మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : మంచిర్యాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగనుంది. 10 జిల్లాల తెలంగాణను 24 జిల్లాలుగా విస్తరించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా జిల్లాల పునర్విభజన ఖాయమనే నేపథ్యంలో మంచిర్యాల జిల్లా తప్పనిసరి అనే వాదన తెరపైకి వచ్చింది. అదనంగా 14 జిల్లాల ఏర్పాటులో మంచిర్యాలకు చోటు లభించినట్లు సమాచారం. మంచిర్యాల జిల్లా అంశాన్ని ఇటీవల ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి తెరపైకి తీసుకురావడం.. కొత్త జిల్లాల జాబితాలో మంచిర్యాలకు స్థానం లభించడం ఈ ప్రాంత వాసుల్లో ఆనందం నింపింది.
దశాబ్దాల క్రితమే ప్రతిపాదన..
మంచిర్యాల జిల్లా డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి మంచి ర్యాల జిల్లాగా నామకరణం చేస్తూ కొన్ని సంఘాలు తమ కార్యకలాపాలు మంచిర్యాల జిల్లా పేరిట నిర్వహిస్తుండడం తెలిసిందే. ఎన్నికల సమయంలోనే తెరపైకి వచ్చే మంచిర్యాల జిల్లా ఏర్పాటు అంశం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో జిల్లాల పునర్విభజన జాబితాలో చోటు దక్కించుకోవడంతో స్థానికుల్లో ఆశలు రేకెత్తాయి.
తూర్పు జిల్లాకు మంచిర్యాలే కేంద్రం...
1905లో ఆదిలాబాద్ జిల్లా ఏర్పడింది. 1940 వరకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా కొనసాగుతూ వచ్చింది. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా మారింది. జిల్లా విస్తీర్ణం 16,128 కిలోమీటర్లు. జనాభా 29,35,967. భౌగోళికంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రం తూర్పు జిల్లాకు ఎంతో దూరంలో ఉంటుం ది. జిల్లాలోని 52 మండలాల్లో 26 మండలాలు తూర్పు జిల్లాలోనే ఉన్నాయి. జన్నారం నుంచి సిర్పూర్ వరకు ఉన్న ఈ మండలాల కు మంచిర్యాల నడిబొడ్డున ఉంటుంది. వేమనపల్లి మండల వాసులు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 280 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిందే. సామాన్యులకు ఇది భారంగా మారింది. జిల్లా కేంద్రంలోని వివిధ కార్యాలయాలకు పనుల నిమిత్తం ఇక్కడి నుంచి వె ళ్లే అధికారులు, ఉద్యోగులు, ప్రజలతోపాటు వివిధ పరీక్షలు, ఉద్యోగాల ఎంపిక కోసం వెళ్లే అభ్యర్థులకు దూరభారం సమస్యగా మారిం ది. ఈ నేపథ్యంలో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన మంచిర్యాలను జిల్లాగా చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఐదు నియోజకవర్గాలతో...
జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో మంచిర్యాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మంచిర్యాల, సిర్పూర్-కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాలు కొత్త జిల్లా పరిధిలోకి రానున్నాయి. ఈ నియోజకవర్గాల ప్రజలకు మంచిర్యాల జిల్లా కేంద్రంగా అన్ని విధాలుగా అనువుగా ఉంటుంది.
మంచిర్యాల జిల్లాపై ఆశలు
Published Sun, May 11 2014 12:25 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement
Advertisement