శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు విడుదల చేసిన మార్గదర్శకాలు విభిన్నంగా ఉండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఒక చోట ఉన్న సీనియారిటీ, ఇతర అప్షన్లు వంటి ప్రమాణాల ఆధారంగా బదిలీలు జరిగేవి, ఈ సారి బదిలీల నిబంధనల్లో కమిటీలకు ప్రదాన్యమివ్వడంతో రాజకీయ జోక్యానికి పెద్దపీట వేసినట్టయింది. ఇప్పటికే జిల్లాలో మంత్రి ఒక సందర్భంలో మాట్లాడుతూ బదిలీల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకుల సిఫార్సులకే ప్రాధాన్యం ఉంటుందని, తమకు అనుకూలమైన వారినే నియమించుకోవాలని ఇదివరకే సూచించారు. దీనిని బట్టి బదిలీల్లో రాజకీయ పైరవీలు, సిఫార్సులు ఆధికంగా ఉంటాయని స్పష్టమౌతోంది. ఈసారి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత వీరి బదిలీలు చేయలేదు.
ఇక ఆడిట్, ఖజానా శాఖఉద్యోగులకు ఈ బదిలీల్లో మినహాయింపునిచ్చారు. వీరి శాఖల్లో ఎలక్ట్రానిక్ పేమెంటు విధానం, కంప్యూటరీకరణ, ఇతర సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తరువాత వారికి తలెత్తే అవకాశం లేకుండా ఉండేందుకే బదిలీల నుంచి మినహాయింపు నిచ్చినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఖజానాశాఖ సిబ్బంది మూడేళ్లుగా బదిలీలకోసం ఎదురు చూస్తున్నారు. ఈ సారి బదిలీల ప్రక్రియపై ఉద్యోగ సంఘాల నాయకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీల పేరిట రాజకీయ ప్రమేయాన్ని పెంచుతున్నారని, పరిపాలనా సౌలభ్యం పేరిట ఇష్టంలేనివారిని, వారికి అనుకూలంగా లేనివారిని అక్రమంగా బదిలీలు చేసేందుకు ఈ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని వారు విమర్శిస్తున్నారు.
నాయకుల చుట్టూ ప్రదక్షిణలు
ఈసారి బదిలీల్లో కీలకంగా రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలు ఉంటాయి. ఈ శాఖలతో నాయకులకు, ప్రజలకు ఎక్కువగా పనులు ఉండడంతో ఈ శాఖల్లో బదిలీలకు ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే టీడీపీ కార్యకర్తల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు ప్రారంభించారు. ముఖ్యంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వీఆర్‌ఓ, తహశీల్దార్ల బదిలీలకు గిరాకీ ఉంది. గత ఏడాది జరిగిన బదిలీల్లో జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుల పీఏలు కీలక పాత్ర పోషించారు. యూనియన్ ఆఫీస్ బేరర్లను సైతం నిబంధనలకు విరుద్ధంగా బదిలీచేసి వారి పంతం నిలబెట్టుకున్నారు. అదే పరిస్థితి పంచాయతీ రాజ్ శాఖలో జరిగింది. అప్పట్లో మిగిలిపోయినవారికి ఈ సారి స్థాన చలనం తప్పేట్టు లేదు. అందుకోసం నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటినుంచే వారిచుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు.
పైరవీలకే పెద్దపీట
Published Wed, May 20 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement