సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో కొత్త జోన్లు, సర్కిళ్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. 15 వేలకు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా, మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరిపాలనలో వికేంద్రీకరణ సూత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం బలంగా నమ్ముతోందని, దీని ద్వారా ప్రజలకు పథకాలు మరింత వేగంగా చేరతాయని చెప్పారు.
సోమవారం సచివాలయంలో తెలంగాణ మునిసిపల్ కమిషనర్ల సంఘం డైరీని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, పురపాలనలో ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టామని, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని కేటీఆర్ తెలిపారు. పట్టణ ప్రాంతాలకు రక్షిత నీటి సరఫరా కోసం అర్బన్ మిషన్ భగీరథ పథకం కింద రూ.4,500 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.
ప్రభుత్వ సంస్కరణల అమలులో మునిసిపల్ కమిషనర్లు కీలక పాత్ర వహించాలని కోరారు. కమిషనర్లు తాము పని చేస్తున్న పట్టణాలపై ప్రత్యేక ముద్ర వేయాలని, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ ఏడాది పలు పథకాలు కీలక దశకు చేరుకున్నాయని, వాటిని పూర్తి చేసే దిశగా పని చేయాలని ఆదేశించారు. మునిసిపల్ కమిషనర్లకు పద్నోతులు, ఖాళీల భర్తీ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘ఔటర్’ లోపల కొత్త పురపాలికలు
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపలి గ్రామ పంచాయతీలను పురపాలికలుగా మార్చేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. ఓఆర్‌ఆర్ లోపల ప్రస్తుతం 167 గ్రామాలున్నాయని, వాటి భౌగోళిక పరిస్థితుల ప్రకారం కొత్త పురపాలికలుగా మారుస్తామని, లేదంటే ఇతర పురపాలికల్లో విలీనం చేస్తామని చెప్పారు. అమీన్‌పూర్, బొల్లారం, కొంపల్లి, పుప్పాలగూడ, ప్రగతినగర్, తెల్లాపూర్, కొల్లూర్, తుర్కయాంజాల్ సహా మరికొన్ని గ్రామాల ను కొత్త పురపాలికలుగా ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నామన్నారు.
కొత్త పురపాలికల ఏర్పాటుపై పురపాలక, పంచాయతీరాజ్ శాఖాధికారులు.. రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, సంగారెడ్డి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నగర ఎమ్మెల్సీలు, ఎంపీలు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో సోమవారం సచివాలయంలో మంత్రి సమావేశం నిర్వహించారు. 15 వేలకు మించి జనాభా ఉన్న పంచాయితీలను నగర పంచాయతీలు, మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేటీఆర్ తెలిపారు. పురపాలికల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.
పురపాలికల ఏర్పాటు తర్వాత కనీసం రెండేళ్లు పన్ను పెంపు ఉండదని చెప్పారు. కొత్త పురపాలికలకు ప్రభుత్వ నిధులూ కేటాయిస్తామన్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోందని, ఇళ్ల నిర్మాణంలో కొత్త పురపాలికలనూ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. స్థానిక ప్రజాప్రతనిధులను సమన్వయం చేసుకొని పరిస్థితుల మేరకు పురపాలికల ఏర్పాటు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదనల రూపకల్పనకు స్థానిక ఎమ్మెల్యేలతో కలసి పని చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment