డివిజన్, జిల్లా అధికారులకు కూడా బదిలీలు చేపడుతుంటారు. ముఖ్యంగా ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే రెవెన్యూ శాఖలో పని చేసే అధికారుల బదిలీలు తప్పకుండా జరుగుతాయి. జిల్లాలోని వివిధ చోట్ల ఒకేచోట మూడేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులకు ఈ బదిలీలు తప్పకుండా వర్తిస్తాయి. ఈసారి వరుసగా ఎన్నికలు రావడంతో మూడేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారితో పాటు అందరినీ బదిలీ చేశారు. ఈ లెక్కన గతేడాది అక్టోబర్‌లో జిల్లాలోని 19మంది తహసీల్దార్లకు స్థాన చలనం కలిగింది. ఎన్నికలకు ముందు బదిలీ అయిన వారందరూ ఇతర జిల్లాలకు వెళ్లగా, ఇతర జిల్లాల తహసీల్దార్లు మన జిల్లాకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై దృష్టి సారించింది. ఎన్నికలకు ముందు బదిలీ అయినా తహసీల్దార్లను వారి వారి జిల్లాలకు పంపాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో వీరి బదిలీలు చేపట్టేందుకు చర్యలు తీసుకోనుంది. మరో వారం రో జుల్లో తహసీల్దార్ల బదిలీలు చేపట్టి ఈ నెలా ఖరులోగా ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం. జిల్లాకు రానున్న మన తహసీల్దార్లు.. ఎన్నికల్లో చేపట్టే సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల్లో తహసీల్దార్లుగా పని చేస్తున్న 19మంది అధికారులను చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) బదిలీ చేసింది. బదిలీలకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారులకు అప్పట్లో పంపించింది. దీంతో పాటు ఇతర జిల్లాల తహసీల్దార్లను మన జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ లెక్కన మన జిల్లాకు 18 మంది వేరే జిల్లాల్లో పని చేసే తహసీల్దార్లు కేటాయించింది. మన జిల్లాకు వచ్చిన వారిలో కుమ్రం భీం జిల్లా నుంచి ముగ్గురు తహసీల్దార్లు, వరంగల్ అర్బన్, నిర్మల్ నుంచి ఒక్కొక్కరు ఉండగా, జగిత్యాల నుంచి 13 మంది వచ్చారు. మన జిల్లాలో పని చేసిన వివిధ మండలాల తహసీల్దార్లు నిర్మల్‌కు పది మంది వెళ్లగా, కుమురంభీం జిల్లాకు ఐదుగురు, భద్రాద్రి కొత్తగూడెంకు ఇద్దరు, వరంగల్ అర్బన్, కరీంనగర్‌కు ఒక్కొక్కరు చొప్పున వెళ్లారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసినందున ఇప్పుడు వీరందరు తిరిగి జిల్లాకు రానున్నారు. వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ ఆయా మండలాల తహసీల్దార్లుగా బాధ్యతలు అప్పగించనున్నారు. ఎన్నికల్లో తహసీల్దార్లదే ముఖ్యపాత్ర... 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా మన జిల్లాలో పని చేసిన తహసీల్దార్లను ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు బదిలీ చేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా వరంగల్, కరీంనగర్, నిర్మల్, కుమ్రం భీం జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికలకు ముందు కొత్త జిల్లా యూనిట్‌గా తీసుకొని బదిలీలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ తహసీల్దార్లుగా పని చేసిన వారు బదిలీపై మన జిల్లాకు, మన దగ్గర పని చేసిన వారు ఆయా జిల్లాలకు వెళ్లారు. మన జిల్లా నుంచి తహసీల్దార్లు ఇతర జిల్లాలకు వెళ్లి నేటికి 241 రోజులు అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచి గెలుపోటములు తేలే వరకు, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలయ్యేం త వరకు అక్కడే విధులు నిర్వర్తించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తహసీల్దార్లు సహాయ రిటర్నింగ్, ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడంతో వీరి బదిలీలు తప్పకుండా చేపడుతారు. -
బదిలీలకు వేళాయె..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఇక బదిలీల పర్వం ప్రారంభం కానుంది. సాధారణంగా ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయడం రివాజుగా వస్తోంది. అయితే రాష్ట్రంలో వరుస ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో బదిలీల ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే సమయంలో ఒకేచోట ఎక్కువ కాలం నుంచి పని చేస్తున్న అధికారులను ఎన్నికల నియమావళి ప్రకారం ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కోడ్ ముగియగానే సదరు అధికారులను యథావిధిగా జిల్లాలకు బదిలీ చేయడం జరుగుతోంది. అయితే వరుస ఎన్నికలు రావడంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లిన పోలీస్, రెవెన్యూ, మండల పరిషత్, పంచాయతీరాజ్ అధికారులు తాత్కాలికంగా బదిలీ అయిన స్థానాల్లోనే నిరవధికంగా ఉండాల్సి వచ్చింది. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, లోక్‌సభ, ప్రాదేశిక ఎన్నికలు పూర్తి కావడంతో ప్రభుత్వం ఉద్యోగులు, అధికారుల బదిలీలపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాకు ఎన్నికల సమయంలో వచ్చిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ తమ జిల్లాలకు వెళ్లేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన జిల్లాకు కేటాయించిన తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఆయా అధికారులు, ఉద్యోగులు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో బదిలీల ప్రక్రియ ఈ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ మార్గాల ద్వారా ప్రయత్నాలు.. ఇక సుదీర్ఘకాలంగా జిల్లాలో విధులు నిర్వహించిన రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ ఉద్యోగులు సైతం ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. వీరిలో అనేక మంది సొంత జిల్లాకు రావడానికి తమకున్న రాజకీయ మార్గాల ద్వారా విపరీత ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ అయిన పోలీస్ అధికారులు కూడా తిరిగి జిల్లాలో ఫలానా ప్రాంతానికి వస్తారని, ఫలానా పోస్టింగ్ పొందుతారని ఇప్పటికే ప్రచారం జరుగుతుండడం విశేషం. తహసీల్దార్ స్థాయి అధికారులకు సంబంధించి సైతం ఇదే తరహా ప్రచారం కొనసాగుతోంది. ఇక ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన తహసీల్దార్లలో అనేక మంది పాలనా వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నం కాకపోవడం, కేవలం ఎన్నికల విధుల పట్లనే దృష్టి సారించి భూ సంబంధ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో జిల్లాలోని పలు మండలాల్లో రెవెన్యూపరమైన పాలన మందకొడిగా కొనసాగుతోందనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు అర్హతకు సంబంధించి రెవెన్యూ పరంగా జరగాల్సిన ప్రక్రియకు సంబంధించి రైతులు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా.. భూ పరమైన అర్జీలను పరిష్కరించాలని కోరినా.. అంటీముట్టనట్లుగా వ్యవహరించారనే విమర్శలు పలు మండలాల్లో వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికల వ్యవహారం పూర్తిగా ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన వ్యవహారాలపై దృష్టి సారించి అధికారులు, ఉద్యోగులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2016లో జిల్లా విభజన సమయంలో అధికారుల బదిలీలు చేపట్టారు. అనేక మంది జిల్లా కేంద్రంలో ఉన్న అధికారులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆర్డర్ టూ సర్వ్ ప్రకారం బదిలీ చేశారు. కొద్దినెలలు అక్కడ పని చేసిన అనంతరం మళ్లీ ఖమ్మం వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావించారు. అయితే మూడేళ్లు గడుస్తున్నా బదిలీలు జరగలేదు. అనంతరం ఎన్నికల సమయంలో కొన్ని బదిలీలు చేశారు. సాధారణ బదిలీలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో అనేక మంది తాము కోరుకున్న ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీపీ బదిలీ? ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ బదిలీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే సీపీ బదిలీ అవుతారనే ప్రచారం జరగ్గా.. ఎందుకనో నిలిచిపోయింది. ఎన్నికల కోడ్ ముగియడంతో సీపీ బదిలీ అవుతారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఆయన బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు దాటడంతో బదిలీ అనివార్యమని పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. అలాగే ఖమ్మం నూతన సీపీగా గతంలో భద్రాచలం అడిషనల్ ఎస్పీగా పనిచేసి.. ప్రస్తుతం రాచకొండలో డీసీపీగా పనిచేస్తున్న ప్రకాష్‌రెడ్డి, కొత్తగూడెం ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న అంబర్ కిషోర్‌ఝా, అదేవిధంగా ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. భారీగా పోలీస్ అధికారుల బదిలీలు? జిల్లాలో భారీ ఎత్తున పోలీస్ అధికారుల బదిలీలు అతిత్వరలోనే జరుగుతాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. దీర్ఘకాలికంగా పలు పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు వరుసగా ఎన్నికలు రావడం, కోడ్ అమలులో ఉండడంతో వారి బదిలీలు నిలిచిపోయాయి. కోడ్ ముగియడంతో భారీ ఎత్తున బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నగరంలో ఒకరిద్దరు సీఐలు, రూరల్‌లో ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, అదే విధంగా వైరా సబ్ డివిజన్లో పలువురు ఎస్సైలు, సీఐలకు స్థానచలనం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకు లూప్లైన్లో ఉన్న అధికారులు సైతం మంచి పోస్టింగ్‌ల కోసం రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చాలాకాలంగా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు సైతం ఉత్తర తెలంగాణలో వేరే జిల్లాలకు బదిలీ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి వచ్చిన సీఐ, ఎస్సై స్థాయి అధికారులు తమతమ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. అక్కడ పనిచేస్తూ ఎన్నికల ముందు ఇక్కడకు వచ్చిన కొందరు మాత్రం జిల్లాలోనే ఉండిపోవడానికి రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కావడంతో త్వరలోనే బదిలీలు జరుగుతాయని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. -
టార్గెట్ చీరాల
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పార్టీ నిబంధనలకు పాతరేస్తోంది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. కావాల్సిన చోట తమ చెప్పు చేతల్లో ఉండే అధికారులను నియమించుకుంటోంది. రాత్రికి రాత్రే నియామక ఉత్తర్వులు జారీ చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దీంతో టీడీపీ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ విధానాలపై విరక్తి చెందిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బుధవారం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అదే రోజు అధికార పార్టీ చీరాల పరిధిలో పని చేస్తున్న పోలీస్ అధికారుల బదిలీలకు తెరలేపింది. చీరాల డీఎస్పీ అల్లూరి శ్రీనివాసరావుతో పాటు పట్టణ సీఐ నాగరాజు, రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డిలను బుధవారం బదిలీ చేశారు. కొత్త డీఎస్పీగా నాగరాజును నియమించారు. పట్టణ సీఐగా రాజామోహన్రావును నియమించగా రూరల్ సీఐగా బేతపూడి ప్రసాద్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీకి మద్దతుదారుగా పేరు.. బీసీ సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీ నాగరాజు నెల్లూరు జిల్లాకు చెందిన వారు. ఎక్కువ కాలం ప్రకాశం జిల్లాలో పనిచేశారు. ఒంగోలు టౌన్ ఎస్సైగా, సీఐగా, ఎస్బీ డీఎస్పీగా పనిచేశారు. చీరాల సీఐగా బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలోని సింగరాయకొండలో ఆయనకు బంధువులు ఉన్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్రకు సన్నిహితుడిగా నాగరాజుకు పేరుంది. చీరాలకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి పాలేటి రామారావుతో పాటు ఎమ్మెల్సీ కరణం బలరాంతోనూ నాగరాజుకు సత్సంబంధాలు ఉన్నాయి. పై పెచ్చు టీడీపీకి బలమైన మద్దతుదారుడిగా ఆయనకు పేరుంది. ఎమ్మెల్యే ఆమంచిని ఇబ్బందులకు గురుచేసి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీడీపీ నాగరాజుకు చీరాల డీఎస్పీగా నియమించినట్లు సమాచారం. అది కూడా ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ జగన్‌ను కలిసిన రోజే పాత డీఎస్పీ శ్రీనివాసరావును బదిలీ చేసి నాగరాజును చీరాలకు పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ సీఐగా సీతారామయ్యను సైతం బుధవారమే బదిలీ చేశారు. రెండు నెలల క్రితమే చీరాల సీఐగా ఈయన బాధ్యతలు చేపట్టారు. ఆమంచికి ముఖ్యుడుగా ఉన్నారన్న అక్కసుతోనే ఆయనను బదిలీ చేసి ఆయన స్థానంలో రాజమోహన్‌రావును కొత్త సీఐగా నియమించారు. రాజమోహన్‌రావు జిల్లాలోని దోర్నాల, మార్కాపురం, నాగులుప్పలపాడు తోపాటు ఒంగోలు సీసీఎస్, డీసీఆర్బీలలో పనిచేశారు. 2017లో సీఐగా పదోన్నతి రాగా రైల్వేకు విభాగానికి వెళ్లారు. ఆయనను ప్రస్తుతం చీరాల పట్టణ సీఐగా నియమించారు. ఇక రూరల్ సీఐగా ఉన్న భక్తవత్సలరెడ్డిని తప్పించి బేతపూడి ప్రసాద్‌ను నియమించారు. బేతపూడి ప్రసాద్ ఎమ్మెల్సీ కరణం బలరాంకు వీర విధేయుడు. 2015 నుంచి మూడేళ్ల పాటు అద్దంకి సీఐగా పనిచేశారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అధికార పార్టీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఒత్తిడి పెట్టి బేతపూడి ప్రసాద్‌ను అక్కడి నుంచి బదిలీ చేయించారు. ప్రసాద్ కోసం కరణం పలుమార్లు ఒత్తిడి తెచ్చారు. ఎట్టకేలకు చీరాల రూరల్ సీఐగా బేతపూడి ప్రసాద్‌ను బదిలీ చేశారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ టీడీపీనీ విడి వైఎస్ జగన్‌ను కలిసిన అదే రోజు డీఎస్పీతో పాటు ఇద్దరు సీఐలను ఉన్నతాధికారులు బదిలీ చేయడంపై విమర్శలు ఉన్నాయి. ఇది జిల్లా వ్యాప్తంగా మరింత చర్చనీయాంశంగా మారింది. కీలక అధికారుల బదిలీకి కసరత్తు.. ఎమ్మెల్యే ఆమంచిని ఇబ్బందులు పెట్టేందుకే ప్రభుత్వం అక్కడ ఉన్న పోలీసు అధికారులను తప్పించి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే అధికారులను నియమించినట్లు తెలుస్తోంది. చీరాల నియోజకవర్గ పరిధిలో ఎస్సైల బదిలీలు సైతం జరగనున్నట్లు సమాచారం. పోలీసు విభాగమే కాకుండా చీరాల పరిధిలో రెవెన్యూతో పాటు కీలక అధికారుల బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎంతగా దిగజారి కుట్రలు, కుయుక్తులు పన్నినా ప్రజాబలంతో అన్నింటిని ఎదుర్కొంటామని ఆమంచితో పాటు ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
రాజకీయ బదిలీ
శాంతిభద్రతల విషయంలో ఎస్పీ అభిషేక్ మహంతి రాజీ పడకుండా ముందుకు సాగారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల సంరక్షణమే లక్ష్యంగా తనదైన ముద్ర వేసుకున్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమన్న దృష్టితో వెళుతూ పోలీసుల్లోనూ, ప్రజల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి అధికారిని ప్రోత్సహించాల్సింది పోయి బదిలీ బహుమానంగా అప్పగించి రాష్ట్ర ప్రభుత్వం ఘనత వహించింది. తాను ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఎస్పీ ఉంటే కష్టమని సీఎంకు మంత్రి ఆది మొరపెట్టుకుని బదిలీ చేయించారని వాదనలు వినిపిస్తున్నాయి. సాక్షి కడప : ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష పార్టీని ఢీ కొట్టలేమని అధికార టీడీపీ భావిస్తోందా.. ఇప్పటి నుంచే వక్రమార్గాలపై దృష్టి పెట్టిందా.. ఈక్రమంలోనే ఎస్పీ అభిషేక్ మహంతిని అర్ధాంతర బదిలీ చేశారా.. అంటే ఔను అనే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుత ఎస్పీ అభిషేక్ మహంతి నిక్కచ్చిగా వెళతుండడం అధికార పార్టీ నాయకులకు మింగుడు పడలేదు. పైగా పలు సంఘటనల వ్యవహారంలో న్యాయబద్దంగానే ముందుకు వెళ్లారు. అయితే మంత్రి ఆదికి సంబంధించి ఎంపీ అభ్యర్థిత్వం ఖరారు కాగానే.. ఎస్పీగా అభిషేక్ మహంతి ఉంటే ఎన్నికల సమయంలో కష్టమని, ఖచ్చితంగా బదిలీ చేయాల్సిందేనని సీఎం వద్ద మంత్రి ఆది మొరపెట్టుకున్నట్లు తెలియవచ్చింది. కానీ రాజకీయాలకు అనుకూలంగా పనిచేయలేదన్న కారణాలతో బదిలీలకు అధికార పార్టీ నేతలు తెరతీయడం ద్వారా పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే చర్యగా పలువురు భావిస్తున్నారు. రాజకీయ బదిలీ జిల్లా ఎస్పీగా అభిషేక్ మహంతి 2018 అక్టోబరు 26వ తేదీన బదిలీ ఉత్తర్వులు వెలువడగా....తిరుపతి అర్బన్ ఎస్పీగా పనిచేస్తున్న ఆయన నవంబరు 2వ తేదీన కడప ఎస్పీగా బా«ధ్యతలు చేపట్టారు. నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్న తరుణంలో అర్థాంతరంగా గురువారం బదిలీ ఉత్తర్వులు అందాయి. గ్రేహౌండ్స్ విభాగానికి సంబంధించి గ్రూప్ కమాండర్‌గా బదిలీ చేశారు. ఎన్నికలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో తర్వాత ప్రభుత్వ ఆధీనంలో బదిలీల ప్రక్రియ ఉండదు కాబట్టి ముందస్తుగా టీడీపీ నేతలు బదిలీ చేయించినట్లు తెలుస్తోంది. 2011 బ్యా చ్‌కు చెందిన అభిషేక్ మహంతి పనిచేసిన అన్ని చోట్ల తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మూడున్నర నెలలకే జిల్లాలో అంతకుముందు ఎస్పీలు పీహెచ్డీ రామకృష్ణ, బాబూజీ అట్టాడలు దాదాపు ఒకట్నిర సంవత్సరం నుంచి రెండేళ్లపాటు పనిచేశారు.ఇటీవలే కడపకు వచ్చిన అభిషేక్ మహంతిని ఊహించని రీతిలో మంత్రితోపాటు టీడీపీ నేతలు పట్టుబట్టి బదిలీకి ప్రయత్నించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం నిజాయితీగా..నిక్కచ్చిగా ప్రజలకు న్యాయం అందించే అధికారులను బదిలీ చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. కేవలం మూడున్నర నెలల వ్యవధిలోనే ఎస్పీని రాజకీయ బదిలీ చేయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఏకపక్ష చర్యలకు మొగ్గుచూపకపోవడంతోనే జిల్లాలో ఎస్పీగా అభిషేక్ మహంతి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్న సిద్ధాంతంతో ముందుకు వెళుతున్నారు. ఈ ప్రకారమే ప్రొద్దుటూరు పట్టణంలోని పోలీసుస్టేషన్ ఎదురుగా ఇద్దరు టీడీపీ నేతలు గొడవలకు దిగిన సందర్భంలోనూ ఎస్పీపై ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ నిక్కచ్చిగా వ్యవహారిస్తూ చట్టం దృష్టిలో అందరూ సమానులేనని ఎంపీ సీఎం రమేష్ వర్గానికి చెందిన వారితోపాటు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గానికి చెందిన వారిపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా మంత్రికి పట్టున్న గొరిగెనూరు వ్యవహారంలో ఎస్పీ నిక్కచ్చిగా వ్యవహరించారు. కిందిస్థాయి సిబ్బంది తప్పుదారి పట్టించినప్పటికీ ఎస్పీ తనకున్న సమాచారం మేరకు ముందుకు వెళ్లారు.ఈ వ్యవహారం నాటి నుంచి కూడా మంత్రి అసహనంగా ఉంటూనే లోలోపల ఎస్పీ బదిలీకి ప్రయత్నాలు సాగించినట్లు తెలుస్తోంది. ఎన్నికల వరకు ఎస్పీగా అభిషేక్ మహంతి కొనసాగి నిజాయితీగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తే ప్రజాస్వామంలో విఫలమౌతామనే భావన టీడీపీ నేతలకు బలంగా ఉన్నట్లు సమాచారం. ఈనేపథ్యంలోనే అర్ధాంతర బదిలీకి ఆస్కారం ఏర్పడినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నూతన ఎస్పీగా రాహుల్‌దేవ్ శర్మ జిల్లా నూతన ఎస్పీగా రాహుల్దేవ్శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో టెక్నికల్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న ఈయనను కడపకు బదిలీ చేశారు. 2015 జూన్ 11న కడపలో ఓఎస్డీగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌దేవ్‌శర్మ 2016 జనవరి 10వ తేది వరకు విధులు నిర్వర్తించారు. అనంతరం ఎస్పీగా పదోన్నతి రావడంతో విశాఖకు వెళ్లిపోయారు. ఏది ఏమైనా రెండు, మూడు రోజుల్లో కొత్త ఎస్పీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
