మండల్ పాలన!
బాలారిష్టాల్లో కొత్త మండలాలు
► గాడిన పడని పాలనా వ్యవస్థ
► సిబ్బంది సరిపడా లేక అవస్థ
► ప్రతి పనికీ మాతృ మండలమే దిక్కు
► చుక్కలు చూపిస్తున్న ‘రెవెన్యూ పనులు’
► తహసీల్దార్ మినహా మిగతా పోస్టులు ఖాళీ
► కూర్చోవడానికి కుర్చీలూ కరువే..
మండలస్థాయిలో పాలన ఇంకా గాడిన పడలేదు. కొత్త మండలాలు పురుడు పోసుకున్నా.. పరిపాలన మాత్రం పక్క మండలాల నుంచే సాగుతోంది. దసరా రోజున ఘనంగా ప్రారంభమైన నూతన మండలాల్లో ఇంకా పూర్తిస్థాయిలో యంత్రాంగం కొలువుదీరలేదు. దీంతో రెవెన్యూ రికార్డులన్నీ మాతృ మండలాల్లోనే భద్రపరచడంతో ప్రతి ఫైలుకు పాత మండలంపైనే ఆధారపడాల్సి వస్తోంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆరు తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పడ్డాయి.
నందిగామ, చౌదరిగూడ, అబ్దుల్లాపూర్‌మెట్, గండిపేట, బాలాపూర్, కడ్తాలలు కొత్త మండలాలు. ఇవి అక్టోబర్ 11న విజయదశమి నాడు కొత్త జిల్లాలు ఆవిర్భవించిన రోజునే లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అయితే, బాలారిష్టాలు మాత్రం ఇప్పటికీ అధిగవిుంచలేదు. – సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
కొత్త మండలాల్లో ఇదీ పరిస్థితి..
♦ కడ్తాల్: డిప్యూటీ తహసీల్దార్ (డీటీ), సర్వేయర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. తహసీల్దార్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. వ్యవసాయ శాఖకు కార్యాలయం లేదు. తహసీల్దార్ కార్యాలయంలోనే కొనసాగుతోంది.
♦ చౌదరిగూడెం: సర్వేయర్ పోస్టు ఖాళీగా ఉంది. మిగిలిన పోస్టులు భర్తీ అయ్యాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త మండలాల్లో పూర్తిస్థాయిలో తహసీల్దార్లు కొలువుదీరినా.. మిగతా పోస్టులు మాత్రం దాదాపు అన్నిచోట్ల ఖాళీగానే ఉన్నాయి. జిల్లాల పునర్విభజనకు ముందే ప్రతి ఫైలును జిల్లా యంత్రాంగం స్కానింగ్ చేసింది. ఈ రికార్డులని్నంటినీ మాతృ జిల్లా, మండలాల్లో భద్రపరిచింది. స్కాన్ చేసిన పహాణీ తదితర రికార్డులను చూసుకునే వెసులుబాటును రెవెన్యూ అధికారులకు కల్పించింది. ఇది ఒకింత మంచిదే అయినా.. అర్జీదారులకు మాత్రం చుక్కలు చూపుతోంది.
ఏదైనా పనికి దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ ఉద్యోగులు పాత మండలాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. స్కాన్ కాపీలను చూసి ఫైలును ప్రతిపాదించలేమని అధికారులు తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రికార్డుల కోసం పాత ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. దీంతో సమయమంతా వృథా కావడంతో అర్జీదారులు లబోదిబోమంటున్నారు. దీనికితోడు పరిపాలనాపరంగా సాంకేతిక సమస్యలు కూడా ఎదురవుతున్నాయి.
అరకొర సిబ్బంది..
ఇబ్బడిముబ్బడిగా నయా మండలాలు ఏర్పడడం.. తగినంత సిబ్బంది లేకపోవడంతో పరిపాలనపై తీవ్రప్రభావం చూపుతోంది. చాలావరకు కొత్త మండలాల్లో సిబ్బందిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా.. పలు మండలాల్లో పూర్తిస్థాయి యంత్రాంగం కొలువుదీరలేదు. దీంతో నూతన మండలాల పరిధిలో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ముఖ్యంగా సర్వేయర్లు అందుబాటులో లేక భూముల సర్వే నిలిచిపోతోంది. తహసీల్దార్ కార్యాలయాల్లో అరకొర సిబ్బంది ఉండగా.. ఇక ఎంఈఓ ఆఫీసులు మొదటి రోజుతోనే మూతపడ్డాయి. కొత్త మండలాల పరిధికి అనుగుణంగా కొత్త పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు. ఇవి మాత్రం బాగానే పనిచేస్తున్నా.. కేసు నమోదు అధికారం మాత్రం పాత ఎస్‌హెచ్‌ఓల వద్దే ఉంది. వ్యవసాయ అధికారులు మాత్రం తహసీల్దార్ భవనంలోనే ఒక మూలకు విధులు నిర్వర్తిస్తున్నారు.
అత్తెసరు ఫర్నిచర్..
కార్యాలయ నిర్వహణకు కొంతమేర నిధులు సర్దుబాటు చేసినా.. చాలా దఫ్తార్లలో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా ఫర్నీచర్ ఉండాలి. కానీ, ఆ పరిస్థితి ఆఫీసుల్లో కనిపించడంలేదు. ఎవరైనా వస్తే కూర్చోవడానికి కొన్ని కార్యాలయాల్లో కుర్చీలు సైతం లేవు.
కొత్త మండలాల్లో ఇదీ పరిస్థితి..
♦ నందిగామ: తహసీల్దార్, డిటీ, సీనియర్ అసిస్టెంట్ తప్ప రెండు ఆర్‌ఐ, జూనియర్ అసిస్టెంట్, సర్వేయర్, టైపిస్ట్, మూడు సబార్డినేట్ పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
♦ బాలాపూర్ : మండలంలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. తహసీల్దార్, డీటీ, సర్వేయర్లు విధుల్లో కొనసాగుతున్నారు
♦ అబ్దుల్లాపూర్‌మెట్: మండలంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ.
♦ గండిపేట: మండలంలో సర్వేయర్, ఒక ఆర్‌ఐ పోస్టు ళాళీగా ఉంది. తహసీల్దార్ ఉన్నప్పటికీ రాజేంద్రనగర్‌కు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు మండలాలకు కలిపి ఒక సర్వేయర్ పనిచేస్తున్నాడు. గండిపేట మండలానికి సంబంధించిన రికార్డులన్నీ రాజేంద్రనగర్ కార్యాలయంలోనే ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.