జీవో 317 ప్రస్తుతం ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను కలవరపెడుతున్న అంశంగా మారింది. ఏ స్థానికత కోసమని, సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామో, అదే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క జీవోతో వారి స్థానికత ప్రశ్నార్థకంగా మారింది. సీనియారిటీని ప్రామాణికంగా తీసుకుని స్థానిక తను విస్మరించి ఈ జీవోని అమలు చేయాలని ప్రయ త్నించిన కారణంగా సీనియర్ ఉపాధ్యాయులంతా మెరుగైన సదుపాయాలు, అభివృద్ధి ఉన్న జిల్లాల్లో పని చేసే అవకాశం పొందుతారు.
అదే సమయంలో జూని యర్లంతా వెనుకబడిన ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది. ఫలితంగా జూనియర్లు బదిలీ అయిన జిల్లాల్లో రెండు, మూడు దశాబ్దాల పాటు కొత్త కొలు వులు ఏర్పడే అవకాశం ఉండదు. ఇదే జరిగితే ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల నుండి తీవ్రమైన నిరసనలు ప్రభుత్వం ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు.
ఉదాహరణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పరి గణనలోకి తీసుకుంటే... మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలను సీనియర్ ఉపాధ్యాయులు ఎక్కువగా కోరుకోవడంతో... జూనియర్ ఉపాధ్యాయులు/ ఉద్యో గుల కేటాయింపులు అధిక సంఖ్యలో కొమురం భీమ్ ఆసిఫాబాద్‌కి జరిగాయి. దీంతో అక్కడ 20 నుండి 25 సంవత్సరాల పాటు కొత్త ఉద్యోగాలు ఏర్పడవు. అందువల్ల ఇప్పటికే ఆ జిల్లాలో నిరుద్యోగుల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
317 జీవోను ఇంత హడావిడిగా అమలు చేయడానికి ప్రయత్నించడంతో అనేక నష్టాలు కలుగు తున్నాయి. తుది సీనియారిటీ జాబితాలు ప్రకటించి, వాటిపై అభ్యంతరాలను స్వీకరించకుండానే కేటాయిం పులు జరపడం వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు వారి సీనియారిటీకి వ్యతిరేకంగా వేరే జిల్లాకు వెళ్లవలసి వచ్చింది. కేటాయింపులపై జిల్లా స్థాయిలో వందలాది అభ్యంతరాలు రావడం, న్యాయపరమైన అభ్యంతరా లను సరి చేసే అవకాశం జిల్లా స్థాయిలో/జోన్ స్థాయిలో ఉన్న అధికారికి లేకపోవడం మూలంగా... అనేకమంది ఉద్యోగ, ఉపాధ్యాయులు చేయని తప్పుకు బలయ్యారు.
మారుమూల ప్రాంతాలకు బలవంతంగా బదిలీ అయ్యారు. వీరు పూర్వం పనిచేస్తూ ఉన్న ప్రదే శాలను ఖాళీగా చూపి ఇటీవలే జిల్లాకు కేటాయించిన ఉద్యోగ, ఉపాధ్యాయులతో భర్తీచేయడం మూలంగా... న్యాయపరమైన అప్పీలు చేసుకున్న ఉద్యోగ, ఉపా ధ్యాయులకు విచారణలో అన్యాయం జరిగిందని గుర్తించినచో... వారికి తిరిగి వారి ప్రాధాన్యత ప్రకారం పూర్వం పని చేస్తున్న జిల్లాకు కేటాయించే అవకాశం ప్రభుత్వం కల్పించాలి. అలా అవకాశం కల్పించకపోతే మరింతమంది కోర్టులను ఆశ్రయిస్తారు.
దంపతులకు ఒకే జిల్లా కేటాయిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, తాను తీసుకున్న అనాలోచిత, హడావుడి నిర్ణయం కారణంగా 13 జిల్లాలో ఉపాధ్యాయుల స్పౌస్ బదిలీలను బ్లాక్ చేయా ల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అలాగే మారుమూల ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతంలో అదే ప్రాంతంలోని స్థానికులుగా ఉన్న నిరుద్యోగులకు అవకాశం కల్పిం చడం వల్ల వారికి భాష అవరోధం ఉండకుండా సొంత ప్రాంతం అభివృద్ధికి పాటు పడతారు అనే అభి ప్రాయం వల్ల ఏజెన్సీ, మైదాన ప్రాంతాలుగా వర్గీకరణ చేసిన తరువాతే ఉపాధ్యాయుల నియామకాలు వేర్వేరుగా చేపడుతున్నారు.
కానీ ప్రస్తుత కేటాయిం పులలో ఏజెన్సీ, మైదానం అన్న భావనలు విస్మరిం చడం మూలంగా స్థానికత విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. వితంతువు, వికలాంగులకు కేటాయిం పులలో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వారిపట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంతో అనేకమంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరికొందరు గుండె ఆగి మరణిస్తున్నారు.
కొన్ని జిల్లా స్థాయి పోస్టులను జోనల్ స్థాయిలోకి మార్చితే రాబోయే కాలంలో తిరిగి వారి అభీష్టం మేరకు జిల్లా లేదా జోన్‌కి రాగలం అన్న ఆశ సజీవంగా ఉండేది. ఇంతగా వేతన జీవులు విగత జీవులుగా మారే దయనీయ స్థితి తలెత్తేది కాదు. ప్రభుత్వం 317 జీవోపై ఈ అన్ని సంగతులనూ దృష్టిలో ఉంచుకొని పునరాలోచిస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
– జి. శ్రీనివాస్, ఉపాధ్యాయులు
Comments
Please login to add a commentAdd a comment