ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేదనేవారికి, సంపద సృష్టించడం లేదనేవారికి, పరిశ్రమలపై అబద్దాలు రాసే వారికి ఇది పెద్ద సమాధానమే అవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఒక కధనం ప్రకారం గత మూడేళ్లలో ఆదాయపన్ను రిటర్న్ లు ఫైల్ చేస్తున్న వారిలో పెరుగుదల వివరాలు చూస్తే ఏపీ దేశంలోనే మొదటిస్థానం సాధించింది.
ఈ మూడేళ్లలో ఏపీలో 18 లక్షల మంది అదనంగా ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేశారు. ఇదేదో ఊహాగానం కాదు. కల్పిత విషయం అంతకన్నా కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ITRలపై ఇచ్చిన తాజా నివేదిక వెల్లడించిన సంగతి. ఆదాయపన్ను వసూళ్లలో అగ్రస్థానంలో ఉండే మహారాష్ట్రలో గడిచిన మూడేళ్లలో 13.9 లక్షల మంది కొత్త అస్సెసీలు పెరిగితే, ఉత్తరప్రదేశ్ లో 12.7 లక్షలు, గుజరాత్ లో 8.8 లక్షల మంది కొత్త అస్సెసీలు వచ్చారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో విచిత్రంగా ఆదాయపన్ను మదింపుదార్లు పెరగకపోగా తగ్గిందని SBI నివేదిక చెబుతోంది.
మొత్తం అన్ని రాష్ట్రాల ర్యాంకింగ్ లలో తెలంగాణ 20వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, కేరళలలో సగటున 3.4 లక్షల మందే కొత్త ఆదాయపన్ను అసెసీలు వచ్చారని ఈ నివేదిక పేర్కొంది. దీనికి కారణాలు కూడా ఈ నివేదిక విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్ లో మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమలు, సంస్థలు బాగా పెరగడం వల్లే అని అందులో స్పష్టం చేశారు.
ఏపీలో మొత్తం మీద పదిన్నర లక్షల MSME రిజిస్ట్రేషన్ లు జరిగాయని నివేదికలో తెలిపారు. ఏతావాతా చూస్తే AP ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు కూడా ఇందుకు బాగా దోహదపడ్డాయని అర్ధం అవుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చంద్రబాబు ప్రభుత్వ టైమ్ లో పెండింగ్ లో ఉన్న సబ్సిడీ బకాయిలను సుమారు వెయ్యి కోట్లకు పైగా విడుదల చేశారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం వారికి ఇవ్వవలసిన రాయితీలను చాలావరకు ప్రభుత్వం ఇస్తూ వస్తోంది.
దాంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో ఉపాది పొందేవారికి రక్షణ కల్పించినట్లయింది. ఒక భారీ పరిశ్రమ పెట్టడానికి వేల కోట్లు అవసరం అవుతాయి. పరిశ్రమను నెలకొల్పడానికి సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది. వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటూనే చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తే లక్షల మదికి ఉపాధి కలుగుతుందన్నది ఆర్దిక రంగ నిపుణులు చెబుతారు.
దానికి అనుగుణంగా YSRCP ప్రభుత్వం చర్యలు తీసుకుందని భావించవచ్చు. ఆదాయ పన్ను రిటర్న్ లు దాఖలు చేసే స్థాయికి పద్దెనిమిది లక్షల మంది వెళ్లారంటే వారి ఆర్దిక స్తోమత పెరిగిందన్నమాట. దీనిని ఒక రకంగా సంపద సృష్టించడం అన్నమాట. అందులోను కొత్త పరిశ్రమలు నెలకొల్పి ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసే స్థితికి వచ్చారని అర్ధం చేసుకోవచ్చు. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా నిత్యం ఏపీలో అసలు ఏమీ జరగడం లేదని విషం చిమ్ముతుంటుంది.
వారు ఇలాంటి వార్తలను, అసలు నిజాలను కప్పిపుచ్చుతుంటారు. చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో సంపద అంటే రియల్ ఎస్టేట్ సంపదే అనే అభిప్రాయం కల్పించారు. అందులో ధనవంతులు మరింత ధనికులు అవడమే ఆ విదానం. కేవలం దళారులు బాగుపడడం అందులో జరుగుతుంది. కాని చిన్న పరిశ్రమలు ఎక్కువగా రావడం వల్ల పేద, మద్య తరగతివారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే GSDPలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి నాలుగు స్థానాలలో ఉంటోంది.
దానికి కారణం ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే అన్న విశ్లేషణ వస్తుంది. RBI మాజీ గవర్నర్ రఘురామరాజన్ దీనిని సమర్ధిస్తుంటారు. ఇందులో ఆయా స్కీముల కింద ప్రజల చేతులలోకి నేరుగా డబ్బు వెళ్లేటట్లు చేయడం, దీనివల్ల అవినీతి పూర్తిగా లేకుండా పోయి లబ్దిదారుల బ్యాంకు ఖాతాలలో సొమ్ము జమ అవుతుంది. ఈ డబ్బు పొందినవారంతా పేదలు, మధ్య తరగతి వారే కనుక దానిని పొదుపు చేసుకునే పరిస్థితి ఉండదు. వెంటనే వారు తమ అవసరాల కోసం మార్కెట్ లో వెచ్చిస్తారు. తద్వారా ఆయా ఉత్పత్తులకు గిరాకి పెరుగుతుంది.
వ్యాపారాలు అధికం అవుతాయి. తద్వారా పన్నులు కూడా ప్రభుత్వానికి జమ అవుతుంటాయి. ఇదంతా ఒక ప్రక్రియ. పైకి చూస్తే డబ్బు పంపిణీనే అనుకుంటారు. కాని ఇందులో లోతుగా పరిశీలిస్తే ఈ విషయాలు అర్ధం అవుతాయి. జగన్ చేపట్టిన మరో స్కీమ్ చేయూత కింద నలభై ఐదేళ్లు పైబడిన ప్రతి మహిళకు ఏడాదికి 18,750 రూపాయలు చొప్పున ఆర్దిక సాయం చేశారు. ఈ డబ్బును తీసుకున్నవారు వ్యాపారులు, కుటీర పరిశ్రమలు స్థాపించుకోవడానికి వీలుగా బ్యాంకులతో టై అప్ చేశారు. వారి ఉత్పత్తుల విక్రయానికి గాను రిలయన్స్, ఐటిసి తదితర మల్టి నేషనల్ సంస్థలతో టై అప్ చేశారు.
తద్వారా సుమారు నాలుగు లక్షల మంది యూనిట్లు నెలకొల్పుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది కూడా ఆర్ధిక అభివృద్దికి దోహదం చేసేదే. మరో అంశం చూద్దాం. జగన్ ప్రభుత్వం ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు సమకూర్చింది. అక్కడ ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టింది. సగటున గ్రామం, పట్టణం,నగరాలను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో లబ్దిదారుడికి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఆస్తి సమకూరింది. దీనిని లెక్క వేస్తే ఎన్ని వేల కోట్ల సంపద సృష్టించింది తెలుసుకోవచ్చు.
చంద్రబాబు టైమ్ లో ఇలాంటివి ఒక్కటైనా చేసి తాను సంపద సృష్టించానని చెప్పగలరా? లేదా ఆయన తరపున ప్రచారం చేసే రామోజీరావు ,రాధాకృష్ణ వంటివారు టీడీపీ తెచ్చిన సంపద ఏమిటో వివరించగలుగుతారా? ఇవే కాదు. స్కూళ్లు బాగు చేయడం, అక్కడ డిజిటల్ క్లాస్ లు పెట్టడం తదితర చర్యల వల్ల ఎన్ని లక్షల టీవీలు,ఇతర పరికరాలు కొనుగోలు చేశారో అంచనా వేసుకోండి.
అలాగే వేలాది స్కూళ్లను బాగు చేయడం ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించారు. గ్రామ,వార్డు సచివాలయాలను వేల సంఖ్యలో నిర్మించారు. రైతు భరోసా కేంద్రాలను, విలేజ్ క్లినిక్స్ ను కొత్త భవనాలు ఏర్పాటు చేసి నెలకొల్పారు. మరి అదంతా సంపద కింద రాదా? కేవలం అమరావతిలో ఒక ఏభై అంతస్థుల భవనం కడతామని, అది కట్టలేకపోయిన చంద్రబాబు ఏమో సంపద సృష్టించినట్లు ప్రచారం చేస్తుంటారు.
ప్రాక్టికల్‌గా గ్రామాలలో, నగరాలలో ప్రత్యక్షంగా కనిపించేలా సంపదను ప్రజలకు అందిస్తేనేమో జగన్ పై దుర్మార్గపు విష ప్రచారం చేస్తుంటారు. అదంతా విధ్వంసం అని అబద్దపు రాతలు రాస్తారు. అభివృద్ది పరంగా చూస్తే చంద్రబాబు టైమ్ లో నిర్మించలేకపోయిన ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, ఉద్దానం కిడ్నీ బాదితులకు ఆస్పత్రి, భారీ నీటి పధకం , విశాఖ అభివృద్ది , ఇన్ ఫోసిస్, అదాని డేటా సెంటర్, నక్కపల్లి ఫార్మాహబ్ మొదలైనవి జగన్ చేపట్టిన ప్రగతికి నిదర్శనంగా నిలుస్తాయి.
విద్యుత్ రంగంలో లక్ష మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తికి గాను మెరుగైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యక్షంగా అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వం వల్ల ఏపీ అభివృద్ది పధంలో సాగుతోందని చెప్పవచ్చు. అందుకే ఏపీలో ఆదాయపన్నుశాఖ చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వాస్తవాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఏపీ వ్యతిరేక మీడియా సంస్థలు జీర్ణించుకోలేకపోవచ్చు కానీ, ఆ రాష్ట్ర ప్రజలకు మాత్రం సంతోషం కలిగించే విషయమే అని చెప్పాలి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment