
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ?
22న కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం
* యూపీ, ఉత్తరాఖండ్‌లకు మరింత ప్రాతినిధ్యం
* పనితీరు సరిగాలేని మంత్రులపై వేటు
* కోషియారి, రామేశ్వర్‌లకు అవకాశం
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే రూపుదాల్చనుంది. ఈనెల 22న ఇది జరిగే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలిపాయి.
ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లోకి కొత్తగా తీసుకునే వారిలో ఉత్తరాఖండ్‌కు చెందిన భగత్‌సింగ్ కోషియారి, అస్సాంకు చెందిన రామేశ్వర్ తెలి ఉంటారని సమాచారం. అలాగే కేంద్ర క్రీడా శాఖ మంత్రి (స్వతంత్ర హోదా)గా ఉన్న శర్బానంద సోనోవాల్ అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఖాళీ అయిన ఆ పదవిని కొత్త వారితో భర్తీ చేసే అవకాశముంది. మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణకు ఈనెల 18-22 లోపే అవకాశముందని ఆ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే రాష్ట్రపతి విదేశీ పర్యటన ముగించుకొని ఈనెల 18న భారత్‌కు తిరిగి వచ్చే అవకాశముంది.
ఆ తర్వాత ఈనెల 23న ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశముంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఈనెల 21న ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 18 నుంచి 22వ తేదీలోపే కేబినెట్‌లో మార్పుచేర్పులకు అవకాశముందని భావిస్తున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత వ్యవస్థీకృత మార్పులు జరిగే అవకాశముంది.
ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న కొందరిపై వేటు పడే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. పనితీరు సరిగాలేని, ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైన మంత్రులను మోదీ పక్కనపెట్టవచ్చని భావిస్తున్నారు. సీనియర్ మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కారీలు తమ మంత్రిత్వ శాఖలను అట్టిపెట్టుకోనున్నారు. పెండింగ్ పనులను పూర్తిచేయడానికి వీలైనంత త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేయాలని మోదీ భావిస్తున్నారని ఆ వర్గాలు చెప్పాయి.