సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జోన్లు, మల్టీ జోన్ల ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలవడంతో పోలీస్ శాఖలోనూ కొత్త రేంజ్‌ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొత్తగా 3 రేంజ్‌ల ఏర్పాటుతో పాటు ప్రస్తుతమున్న 4 రేంజ్‌ల పేర్లు మారనున్నాయి. దీంతో మొత్తంగా 7 రేంజ్‌లు ఏర్పాటు కాబోతున్నాయి. కొత్త రేంజ్‌ల ఏర్పాటుతో ఎస్సై, సీఐల బదిలీల పరిధి కూడా పెరగనుంది.
ప్రస్తుతం 2 జోన్లు, 4 రేంజ్‌లు
రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ జోన్లున్నాయి. వీటి కింద 4 రేంజ్‌లు కొనసాగుతున్నాయి. వరంగల్ జోన్ కింద వరంగల్, కరీంనగర్ రేంజ్‌లు ఉండగా.. హైదరాబాద్ జోన్‌లో నిజామాబాద్, హైదరాబాద్ రేంజ్‌లు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను కరీంనగర్ రేంజ్.. వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాను వరంగల్ రేంజ్ పర్యవేక్షిస్తూ వస్తోంది. హైదరాబాద్ రేంజ్ కింద నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీస్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు ఉన్నాయి. నిజామాబాద్ కింద నిజామాబాద్, మెదక్ జిల్లాలున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటుతో..
రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ వల్ల 31 జిల్లాలు ఏర్పడటంతో రేంజ్‌ల ఏర్పాటు కూడా తప్పనిసరిగా మారింది. పాత 4 రేంజ్‌లతో పాటు కొత్తగా 3 రేంజ్‌లు ఏర్పాటు కాబోతున్నాయి. ఒక్కో రేంజ్ కింద 4 నుంచి 5 జిల్లాలు పర్యవేక్షణలో ఉండనున్నాయి. పాత రేంజ్‌ల పేర్లు గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం మార్పు చెందడంతో కొత్త రేంజ్‌ల ఏర్పాటు, వాటి కార్యాలయాలు, సిబ్బంది కేటాయింపులపై త్వరలోనే పోలీస్ శాఖ నిర్ణయం తీసుకోనుంది. వరంగల్ మల్టీ జోన్ కింద కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి రేంజ్‌లు ఉంటాయి. హైదరాబాద్ మల్టీ జోన్ కింద యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ రేంజ్‌లు ఉండనున్నాయి.
ఇప్పుడు కొత్త జిల్లాల్లోనూ..
ఉమ్మడి జిల్లాల ప్రకారం రేంజ్‌లలో పని చేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్లు, జోన్లలో పనిచేసే ఇన్‌స్పెక్టర్లు కేవలం ఆ రేంజ్‌లు, ఆ జోన్లకే పరిమితమయ్యారు. అయితే కొత్త జిల్లాలు ఏర్పాటవడం, ఆ ప్రాతిపదికన కొత్త రేంజ్‌లు వస్తుండటంతో సబ్ ఇన్‌స్పెక్టర్లు పాత రేంజ్‌లలోని జిల్లాలే కాకుండా కొత్త రేంజ్‌లలోని జిల్లాల్లోనూ పని చేసేందుకు మార్గం సుగమమైంది. ఇన్‌స్పెక్టర్లు కూడా జోన్‌లోకి కొత్తగా వస్తున్న జిల్లాల్లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా పోస్టింగ్ పొందనున్నారు.
ఉదాహరణకు ఇదివరకు పాత కరీంనగర్ రేంజ్‌లో పనిచేసే సబ్ ఇన్‌స్పెక్టర్ ఆదిలాబాద్ లేదా కరీంనగర్ రేంజ్‌లోనే పనిచేయాల్సి వచ్చేది. ఇప్పుడు బాసర రేంజ్ కింద నిజామాబాద్ జిల్లా కూడా చేరడంతో ఆ జిల్లాలోనూ పనిచేయొచ్చు. ఇన్‌స్పెక్టర్లు కూడా పోస్టింగ్ పొందే అవకాశం లభించింది. సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, కరీంనగర్‌లలో ఎక్కడైనా పనిచేసే అవకాశం లభించింది. స్థానిక నియోజకవర్గం, సొంత జిల్లాలో కాకుండా రేంజ్‌లోని ఇతర ప్రాంతాల్లో పనిచేసే వెసులుబాటు కొత్త రేంజ్‌ల వల్ల కలిగింది.
కొత్త రేంజ్‌లు.. వాటి పరిధిలోని జిల్లా పోలీస్ యూనిట్లు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, రామగుండం కమిషనరేట్
బాసర: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ కమిషనరేట్, జగిత్యాల
రాజన్న: కరీంనగర్ కమిషనరేట్, సిద్దిపేట కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్
భద్రాద్రి: కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం కమిషనరేట్, మహబూబాబాద్, వరంగల్ కమిషనరేట్
యాదాద్రి: సూర్యాపేట, నల్లగొండ, రాచకొండ పోలీస్ కమిషనరేట్
చార్మినార్: హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, సంగారెడ్డి
జోగుళాంబ: మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్
డీఐజీల సంగతేంటి?
ప్రస్తుతమున్న 4 రేంజ్‌లలోనే డీఐజీలను నియమించకుండా ఇద్దరు అధికారులపై అదనపు భారం వేసి ప్రభుత్వం నెట్టుకొస్తోంది. అలాంటిది కొత్తగా రాబోతున్న మరో 3 రేంజ్‌లకు డీఐజీలను నియమిస్తుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇన్నాళ్లూ డీఐజీ హోదా అధికారులు తక్కువగా ఉండటంతో అదనపు భారం మోపాల్సి వచ్చిందని.. కొద్ది రోజుల్లో ముగ్గురు సీనియర్ ఎస్పీలకు డీఐజీ పదోన్నతి కల్పిస్తున్నామని, వచ్చే ఏడాది మార్చిలో మరో నలుగురు డీఐజీలుగా పదోన్నతి పొందనున్నారని పోలీస్ శాఖ తెలిపింది. దీంతో కొత్త రేంజ్‌లకు డీఐజీల కొరత తీరినట్లేనని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment