తెలంగాణ మ్యాప్
ఢిల్లీ: తెలంగాణ కొత్త జోన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఏడు జోన్లకు, రెండు మల్టీ జోన్లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కొత్త జోన్ల ఆమోదం కోసం ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెల్సిందే. రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి, కేంద్ర హోంమంత్రి, ఆర్థిక మంత్రులను కూడా కలిశారు. తెలంగాణ ఏర్పడినప్పటికీ ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న జోనల్ వ్యవస్థ అవరోధంగా ఉందని ముఖ్యమంత్రి మొదటి నుంచి భావించారు. దానికి అనుగుణంగా జోనల్ వ్యవస్థలో మార్పులకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగానే 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణాను 31 జిల్లాలుగా చేసి స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల స్థానిక యువకులు ఎక్కువ అవకాశాలు పొందుతారని సీఎం భావించారు.
కొత్త జోనల్ విధానం ఇదీ...
తెలంగాణలో ప్రస్తుతమున్న రెండు జోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పడతాయి. అందులో మొదటి నాలుగు జోన్లను ఒక మల్టీజోన్‌గా మిగిలిన మూడు జోన్లను రెండో మల్టీజోన్‌గా పరిగణిస్తారు. మరోవైపు ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువులో వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు.
ప్రతిపాదిత 7 జోన్లు ఇవీ...
కాళేశ్వరం జోన్..
జిల్లాలు: భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జనాభా: 28.29 లక్షలు.
బాసర జోన్...
జిల్లాలు: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనాభా: 39.74 లక్షలు.
రాజన్న జోన్...
జిల్లాలు: కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జనాభా: 43.09 లక్షలు.
భద్రాద్రి జోన్...
జిల్లాలు: వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనాభా: 50.44 లక్షలు
యాదాద్రి జోన్...
జిల్లాలు: సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, జనాభా: 45.23 లక్షలు
చార్మినార్ జోన్...
జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, జనాభా: 1.03 కోట్లు
జోగుళాంబ జోన్...
జిల్లాలు: మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్, జనాభా: 44.63 లక్షలు.
మల్టీజోన్ల పరిధిలోకి వచ్చే జోన్లు...
1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి
2. యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ.
అనేక సమస్యలకు పరిష్కారం...
కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడటంతో జిల్లా పోస్టులే కాదు మల్టీజోన్ పరిధిలోకి తెచ్చేలా నిర్ణయించిన 34 రకాల కేటగిరీ పోస్టుల్లో మరో 21 రకాల జోనల్ కేటగిరీ పోస్టులు 95 శాతం స్థానికులకే దక్కనున్నాయి. జోనల్ విధానానికి అనుగుణంగా రాష్ట్రం, జోన్, జిల్లాస్థాయి పోస్టుల వర్గీకరణకు మార్గం సుగమం అయింది. జిల్లా, జోనల్ స్థాయిలో స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు లభించడమే కాదు రాష్ట్రస్థాయి పోస్టుల విధానం తొలగింపు కారణంగా కీలకమైన ఆ పోస్టులు ప్రస్తుతం జోనల్ విధానంలో ఉన్న ఉద్యోగులకే పదోన్నతిపై దక్కనున్నాయి.
ప్రస్తుతం జిల్లాస్థాయి పోస్టుల్లో 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ కేటగిరీ, జోనల్‌లో 70 శాతం స్థానికులకు, 30 శాతం ఓపెన్ కేటగిరీ, మల్టీజోన్‌లో స్థానికులకు 60 శాతం, ఓపెన్ కేటగిరీలో 40 శాతం విధానం ఉంది. అయితే ప్రభుత్వం ప్రతిపాదిత కొత్త విధానంలో రాష్ట్రస్థాయి కేడర్‌నే తొలగించింది. మిగతా అన్ని కేడర్లలో స్థానికులకు 95 శాతం, ఓపెన్ కేటగిరీలో 5 శాతం రిజర్వేషన్ వర్తించేలా నిర్ణయించింది. ప్రస్తుతం నాలుగు నుంచి 10వ తరగతి వరకు నాలుగేళ్లపాటు చదివిన వారిని తెలంగాణలో స్థానికులుగా గుర్తిస్తున్నారు. ఇకపై ఒకటి నుంచి ఏడవ తరగతి దాకా వరసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికులుగా గుర్తిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment