-
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలపై ఏకాభిప్రాయం
-
రెండు జిల్లాల ఏర్పాటు... తుది దశకు పునర్విభజన..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘పునర్విభజన’పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో శుక్రవారం జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతిని«ధులు భేటీ అయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉపసంఘం భేటీ అవుతోంది. ఇందులో భాగంగా మొదటగా శుక్రవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆడిటోరియంలో సమావేశం అయ్యారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రుల తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటల రాజేందర్ తదితరుల కమిటీ జిల్లాల పునర్విభజనపై పలు అంశాలపై చర్చించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ప్రజాప్రతినిధులతో వేర్వేరుగా నిర్వహించిన సమావేశంలో జిల్లా నుంచి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, జెడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, పాతూరు సుధాకర్‌రెడ్డి, డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, బాజిరెడ్డి గోవర్దన్, బిగాల గణేష్‌గుప్త పాల్గొన్నారు.
ఇప్పటికే పలు కమిటీలు..
సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై రెండు నెలలుగా కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ జిల్లాల ఏర్పాటు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో అధ్యయన కమిటీలు కూడా వేశారు. జిల్లాకు సంబంధించి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్‌లను అధ్యయన కమిటీ సభ్యులుగా సీఎం కేసీఆర్ నియమించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా వేర్వేరుగా జరిగే కొత్త జిల్లాల ఏర్పాటు అధ్యయనం జూన్ 2లోగా ముగించారు. జిల్లాలో జనాభా, భౌగోళిక పరిస్థితులు, నియోజకవర్గాలు, రెవెన్యూ డివిజన్లను పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. వీటిపైనా మరో రెండు మార్లు సీసీఎల్‌ఏ, చీఫ్ సెక్రటరీలు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్‌ఎల్‌పీ సమావేశం కూడా నిర్వహించి ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వాలని కోరారు. కొత్త జిల్లాలపై సీఎం నిర్ణయం, ప్రతిపాదనలకే సభ్యులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దులు, గ్రామ, మండల జిల్లా స్థాయిల్లో పునర్‌విభజనకు సంబంధించి స్వరూపాలు, మార్పులు, ప్రాంతాల వారీగా ప్రజల మనోభావాలు తెలుసుకున్నారు. ఆ తర్వాతే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఏర్పాటుకు సీఎం ఆమోద ముద్ర కూడ వేశారు. అయితే ఈ నెల 22న కొత్త జిల్లాల ఏర్పాటుపై ముసాయిదా ప్రకటించనుండగా.. ఏవైనా మార్పులు చేర్పులుంటే మాట్లాడేందుకు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులతో సబ్‌కమిటీ సమావేశాలు నిర్వహిస్తుంది.
తుదిదశకు చేరిన ‘పునర్విభజన’
జిల్లాల పునర్విభజనపై అందరి ఎజెండా ఒక్కటే. సుపరిపాలన, ప్రజలకు అందుబాటులో పాలన లక్ష్యంగా పునర్విభజన చేస్తున్నట్లు ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. వీటికి కట్టుబడే అందరి ఎజెండా ‘సుపరిపాలన’గా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సబ్‌కమిటీతో శుక్రవారం హైదరాబాద్‌లో భేటీ అయిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత, ఇతర ప్రజాప్రతినిధులు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాలతో నిజామాబాద్ జిల్లాగా... కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలు కలిపి కామారెడ్డి జిల్లాగా ఏర్పడనున్న విషయం తెలిసిందే. ఈ రెండు జిల్లాల్లో కొత్తగా ఏర్పడే 10 మండలాలు ఏర్పడనుండగా... ఏయే మండలాలు ఏ జిల్లాలో ఉండాలన్న విషయమై ఉపసంఘంలో చర్చించినట్లు తెలిసింది. బాన్సువాడ నియోజకవర్గం కామారెడ్డి జిల్లాలో ఉన్న కోటగిరి, వర్ని మండలాలను నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని మంత్రి సూచించినట్లు సమాచారం. బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో భాగంగానే జిల్లాల పునర్విభజన, కొత్త మండలాల ఏర్పాటు చేస్తుందని, అయితే ఇవన్నీ ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చూడాలని ఎంపీ కవిత సూచన చేసినట్లు తెలిసింది. సుపరిపాలన దిశగా ప్రభుత్వం ముందుగా సాగుతుందని, ఇందులో భాగంగానే పునర్విభజన జరుగుతుందని, తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా జిల్లాల పునర్విభజనపై ఉపసంఘం పలు సూచనలు చేసినట్లు సమాచారం.