♦ ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
♦ మార్పులు, చేర్పులపై సూచనలు అడిగిన సీఎం
♦ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండాలని సూచన
♦ ఇక పక్కాగా నిజామాబాద్, కామారెడ్డి రెండు జిల్లాలు
♦ కొత్త మండలాలు పదే.. బాన్సువాడ రెవెన్యూ డివిజన్..
♦ కలెక్టర్ ప్రతిపాదనలకు ఓకే అన్న ప్రజాప్రతినిధులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రశేఖర్‌రావు ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టతనిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు అంశాలను సమీక్షించారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కొత్తగా ఏర్పడే బాన్సువాడ రెవెన్యూ డివిజన్, 10 మండలాలు, కామారెడ్డి జిల్లాపై చర్చ జరిగింది. కొద్దిపాటి మార్పులు, చేర్పులను ప్రజాప్రతినిధులు సూచించినా.. మొత్తంగా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అధికార యంత్రాంగంతో కసరత్తు చేసి ఇచ్చిన నివేదికకు ప్రజాప్రతినిధులు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. దసరా నుంచే కొత్త జిల్లాల ఏర్పాటు, పరిపాలన ప్రారంభం అవుతుందని ఉద్ఘాటించారు. జిల్లాల పునర్విభజన స్పష్టంగా ఉండాలని, పేర్కొన్న సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించినట్లు తెలిసింది.
అధికారులకు సహకరించాలని సూచన
టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించిన అనంతరం దసరా నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం అవుతుందని సూచించినట్లు ప్రజాప్రతినిధులు కొందరు ‘సాక్షి’కి తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు, పునర్విభజన ప్రక్రియపై జరుగుతున్న కసరత్తు, మార్పులు, చేర్పులకు సంబంధించిన తుది నిర్ణయాలను సీఎం ప్రకటించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లా ఏర్పాటు జరుగనుంది. దీనికి సంబంధించి కలెక్టర్ యోగితారాణా అందించిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ వెల్లడించగా, దాదాపుగా ప్రజాప్రతినిధులు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. అంతే కాకుండా రెండు జిల్లాలకు సంబంధించి మెదక్ జిల్లా మంత్రులు, నిజామాబాద్ జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు పరస్పరం అంగీకారం తెలిపారు.
దీంతో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి వినతులు, పరిశీలనలు లేకుండా పోయాయి. రాష్ట్రంలో 14 కొత్త జిల్లాలు, 74 మండలాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉండగా, ఒక్కో జిల్లాకు సగటున 20 మండలాలు ఏర్పాటు కానున్నాయి. దీని పరంగా నిజామాబాద్ జిల్లాలో కొత్తగా పది మండలాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కలెక్టర్ రూపొం దించిన నివేదికలు కూడా ఆమోదం పొంది నట్లు సమాచారం. దీంతో ఏలాంటి పునపరిశీలన లేకుండా మండలాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ముసాయిదా వెల్లడి, అభిప్రాయాల సేకరణ ఇక లాంఛనమే కానుంది. జిల్లాల ఏర్పాటులో జిల్లా కేంద్రానికి సంబంధించి దగ్గరగా ఉన్న మండలాలు, నియోజకవర్గాలను పాత జిల్లాలోనే కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు దగ్గరగా ఉన్న మండలాలు జిల్లాలోనే కొనసాగే అవకాశం ఉంది. నియోజక వర్గాలు ఇదే తీరులో కొనసాగే అవకాశం ఉంది. ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతాలను పట్టణాలుగా, అర్బన్ మండలాలుగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.
బాన్సువాడ రెవెన్యూ డివిజన్
జిల్లాలో బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌గా అవకాశం ఉంది. ఇదివరకే ప్రతిపాదనలు వెల్లగా దీనికి సీఎం అంగీకరించినట్లు తెలిసింది. బాన్సువాడ ఒక్కటే రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కానుంది. దీంతో కొంత కాలంగా జిల్లాలో కామారెడ్డి జిల్లా ఏర్పాటు అందులో ఏఏ ప్రాంతాలు వెలుతాయోనని అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. పునర్విభజనకు సీఎం అంగీకారం తెలుపడంతో కామారెడ్డి జిల్లాకు నాలుగు నియోజకవర్గాలతో పునర్ విభజన చేపట్టగా దీనికి స్పష్టమైన ఆమోదం లభించింది. నిజామాబాద్ జిల్లాలో ఐదు నియోజకవర్గాలతో కొనసాగనుంది. అయితే మండలాల్లో కొద్దిపాటి మార్పులను ప్రజాప్రతినిధులు కోరినట్లు తెలిసింది.
ఈ మేరకు కొత్తగా ఏర్పడే మండలాలు నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ రూరల్, మోపాల్, రుద్రూరు, కామారెడ్డి రూరల్ (దేవునిపల్లి), రామారెడ్డి, ఆలూరు, రెంజర్ల, బోధన్ రూరల్, ఇందల్వాయిలు ఉంటాయి. కాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు మండలాల ఏర్పాటు పునర్ విభజనకు సంబంధించి మార్పు చేర్పులపై సలహాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులను ఆదేశించారు. అభివృద్ధికి సంబంధించి ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు సలహాలు, సూచనలు అందించాలని కోరినట్లు తెలిసింది. ముఖ్యంగా స్థానిక ప్రజలకు ఆ ప్రాంతం ఎక్కడ ఉండాలో గుర్తించి ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటుందో తెలుసుకొని వారికి అన్యాయం జరుగకుండా సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రజాప్రతినిధులు పాటుపడాలన్నారు. చిన్న జిల్లాలతో పరిపాలన బాగుంటుందని పేద కుటుంబాలను గుర్తించి అభివృద్ధిలోకి తీసుకురావాలని జిల్లా కేంద్రాలన్ని అభివృద్ధి కేంద్రాలుగా మారాలని కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రణాళికలు రూపొందించలన్నారు. అదే విధంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చే విమర్శలను పట్టించుకోవద్దని, ఈ విషయంలో అధికారులకు సహకరించాలని సూచించినట్లు సమాచారం.