జూన్ నెల వచ్చిందంటే చాలు... సగటుజీవికి కష్టాలు మొదలైనట్టే. నెలంతా ఖర్చులతో సతమతం కావాల్సిందే.
జూన్ నెల వచ్చిందంటే చాలు... సగటుజీవికి కష్టాలు మొదలైనట్టే. నెలంతా ఖర్చులతో సతమతం కావాల్సిందే. రైతులకు ఖరీఫ్ సీజన్ మొదలయ్యే మాసం... విద్యాసంస్థలు పునఃప్రారంభం... ఉద్యోగులకు బదిలీ కాలం... ఇవన్నింటికీ డబ్బులు వెచ్చించాల్సిందే. అంతేనా... వాతావరణ మార్పులవల్ల ఆరోగ్యపరమైన సమస్య తలెత్తేదీ ఇప్పుడే... ఆస్పత్రులు, మందులు అదనపు భారం. ఇవన్నీ తట్టుకోవడం కష్టమేమరి.
లావేరు:సాధారణ ఉద్యోగి మొదలుకొని... రైతులు... రోజువారీ కూలీలు జూన్‌నెల వచ్చిందంటే చాలు హడలెత్తిపోతున్నారు. గతం కంటే ఈ నెలలో మొదలయ్యే వ్యవసాయ పనులు, విద్యా సంబంధ ఫీజులు, పుస్తకాల ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. ఈ నెలలోనే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ తరుణంలోనే తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుంది. పిల్లలకు స్కూల్ యూనిఫాంలు, బ్యాగులు, పుస్తకాలు, క్యారేజీలు, ఫీజులతో ాటు, ఇంకా అనేకరకాల ఖర్చులుంటాయి. మామూలు ప్రైవేటు పాఠశాలల్లోనే ఎల్‌కేజీ స్థాయి విద్యార్థికి వేలల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటే ఇక కార్పొరేట్ స్కూళ్లలో చదివించేవారికి ఏమేరకు ఆర్థిక సమస్య ఉంటుందన్నది వేరే చెప్పనవసరం లేదు. ఈ ఏడాది పాఠశాలల్లోనూ అమాంతంగా ఫీజులను కూడా పెంచేశారు. దీంతో ఆ భారమంతా తల్లిదండ్రులపైనే పడుతోంది.
రైతులకు ఖరీఫ్ సాగు భారం
ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యేది జూన్ నెలలోనే. వ్యవసాయానికి ఇది పెట్టుబడులకాలం. ఎరువులు, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, కూలీల రేట్లు కూడా పెరగడంతో వ్యవసాయపెట్టుబడులు రెట్టింపయ్యాయి. ఒకవైపు వ్యవసాయానికి మదుపుల కోసం పెట్టుబడులు సమకూర్చుకోవాలి, మరోపక్క పిల్లల చదువులకు ఫీజుల కోసం ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. ఈ పరిస్థితులనుంచి గట్టెక్కడానికి రుణాల కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిందే.
వ్యాధులొస్తాయి...
రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణంలో మార్పులు వచ్చి జూన్ నెలలోనే వర్షాలు పడుతుంటాయి. వాతావరణంలో వచ్చే మార్పులు, వర్షాల వల్ల విషజ్వరాలు, మలేరియా, డయేరియా, పచ్చకామెర్లు, డెంగ్యూ, వ్యాధులు ప్రబలే అవకాశాలు ఈ నెలలోనే ఎక్కువగా ఉంటాయి. వ్యాధులు ప్రబలితే వేలల్లో ఖర్చు కావడంతో ప్రజలు ఈ నెల అంటేనే భయపడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు పరీక్షల పేరుతో వేలల్లో డబ్బును గుంజేస్తుండటంతో వ్యాధులు వస్తే చాలు అంతా హడలెత్తిపోతున్నారు.
ఉద్యోగులకు బదిలీలు జూన్‌లోనే.
ఉద్యోగులకు బదిలీలు జరిగేది ఎక్కువగా ఈ నెలలోనే. సాధారణంగా అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఈ నెలలోనే బదిలీలు జరుగుతుంటాయి. వారంతా బదిలీలు ప్రాంతానికి వెళ్లేందుకు అవసరమైన రవాణా ఖర్చులు రెట్టింపవుతున్నాయి. చదువుకునే పిల్లలుంటే వారిని వేరే చోట స్కూళ్లకు మార్పించాల్సిందే. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నదే. ఇన్ని సమస్యలతో సగటు జీవి జూన్ నెల అంటేనే భయపడిపోతున్నాడు.