నిర్లక్ష్యంపై వేటు
నిర్మల్: ‘జంగిల్ బచావో–జంగిల్ బడావో’ నినాదాన్ని సీఎం కేసీఆర్ వందశాతం అమలు చేసేందుకు సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వన్యప్రాణుల వేట, కలప అక్రమ దందాలు జోరుగా సాగడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈక్రమంలో ఇన్నేళ్లుగా అడవులను కాపాడటంలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై సర్కారు బదిలీ వేటు వేసింది. పలువురికి తక్కువ స్థాయి బాధ్యతలు అప్పగించింది. వారి స్థానాల్లో కఠినంగా వ్యవహరించే, నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను నియమించాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అటవీశాఖ ఉన్నతాధికారులు బదిలీలను చేపట్టారు. అడవుల సంరక్షణ, చెట్ల పెంపకంపై చిత్తశుద్ధి చూపించే అధికారులను ముఖ్యప్రాంతాల్లో నియమించినట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండే ఉమ్మడి ఆదిలాబాద్‌లో నిబద్ధత కలిగిన అధికారులను నియమించడం, స్మగ్లర్లు, వన్యప్రాణుల వేటగాళ్లపై ఉక్కుపాదం మోపడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం జిల్లా భారీగా బదిలీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో బుధవారం నలుగురు ఎఫ్ఆర్ఓలకూ స్థానచలనం చేశారు. మొత్తం క్షేత్రస్థాయి నుంచి బదిలీల ప్రక్రియ కొనసాగుతుందని అటవీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో నలుగురు బదిలీ.. ఉమ్మడిజిల్లా అటవీశాఖలో బదిలీల అలజడి కొనసాగుతోంది. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీఎఫ్)తో పాటు కవ్వాల్ అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్స్(ఎఫ్డీపీటీ)గా ఉన్న శరవణన్, నిర్మల్, మంచిర్యాల డీఎఫ్ఓలు దామోదర్‌రెడ్డి, రామలింగంను మంగళవారం సాయంత్రం బదిలీ చేశారు. వారి తర్వాత బుధవారం ఉమ్మడి జిల్లాలో నలుగురు ఫారెస్ట్ రేంజ్ అధికారు(ఎఫ్ఆర్ఓ)లను ట్రాన్స్ఫర్ చేశారు. నిర్మల్‌జిల్లా దిమ్మదుర్తి రేంజ్ ఎఫ్ఆర్ఓ షబ్బీర్ అహ్మద్‌ను మంచిర్యాలలోని తునికాకు(బీడీ లీఫ్) గోదాం ఇన్చార్జి(స్పెషల్డ్యూటీ)గా పంపించారు. దిమ్మదుర్తి రేంజ్ బాధ్యతలను ఇంకా ఎవరికీ అప్పగించలేదు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి ఎఫ్ఆర్ఓ నిజామొద్దీన్‌ను కెరమెరి రేంజ్ అధికారిగా బదిలీ చేశారు. కెరమెరిలో ఎఫ్‌ఆర్‌ఓగా పనిచేస్తున్న మజారొద్దీన్ను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రేంజ్ ఎఫ్‌ఆర్‌ఓగా బదిలీ చేశారు. బెల్లంపల్లి ఎఫ్ఆర్ఓ వినయ్‌కుమార్‌ను తిర్యాణి రేంజ్‌కు పంపించారు. పనితీరుపైనే.. ఏళ్లుగా అటవీశాఖలో కలప దొంగతనాలు, వన్యప్రాణుల వేట కొనసాగుతూ వస్తోంది. అరికట్టాల్సిన శాఖాధికారుల్లోనే కొందరు ఇంటిదొంగలుగా మారి, స్మగ్లర్లకు సహకరించారు. తమకు తెలిసినా అరికట్టలేకపోయిన తీరు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపైనే సర్కారు సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు.. ఉమ్మడి జిల్లా అడవుల్లో ఇటీవల కాలంలో వరుస సంఘటనలు చోటు చేసుకున్నాయి. పెంబి మండలం పుల్గంపాండ్రి వద్ద పెద్దపులిని హతమార్చడం, పాత మంచిర్యాల బీట్‌లో చిరుతపులి, శివ్వారం బీట్‌లో ఏకంగా రాయల్ బెంగాల్ టైగర్‌ను మట్టుబెట్టడం.. ఇలా వరుసగా సంచలనాలు చోటుచేసుకున్నాయి. కవ్వాల్ అడవుల్లోకి అడుగు పెట్టిన ప్రతి పులినీ వేటగాళ్లు ఖతం చేస్తున్నా.. అరికట్ట లేకపోవడం స్థానిక అధికారులకు మైనస్ అయ్యింది. దీనికి తోడు ఆదిలాబాద్–నిర్మల్–నిజామాబాద్ జిల్లాల మధ్య పెద్ద కలప రాకెట్ కూడా బయట పడటం, అందులో ఇంటి దొంగలతో పాటు పోలీసు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. ఈ వరుస ఘటనలపై ‘సాక్షి’ లోతైన పరిశోధనలతో వరుస కథనాలనూ ప్రచురించింది. వీటన్నింటి నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అటవీశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సర్కారు సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఏకంగా సీఎఫ్‌తో పాటు ఇద్దరు డీఎఫ్ఓలు, పలువురు ఎఫ్డీఓలు, ఎఫ్‌ఆర్‌ఓలను బదిలీ చేసింది. విధుల్లో చేరని కొత్త బాస్‌లు.. ఉమ్మడి ఆదిలాబాద్ సీఎఫ్ శరవణన్‌ను మంగళవారం సాయంత్రం మెదక్ బదిలీ చేశారు. ఆయన స్థానంలో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పరిధిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎఫ్డీపీటీ, సీఎఫ్‌గా ఉన్న సీపీ. వినోద్‌కుమార్‌ను కేటాయించారు. కానీ ఆయన బుధవారం విధుల్లో చేరలేదు. అలాగే మంచిర్యాల డీఎఫ్ఓగా ఉన్న రామలింగంను వరంగల్అర్బన్, జనగామ జిల్లాల డీఎఫ్ఓగా పంపించారు. ఆయన స్థానంలో రావాల్సిన ఐఎఫ్ఎస్ అధికారి శివానీ డోగ్రా కూడా బాధ్యతలు చేపట్టలేదు. నిర్మల్ డీఎఫ్ఓగా ఉన్న దామోదర్‌రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డివిజన్లోని కిన్నెరసాని వైల్డ్‌లైఫ్‌కు కేటాయించారు. నిజామాబాద్జిల్లా డీఎఫ్ఓ వీఎస్ఎన్వీ ప్రసాద్ నిర్మల్‌కు కేటాయించారు. ఆయన కూడా ఇంకా విధుల్లో చేరలేదు. పులి హతం కేసులకు సంబంధించిన విచారణలో సీఎఫ్ శరవణన్, నిర్మల్ డీఎఫ్ఓ దామోదర్‌రెడ్డి హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలిసింది. ఈమేరకు వారు వచ్చిన తర్వాత కొత్త అధికారులు విధుల్లో చేరనున్నట్లు ఆశాఖ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మంచిర్యాల ఎఫ్‌డీఓగా కిన్నెరసాని వైల్డ్‌లెఫ్ ఎఫ్‌డీఓగా ఉన్న ఎం.నాగభూషణం, కాగజ్‌నగర్ ఎఫ్‌డీఓగా పీసీసీఎఫ్ ఆఫీస్‌లో ఏసీఎఫ్‌గా ఉన్న ఎం.రాజారమణారెడ్డి, ఖానాపూర్ ఎఫ్‌డీఓగా ప్రస్తుతం బెల్లంపల్లి ఎఫ్డీఓ, మంచిర్యాల ఇన్చార్జి ఎఫ్‌డీఓగా ఉన్న తిరుమల్‌రావు బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కొనసాగనున్న బదిలీలు.. ప్రభుత్వం మంగళవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 మంది అధికారులను బదిలీ చేసింది. ఇందులో చీఫ్ కన్జర్వేటర్ నుంచి బీట్ ఆఫీసర్ వరకు ఉన్నారు. రాష్ట్రంలో 19 మంది రేంజ్ ఆఫీసర్లను మార్చినట్లు తెలిసింది. ఇందులో బుధవారం ఉమ్మడి జిల్లాలో నలుగురికి స్థానచలనం కల్పించారు. కెరమెరి, బెల్లంపల్లి, తిర్యాణి, దిమ్మదుర్తి ఎఫ్‌ఆర్‌ఓలను బదిలీ చేశారు. ఇక రాష్ట్రంలో బీట్ ఆఫీసర్లు 160 మందిని బదిలీ చేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది ఎఫ్బీ ఓల బదిలీ జరగనుందో తేల్చే పనిలో ఉన్నట్లు తెలిసింది. ప్రధానంగా అటవీ సంబంధిత నేరాలను నివారించడంలో విఫలమైన వారిని, పనితీరు సరిగా లేని వారిని బదిలీ చేసి, ఆయా అటవీ ప్రాంతాల్లో సమర్థులను కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అటవీశాఖలో ఇదే అంశంపై చర్చ సాగుతోంది. -
బదిలీల జాతర
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని ఉద్యోగుల్లో బదిలీ సందడి నెలకొంది. త్వరలో బదిలీలు, ప్రమోషన్లకు తెరలేవనుంది. అన్ని శాఖలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా బదిలీలు ఈ నెలలోనే జరిగే అవకాశముందని సూత్రప్రాయంగా తెలియడంతో అధికారుల్లో హడావుడి మొదలైంది. ముఖ్యంగా కోరుకున్న చోటకి బదిలీలు జరగడం కోసం జిల్లాలోని ఉద్యోగులు, అధికారులు ఉన్నతాధికారులు, నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది తమ దరఖాస్తులను అందజేస్తున్నారు. గతంలో జరిగిన బదిలీలు ఆకస్మికంగా నిలిచిపోవడంతో చాలా మంది ఆశావహులు నిరుత్సాహం చెందారు. ఈ సారి జరిగే బదిలీల్లో అయినా న్యాయం జరుగుతుందేమోనని ఎదురు చూస్తున్నారు. ఈనెలలో బదిలీలు జరుగుతాయనే అంశంపై గత రెండు నెలల నుంచి ఊహాగానాలు వినబడుతున్నా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం బదిలీలపై ఉన్న నిషేధాన్ని కొద్దిరోజుల పాటు మాత్రమే ఎత్తివేసి తక్కువ వ్యవధిలో బదిలీల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు విడుదలవుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా బదిలీల్లో ఈ సారి పారదర్శకంగా నిర్వహించాలని అంటున్నా చాపకింద నీరులా రాజకీయ నాయకులతో పైరవీలు చేయించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో 20 శాతానికి మించి బదిలీలు చేయకూడదని ఆదేశాలు, నిబంధనలు ఉన్నా పట్టించుకోకుండా కొన్ని శాఖల్లో బదిలీలు జరిగాయి. ఆడిట్ వంటి కొన్ని శాఖల్లో పరిమితికి మించి బదిలీలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయితే ఈ సారి కూడా ఇదే పరిస్థితి పునరావృతం కానుందా లేక 20 శాతానికి లోబడే బదిలీలు జరుగుతాయా అన్న విషయాలు నిషేధం ఎత్తివేశాక కానీ బయటపడే అవకాశాల్లేవు. రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించే సమయంలో గతంలో ముందుగానే ఆర్ఐలుగా కొన్నాళ్లు కోర్సు కంప్లీట్ చేసేవారు. సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతులు పొందాలంటే తప్పనిసరిగా ఆర్ఐగా కనీసం రెండేళ్లు పనిచేయాల్సిన నిబంధనలున్నాయి. కానీ చాలా మందికి ప్రమోషన్లు ఇచ్చినా ఇంకా ఆర్ఐ కోర్సులకు అనుమతించలేదు. ఇలా జిల్లాలో సుమారు 35 మంది వరకూ ఉన్నట్టు భోగట్టా! అలాగే జిల్లా వ్యాప్తంగా సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన స్థానాల్లో జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ల స్థానాల్లో ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్హత పొందిన కింది స్థాయి సిబ్బందికి కూడా ఏదైనా అవకాశం రావచ్చనే ఆశలు ఉద్యోగుల్లో నెలకొన్నాయి. ఈ నెలలో అటు పదోన్నతులు, ఇటు బదిలీలతో స్థాన చలనాలు, పైరవీలు, బెదిరింపులు, అలకలతో ముడిపడి ఉందనడంలో సందేహం లేదు. -
అమ్మో...జూన్...
జూన్ నెల వచ్చిందంటే చాలు... సగటుజీవికి కష్టాలు మొదలైనట్టే. నెలంతా ఖర్చులతో సతమతం కావాల్సిందే. రైతులకు ఖరీఫ్ సీజన్ మొదలయ్యే మాసం... విద్యాసంస్థలు పునఃప్రారంభం... ఉద్యోగులకు బదిలీ కాలం... ఇవన్నింటికీ డబ్బులు వెచ్చించాల్సిందే. అంతేనా... వాతావరణ మార్పులవల్ల ఆరోగ్యపరమైన సమస్య తలెత్తేదీ ఇప్పుడే... ఆస్పత్రులు, మందులు అదనపు భారం. ఇవన్నీ తట్టుకోవడం కష్టమేమరి. లావేరు:సాధారణ ఉద్యోగి మొదలుకొని... రైతులు... రోజువారీ కూలీలు జూన్‌నెల వచ్చిందంటే చాలు హడలెత్తిపోతున్నారు. గతం కంటే ఈ నెలలో మొదలయ్యే వ్యవసాయ పనులు, విద్యా సంబంధ ఫీజులు, పుస్తకాల ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. ఈ నెలలోనే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ తరుణంలోనే తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుంది. పిల్లలకు స్కూల్ యూనిఫాంలు, బ్యాగులు, పుస్తకాలు, క్యారేజీలు, ఫీజులతో ాటు, ఇంకా అనేకరకాల ఖర్చులుంటాయి. మామూలు ప్రైవేటు పాఠశాలల్లోనే ఎల్కేజీ స్థాయి విద్యార్థికి వేలల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటే ఇక కార్పొరేట్ స్కూళ్లలో చదివించేవారికి ఏమేరకు ఆర్థిక సమస్య ఉంటుందన్నది వేరే చెప్పనవసరం లేదు. ఈ ఏడాది పాఠశాలల్లోనూ అమాంతంగా ఫీజులను కూడా పెంచేశారు. దీంతో ఆ భారమంతా తల్లిదండ్రులపైనే పడుతోంది. రైతులకు ఖరీఫ్ సాగు భారం ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యేది జూన్ నెలలోనే. వ్యవసాయానికి ఇది పెట్టుబడులకాలం. ఎరువులు, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, కూలీల రేట్లు కూడా పెరగడంతో వ్యవసాయపెట్టుబడులు రెట్టింపయ్యాయి. ఒకవైపు వ్యవసాయానికి మదుపుల కోసం పెట్టుబడులు సమకూర్చుకోవాలి, మరోపక్క పిల్లల చదువులకు ఫీజుల కోసం ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. ఈ పరిస్థితులనుంచి గట్టెక్కడానికి రుణాల కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిందే. వ్యాధులొస్తాయి... రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణంలో మార్పులు వచ్చి జూన్ నెలలోనే వర్షాలు పడుతుంటాయి. వాతావరణంలో వచ్చే మార్పులు, వర్షాల వల్ల విషజ్వరాలు, మలేరియా, డయేరియా, పచ్చకామెర్లు, డెంగ్యూ, వ్యాధులు ప్రబలే అవకాశాలు ఈ నెలలోనే ఎక్కువగా ఉంటాయి. వ్యాధులు ప్రబలితే వేలల్లో ఖర్చు కావడంతో ప్రజలు ఈ నెల అంటేనే భయపడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు పరీక్షల పేరుతో వేలల్లో డబ్బును గుంజేస్తుండటంతో వ్యాధులు వస్తే చాలు అంతా హడలెత్తిపోతున్నారు. ఉద్యోగులకు బదిలీలు జూన్‌లోనే. ఉద్యోగులకు బదిలీలు జరిగేది ఎక్కువగా ఈ నెలలోనే. సాధారణంగా అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఈ నెలలోనే బదిలీలు జరుగుతుంటాయి. వారంతా బదిలీలు ప్రాంతానికి వెళ్లేందుకు అవసరమైన రవాణా ఖర్చులు రెట్టింపవుతున్నాయి. చదువుకునే పిల్లలుంటే వారిని వేరే చోట స్కూళ్లకు మార్పించాల్సిందే. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నదే. ఇన్ని సమస్యలతో సగటు జీవి జూన్ నెల అంటేనే భయపడిపోతున్నాడు. -
జాబితాలు సిద్ధం
బదిలీలపై ఆందోళన చెందుతున్న ఉద్యోగులు పశుసంవర్థక శాఖలో కౌన్సెలింగ్ ప్రారంభం విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో ఉద్యోగుల బదిలీల కోలాహలం ప్రారంభమైంది. కలెక్టర్ శనివారం ఆదేశించిన మీదట వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు జాబితాలు సిద్ధం చేసే పనిలో తలమునకలయ్యారు. ఆయా శాఖల్లో మూడేళ్లు పైబడి ఒకే చోట విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో పాటు మూడేళ్ల లోపు ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారి వివరాలతో కూడిన జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా, ఎక్కడి నుంచి ఇక్కడకు రావాలన్నా ఇన్చార్జి మంత్రి,కలెక్టర్, జిల్లా అధికారి నేతృత్వంలోని డీఎల్సీ కమిటీదే తుది నిర్ణయం కావడంతో ఉద్యోగులు భయపడుతున్నారు. తమను ఏ ప్రాంతానికి బదిలీ చేస్తారోనన్న ఆందోళనవారిలో నెలకొంది. ముఖ్యంగా పైరవీలు చేయించుకోలేని వారు, గతంలో పైరవీలకు అనుగుణంగా పనిచే యలేని కొందరు ఉద్యోగులు ఇప్పుడు ఇబ్బందులు పడే ప్రమాదముంది. దీంతో వారు బితుకుబితుకుమంటున్నారు. పశుసంవర్ధకశాఖలో కౌన్సెలింగ్ ప్రారంభం మరో పక్క జిల్లాలోని పశు సంవర్థక శాఖ పరిధిలో ఎన్జీఓల బదిలీలకు కౌన్సెలింగ్ ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన పశుసంవర్ధక శాఖ అడిషనల్ డెరైక్టర్ డాక్టర్ సోమశేఖర్ కలెక్టర్ ఆఫీసులోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఎన్జీఓలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఒక్క జిల్లాకు సంబంధించిన వారినే కాకుండా మూడు జిల్లాలకు చెందిన రీజినల్ స్థాయిలోని ఉద్యోగులందరికీ బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఇతర ప్రాంతాలనుంచి ఇక్కడకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. స్థలాల ఎంపిక, ఉద్యోగులు పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి రమణమూర్తి ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ముందుగా జిల్లాలో ఉన్న వీఆర్వోల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడేళ్లు దాటినా ఇంకా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నవారు 3వందల నుంచి 350 మంది వరకూ ఉన్నారని ఏఓ రమణ మూర్తి చెబుతున్నారు. వీరికి స్థానచలనం తప్పనట్టే! అదేవిధంగా రెవెన్యూలో ప్రస్తుతం అదనపు జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న యూసీజీ నాగేశ్వరరావు కూడా తప్పనిసరి బదిలీల్లో ఉంటారు. ఆయన కూడా చాలా సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన బదిలీల్లో ఈయనకు ఇతర ప్రాంతానికి బదిలీ కాగా నిలుపుకొన్నారు. ఆర్డీఓ కూడా మూడేళ్లు పైబడి విధులు నిర్వహిస్తున్నారు. సివిల్ సప్లైస్‌లో మూడేళ్లు దాటి ఒకే చోట పనిచేస్తున్నవారు సుమారు 24 మంది ఉన్నట్టు భోగట్టా! కేఆర్సీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ శాఖల్లోనూ మూడేళ్లు దాటి విధులు నిర్వహిస్తున్న వారు ఉన్నారు. అయితే ఖజానా, విద్యాశాఖ, వాణిజ్య పన్నులు,కోర్టు, ఎక్సైజ్ వంటి శాఖలకు ప్రత్యేక జీఓ ఇచ్చి బదిలీ చేస్తారని రావడంతో వారు ప్రస్తుతానికి ఆందోళన చెందడం లేదు. -
పైరవీలకే పెద్దపీట
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు విడుదల చేసిన మార్గదర్శకాలు విభిన్నంగా ఉండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఒక చోట ఉన్న సీనియారిటీ, ఇతర అప్షన్లు వంటి ప్రమాణాల ఆధారంగా బదిలీలు జరిగేవి, ఈ సారి బదిలీల నిబంధనల్లో కమిటీలకు ప్రదాన్యమివ్వడంతో రాజకీయ జోక్యానికి పెద్దపీట వేసినట్టయింది. ఇప్పటికే జిల్లాలో మంత్రి ఒక సందర్భంలో మాట్లాడుతూ బదిలీల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకుల సిఫార్సులకే ప్రాధాన్యం ఉంటుందని, తమకు అనుకూలమైన వారినే నియమించుకోవాలని ఇదివరకే సూచించారు. దీనిని బట్టి బదిలీల్లో రాజకీయ పైరవీలు, సిఫార్సులు ఆధికంగా ఉంటాయని స్పష్టమౌతోంది. ఈసారి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత వీరి బదిలీలు చేయలేదు. ఇక ఆడిట్, ఖజానా శాఖఉద్యోగులకు ఈ బదిలీల్లో మినహాయింపునిచ్చారు. వీరి శాఖల్లో ఎలక్ట్రానిక్ పేమెంటు విధానం, కంప్యూటరీకరణ, ఇతర సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తరువాత వారికి తలెత్తే అవకాశం లేకుండా ఉండేందుకే బదిలీల నుంచి మినహాయింపు నిచ్చినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఖజానాశాఖ సిబ్బంది మూడేళ్లుగా బదిలీలకోసం ఎదురు చూస్తున్నారు. ఈ సారి బదిలీల ప్రక్రియపై ఉద్యోగ సంఘాల నాయకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీల పేరిట రాజకీయ ప్రమేయాన్ని పెంచుతున్నారని, పరిపాలనా సౌలభ్యం పేరిట ఇష్టంలేనివారిని, వారికి అనుకూలంగా లేనివారిని అక్రమంగా బదిలీలు చేసేందుకు ఈ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని వారు విమర్శిస్తున్నారు. నాయకుల చుట్టూ ప్రదక్షిణలు ఈసారి బదిలీల్లో కీలకంగా రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలు ఉంటాయి. ఈ శాఖలతో నాయకులకు, ప్రజలకు ఎక్కువగా పనులు ఉండడంతో ఈ శాఖల్లో బదిలీలకు ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే టీడీపీ కార్యకర్తల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు ప్రారంభించారు. ముఖ్యంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్ఓ, తహశీల్దార్ల బదిలీలకు గిరాకీ ఉంది. గత ఏడాది జరిగిన బదిలీల్లో జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుల పీఏలు కీలక పాత్ర పోషించారు. యూనియన్ ఆఫీస్ బేరర్లను సైతం నిబంధనలకు విరుద్ధంగా బదిలీచేసి వారి పంతం నిలబెట్టుకున్నారు. అదే పరిస్థితి పంచాయతీ రాజ్ శాఖలో జరిగింది. అప్పట్లో మిగిలిపోయినవారికి ఈ సారి స్థాన చలనం తప్పేట్టు లేదు. అందుకోసం నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటినుంచే వారిచుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు. -
220 మంది ఉద్యోగుల బదిలీ
కోటబొమ్మాళి: ఇటీవల జిల్లా పరిషత్ పరిధిలోని 220 మం ది ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేసినట్లు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఎస్.రవీంద్ర తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వీరఘట్టం, నందిగాం, హిరమండలం, పాతపట్నం మండలాల ఎంపీడీఓలను ఇతర జిల్లాలకు బదిలీ చేశామన్నారు. బదిలీలను పారదర్శకంగా నిర్వహించినట్టు చెప్పారు. జిల్లాలో 9 ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న మండల పరిషత్ కార్యాలయాల్లో సూపరింటెండెంట్లకు అదనపు బాధ్యతలు అప్పగించామన్నారు. సమావేశంలో ఎంపీడీఓ బి.రాజు పాల్గొన్నారు. కురుడు హైస్కూల్లో విచారణ మండలంలోని కురుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హుద్‌హుద్ తుపానుకు పాఠశాల ఆవరణలో 8 నీలగిరి చెట్లు కూలిపోగా వాటిని హెచ్.ఎం ఎల్వీ ప్రతాప్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మేశారంటూ గ్రామానికి చెందిన ఎన్.లక్ష్మణరావు ఇటీవల జిల్లా పరిషత్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఈఓ రవీంద్ర, ఎంపీడీఓ బి.రాజులతో కలసి శని వారం పాఠశాలలో విచారణ జరిపారు. చెట్లు కూలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. హెచ్.ఎం ప్రతాప్‌ను, ఫిర్యాదు దారుడు లక్ష్మణరావుల నుంచి వివరాలు సేకరించారు.