టార్గెట్‌ చీరాల | Police Department Transfers TDP Leaders Involvement Prakasam | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ చీరాల

Published Fri, Feb 15 2019 12:11 PM | Last Updated on Fri, Feb 15 2019 12:11 PM

Police Department Transfers TDP Leaders Involvement Prakasam - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పార్టీ నిబంధనలకు పాతరేస్తోంది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. కావాల్సిన చోట తమ చెప్పు చేతల్లో ఉండే అధికారులను నియమించుకుంటోంది. రాత్రికి రాత్రే నియామక ఉత్తర్వులు జారీ చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దీంతో టీడీపీ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ విధానాలపై విరక్తి చెందిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. బుధవారం వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అదే రోజు అధికార పార్టీ చీరాల పరిధిలో పని చేస్తున్న పోలీస్‌ అధికారుల బదిలీలకు తెరలేపింది. చీరాల డీఎస్పీ అల్లూరి శ్రీనివాసరావుతో పాటు పట్టణ సీఐ నాగరాజు, రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డిలను బుధవారం బదిలీ చేశారు. కొత్త డీఎస్పీగా నాగరాజును నియమించారు. పట్టణ సీఐగా రాజామోహన్‌రావును నియమించగా రూరల్‌ సీఐగా బేతపూడి ప్రసాద్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

టీడీపీకి మద్దతుదారుగా పేరు..
బీసీ సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీ నాగరాజు నెల్లూరు జిల్లాకు చెందిన వారు. ఎక్కువ కాలం ప్రకాశం జిల్లాలో పనిచేశారు. ఒంగోలు టౌన్‌ ఎస్సైగా, సీఐగా, ఎస్‌బీ డీఎస్పీగా పనిచేశారు. చీరాల సీఐగా బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలోని సింగరాయకొండలో ఆయనకు బంధువులు ఉన్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్రకు సన్నిహితుడిగా నాగరాజుకు పేరుంది. చీరాలకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి పాలేటి రామారావుతో పాటు ఎమ్మెల్సీ కరణం బలరాంతోనూ నాగరాజుకు సత్సంబంధాలు ఉన్నాయి. పై పెచ్చు టీడీపీకి బలమైన మద్దతుదారుడిగా ఆయనకు పేరుంది. ఎమ్మెల్యే ఆమంచిని ఇబ్బందులకు గురుచేసి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీడీపీ నాగరాజుకు చీరాల డీఎస్పీగా నియమించినట్లు సమాచారం.

అది కూడా ఆమంచి కృష్ణమోహన్‌ వైఎస్‌ జగన్‌ను కలిసిన రోజే పాత డీఎస్పీ శ్రీనివాసరావును బదిలీ చేసి నాగరాజును చీరాలకు పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ సీఐగా సీతారామయ్యను సైతం బుధవారమే బదిలీ చేశారు. రెండు నెలల క్రితమే చీరాల సీఐగా ఈయన బాధ్యతలు చేపట్టారు. ఆమంచికి ముఖ్యుడుగా ఉన్నారన్న అక్కసుతోనే ఆయనను బదిలీ చేసి ఆయన స్థానంలో రాజమోహన్‌రావును కొత్త సీఐగా నియమించారు. రాజమోహన్‌రావు జిల్లాలోని దోర్నాల, మార్కాపురం, నాగులుప్పలపాడు తోపాటు ఒంగోలు సీసీఎస్, డీసీఆర్‌బీలలో పనిచేశారు. 2017లో సీఐగా పదోన్నతి రాగా రైల్వేకు విభాగానికి వెళ్లారు. ఆయనను ప్రస్తుతం చీరాల పట్టణ సీఐగా నియమించారు.

ఇక రూరల్‌ సీఐగా ఉన్న భక్తవత్సలరెడ్డిని తప్పించి బేతపూడి ప్రసాద్‌ను నియమించారు. బేతపూడి ప్రసాద్‌ ఎమ్మెల్సీ కరణం బలరాంకు వీర విధేయుడు. 2015 నుంచి మూడేళ్ల పాటు అద్దంకి సీఐగా పనిచేశారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అధికార పార్టీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఒత్తిడి పెట్టి బేతపూడి ప్రసాద్‌ను అక్కడి నుంచి బదిలీ చేయించారు. ప్రసాద్‌ కోసం కరణం పలుమార్లు ఒత్తిడి తెచ్చారు. ఎట్టకేలకు చీరాల రూరల్‌ సీఐగా బేతపూడి ప్రసాద్‌ను బదిలీ చేశారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ టీడీపీనీ విడి వైఎస్‌ జగన్‌ను కలిసిన అదే రోజు డీఎస్పీతో పాటు ఇద్దరు సీఐలను ఉన్నతాధికారులు బదిలీ చేయడంపై విమర్శలు ఉన్నాయి. ఇది జిల్లా వ్యాప్తంగా మరింత చర్చనీయాంశంగా మారింది.

కీలక అధికారుల బదిలీకి కసరత్తు..
ఎమ్మెల్యే ఆమంచిని ఇబ్బందులు పెట్టేందుకే ప్రభుత్వం అక్కడ ఉన్న పోలీసు అధికారులను తప్పించి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే అధికారులను నియమించినట్లు తెలుస్తోంది. చీరాల నియోజకవర్గ పరిధిలో ఎస్సైల బదిలీలు సైతం జరగనున్నట్లు సమాచారం. పోలీసు విభాగమే కాకుండా చీరాల పరిధిలో రెవెన్యూతో పాటు కీలక అధికారుల బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎంతగా దిగజారి కుట్రలు, కుయుక్తులు పన్నినా ప్రజాబలంతో అన్నింటిని ఎదుర్కొంటామని ఆమంచితో పాటు ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement