విప్లవ సారథీ.. విజయీభవ  | CM YS Jagan brought revolutionary changes with good governance | Sakshi
Sakshi News home page

విప్లవ సారథీ.. విజయీభవ 

Published Sat, Apr 13 2024 5:17 AM | Last Updated on Sat, Apr 13 2024 5:17 AM

CM YS Jagan brought revolutionary changes with good governance - Sakshi

జననేత జగన్‌కు జనం దీవెన

58 నెలల్లో సమపాళ్లలో అటు సంక్షేమం...ఇటు అభివృద్ధి   

సుపరిపాలనతో విప్లవాత్మకమార్పులు తెచ్చిన ముఖ్యమంత్రివైఎస్‌ జగన్‌ 

గత ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం

తొలి కేబినెట్‌లోనే ఆవిష్కృతమైన సామాజిక విప్లవం 

మేనిఫెస్టోయే దిక్సూచిగా పాలన.. 99 శాతం హామీల అమలు 

నామినేటెడ్‌ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్‌ 

వివక్ష, లంచాలకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా పథకాల వర్తింపు 

డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు జమ 

ప్రభుత్వ పథకాల ద్వారా 11.77 నుంచి 4.19 శాతానికి తగ్గిన పేదరికం 

సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు 

ఇంటివద్దే పింఛన్, రేషన్‌ పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు 

గత 58 నెలల్లో 2.32 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు 

నాడు–నేడుతో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి 

సర్కారు బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధన 

నాడు–నేడుతో ప్రభుత్వ ఆస్పత్రులకు మహర్దశ 

సిద్ధం..సిద్ధం..అంటూ ఊరూరాసీఎం జగన్‌కు బ్రహ్మరథం 

ప్రజాస్వామ్యమంటే ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రజలే పాలకులను ఎన్నుకోవడం. ప్రజలకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి, నిబద్ధత, జవాబుదారీతనం పాలకుడికి ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే విప్లవాత్మక మార్పులతో రాష్ట్రం ప్రగతిపథంలో ఎలా దూసుకెళ్లగలదో గత 58 నెలల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరూపించారు.

సుపరిపాలనతో ప్రతి నియోజకవర్గం.. ప్రతి గ్రామం.. ప్రతి ఇంటా..  విప్లవాత్మక మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు కొనసాగాలని బలంగా కోరుకుంటున్న జనం ‘మేమంతా సిద్ధం’  అంటూ బస్సు యాత్రలో సీఎం వైఎస్‌ జగన్‌కు నీరాజనాలు పలుకుతున్నారు.

ఈ యాత్రలో జననేతను చూసేందుకు.. మాట కలిపేందుకు.. కరచాలనంచేసేందుకు.. వీలైతే ఫొటో దిగేందుకు స్కూలు పిల్లల నుంచి వృద్ధుల వరకు మండుటెండైనా.. అర్ధరాత్రయినా పోటీ పడుతుండటం ఊరూరా కనిపిస్తోంది. ఈ పరిణామంతో మరో చారిత్రక విజయం ఖాయమైందని రాజకీయ పరిశీలకులతో పాటు జాతీయ స్థాయి సర్వే సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.  

సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత 58 నెలలుగా విప్లవాత్మక మార్పులతో సుపరిపాలన అందిస్తున్నారు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 151 శాసనసభ (86.28 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాల్లో వైఎస్సార్‌సీపీ చరిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే సుపరిపాలనకు ఆయన శ్రీకారం చుట్టారు. గత పాలకులకు భిన్నంగా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో 99 శాతం అమలు చేశారు.

గ్రామ, వార్డు సచివాలయాల స్థాపన, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల నియామకాలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. కేవలం 58 నెలల్లోనే 2.32 లక్షల మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించడం గమనార్హం. ఒకే నోటిఫికేషన్‌ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారు.

దేశ చరిత్రలోనే ఇంత భారీ ఎత్తున ఉద్యోగులను నియమించడం ఇదే ప్రథమం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకూ.. పట్టణాల్లో 75 నుంచి వంద ఇళ్లకు ఒకరి వంతున 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) విధానం ద్వారా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే పెన్షన్‌ పంపిణీ చేసి చరిత్ర సృష్టించారు. 
  
ఇతర రాష్ట్రాలకు ఆదర్శం  
ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా పేదరిక నిర్మూలనకు విశేషంగా కృషి చేశారు. వివక్ష, లంచాలకు తావు లేకుండా అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పథకాలను 87 శాతం కుటుంబాలకు అందించారు. డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లను పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి.. దేశం మొత్తాన్ని మన వైపు చూసేలా చేశారు. నాన్‌ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు.

డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చారు. సంక్షేమాభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకున్న ప్రజలు వాటి ద్వారా జీవనోపాధులను మెరుగుపర్చుకున్నారు. రాష్ట్రంలో పేదరికం టీడీపీ సర్కార్‌ హయాంలో 2015–16లో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి అది 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం.  
 
ప్రగతి పథంలో ఏపీ పయనం 

అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులతో మన పిల్లలు పోటీ పడేలా విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు ఇంగ్లిష్‌ మీడియంలో బోధనను ప్రవేశపెట్టారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తూనే.. రానున్న రోజుల్లో ఐబీ సిలబస్‌ను అమల్లోకి తెచ్చేందుకు నడుం బిగించారు.  
 అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నికర నమోదు నిష్ఫత్తి రేటు 98.73 శాతానికి పెరిగింది.  
  జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెనతో నాణ్యమైన ఉన్నత విద్యనందిస్తూ.. నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇస్తున్నారు. తద్వారా 2022–23లో 1.2 లక్షల మంది క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు పొందారు. నైపుణ్యాలను మరింతగా పెంచేందుకు ఇప్పుడు ఎడెక్స్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యా రంగంపై ఉద్యోగుల జీతభత్యాలు కాకుండా రూ.74 వేల కోట్లు ఖర్చు చేశారు.  
 
ప్రభుత్వ ఆస్పత్రులకు మహర్దశ 
సర్కారు దవాఖానాల్లో నాణ్యమైన వైద్యం అందించేందుకు అనువుగా నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. అందులో 53,466 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడంతోపాటు.. చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు. ఇప్పటిదాకా 44.78 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా రూ.13 వేల కోట్ల విలువైన చికిత్సలు చేయించారు. 

ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కొత్తగా 17 కాలేజీలకు శ్రీకారం చుట్టి, ఈ విద్యా సంవత్సరంలో 5 కాలేజీలు ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 ప్రారంభం కానున్నాయి. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటింటా జల్లెడ పడుతూ.. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. 
 
పారిశ్రామికాభివృద్ధికి ఊతం 
పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా పారదర్శక విధానాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ అమల్లోకి తెచ్చారు. సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో ప్రతి ఏటా రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలవడమే అందుకు తార్కాణం. 
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే క్రమంలో.. కొత్తగా నాలుగు పోర్టులతోపాటు పది ఫిషింగ్‌ హార్బర్‌లు, మూడు ఇండ్రస్టియల్‌ కారిడార్‌లు, పది ఇండ్రస్టియల్‌ నోడ్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు.  
టీడీపీ హయాంలో రూ.32,803 కోట్లు పెట్టుబడులు వస్తే.. వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడులు రావడమే అందుకు నిదర్శనం. పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం టీడీపీ సర్కార్‌ హయాంలో 2018–19లో 22వ స్థానంలో నిలిస్తే.. ఇప్పుడు మూడో స్థానంలో నిలిచింది.  పారిశ్రామికాభివృద్ధితో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా పెరిగాయి.  
 
సాగుకు సాయం 
ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు సీఎం జగన్‌ దన్నుగా నిలిచారు. ఫలితంగా వ్యవసాయ రంగం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. దేశంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా 17 నుంచి 18 శాతం ఉంటే.. గత నాలుగేళ్లలో దేశ జీడీపీలో మన రాష్ట్ర వ్యవసాయ రంగ వాటా 36 శాతంపైగా ఉండటం విశేషం. 
విప్లవాత్మక సంస్కరణలతో అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోంది. 2021–22లో 11.23 శాతం వృద్ధి రేటుతో దేశంలో ఏపీ అగ్రగామిగా నిలవడమే అందుకు నిదర్శనం. 

సామాజిక న్యాయంలో టార్చ్‌ బేరర్‌  
సామాజిక న్యాయమంటే నినాదం కాదు.. అమలు చేయాల్సిన విధానమని సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన రోజే స్పష్టం చేశారు. కేబినెట్‌లో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఐదుగురు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు వర్గాలకే ఇచ్చారు. హోంశాఖ మంత్రిగా ఎస్సీ మహిళను నియమించారు. సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన మాయవతి, బీసీ వర్గానికి చెందిన అఖిలేష్‌ యాదవ్‌ అధికారంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న స్టాలిన్‌ కూడా ఆ వర్గాలకు కేబినెట్‌లో ఇంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని సామాజిక వేత్తలు చెబుతున్నారు.

రాజ్యసభ, శాసన మండలి సభ్యులుగా అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా నామినేటెడ్‌ పనుల్లో, పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. మహిళలకు రిజర్వేషన్‌ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చారు. గత 58 నెలలుగా సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన దన్నుతో ఆ వర్గాలు సామాజిక సాధికారత సాధించాయి.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సామాజిక న్యాయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మరో అడుగు ముందుకేశారు. రాష్ట్రంలో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలు వెరసి మొత్తం 200 స్థానాలకుగాను వంద స్థానాల్లో అంటే సగం స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులనే సీఎం జగన్‌ బరిలోకి దించారు. సామాజిక న్యాయం చేయడమంటే ఇదీ అని దేశానికే సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు చాటిచెబుతూ వస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.  
 
ఇదే పాలన కోరుకుంటున్న జనం 
ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో వైఎస్‌ జగన్‌ మార్కు పాలన కనిపిస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే.. రాష్ట్రం ప్రగతి పథంలో మరింతగా దూసుకెళ్లాలంటే విప్లవాత్మక పరిపాలన కొనసాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలు.. ప్రస్తుతం మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్రలో సీఎం జగన్‌కు జనం నీరాజనాలు పలకడం ద్వారా తమ తీర్పును ముందే వెల్లడిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇది వైఎస్సార్‌సీపీ మరో చారిత్రక విజయానికి బాటలు వేస్తుందని స్పష్టం చేస్తున్నారు. టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్‌ వంటి డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వైఎస్సార్‌సీపీ సునామీ సృష్టించడం ఖాయమని వెల్లడైంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement