
సాక్షి, హైదరాబాద్: జోనల్ విధానం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నిచోట్లా తీవ్ర వివాదాస్పదమైన స్పౌజ్, పరస్పర బదిలీలకు అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం అవసరమైన సమాచారం తెప్పించింది. ఉపాధ్యాయ సంఘాలకు ఈ మేరకు సీఎంవో నుంచి హామీ లభించినట్టు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో జీవో విడుదల చేసే వీలుందని అధికార వర్గాలు కూడా తెలిపాయి. భార్యాభర్తలు ఒకేచోట పనిచేసే విధంగా చూస్తామని 317 జీవో సందర్భంగా విద్యాశాఖ భరోసా ఇచ్చింది.
అయితే జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేటాయింపుల సందర్భంగా ఈ సమతూకం కుదరలేదు. స్పౌజ్ బదిలీలపై విడుదల చేసిన కొన్ని మార్గదర్శకాలు ఆటంకంగా మారాయి. భార్య రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే.. భర్త కేంద్ర ఉద్యోగిగా ఉన్న కేసులూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో స్పౌజ్ కేసులు అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. అధికారిక సమాచారం మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు 1,110, ఇతరులు 1,458 కలిపి మొత్తం 2,568 మంది స్పౌజ్ కేసుల కింద తమను ఒకేచోట ఉంచాలని పట్టుబట్టారు. అయితే ఈ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం 13 జిల్లాల్లో బదిలీలు నిలిపివేయడంతో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో వీటిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది.
‘సీనియారిటీ బదిలీ’ల్లోనూ వెసులుబాటు
సీనియారిటీ ప్రకారంగా జరిగిన బదిలీల విషయంలోనూ కొంత వెసులుబాటు ఇవ్వాలని నిర్ణయించారు. కోరుకున్న ప్రదేశానికి వచ్చేందుకు మరో టీచర్ అంగీకరిస్తే పరస్పర బదిలీలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించనుంది. పరస్పర బదిలీలు, స్పౌజ్ కేసులపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయం తమకు తెలిపిందని పీఆర్‌టీయూ టీఎస్ నేతలు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment