రెఢీ | Prepare a draft list of divisions | Sakshi
Sakshi News home page

రెఢీ

Published Thu, Oct 29 2015 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

రెఢీ

రెఢీ

డివిజన్ల ముసాయిదా జాబితా సిద్ధం
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తొలి అంకం

 
సిటీబ్యూరో:  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరలేచింది. డివిజన్ల పునర్విభజన ముసాయిదా బుధవారం విడుదలైంది. దీని ప్రకారం కొన్ని నియోజకవర్గాల పరిధిలో డివిజన్లు పెరుగుతుండగా... మరికొన్ని నియోజకవర్గాల్లో తగ్గుతున్నాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టడంతో శివారు ప్రాంతాల్లోని డివిజన్ల సంఖ్య పెరుగుతుండగా... కోర్‌సిటీ, పాతబస్తీల్లో తగ్గుతున్నాయి. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 49 డివిజన్లు ఉండగా... ఈ సంఖ్య 39కి తగ్గనుంది. అంటే ఏకంగా పది డివిజన్లు తగ్గుతున్నాయి. హైదరాబాద్ లోక్‌సభ స్థానం(పాతబస్తీ) పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో డివిజన్ల సంఖ్య 50 నుంచి 43కు త గ్గుతోంది.  మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది డివిజన్లు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 39 డివిజన్లు ఉండగా...ఈ సంఖ్య 49కి పెరగనుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల బలాబలాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 11 డివిజన్లు ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ 8 డివిజన్లు  ఉన్నాయి. ఉప్పల్ నియోజకవర్గంలో డివిజన్లు 7 నుంచి 10కి పెరగనున్నాయి. దీంతో సహజంగానే వివిధ రాజకీయ వర్గాల్లో అలజడి మొదలైంది. కొత్తగా ఏర్పాటవుతున్న డివిజన్లలోనూ తమకు పట్టున్నవేవో... పట్టులేనివి ఏవో తేల్చుకునే పనిలో పార్టీలు తలమునకలవుతున్నాయి.

గందరగోళం..
డివిజన్లు గందరగోళంగా ఏర్పాటు చేశారనే ఆరోపణలు అప్పుడే మొదలయ్యాయి. ముషీరాబాద్  నియోజకవర్గంలోని కొత్త డివిజన్లలో రహదారులు, బస్తీలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయంటున్నారు. కొత్తపేట డివిజన్‌లో ఎంతో దూరంగా ఉన్న బస్తీలను కలిపారని.. దీని వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఖైరతాబాద్‌లోనూ ఒకదానికొకటి పొంతన లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు.
 
 
జూబ్లీహిల్స్: రెండుగా శ్రీనగర్ కాలనీ

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉండే శ్రీనగర్ కాలనీని రెండుగా చీల్చారు. కొంతభాగాన్ని సోమాజిగూడ, మరికొంత ప్రాం తాన్ని యూసుఫ్‌గూడలో కలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోకి సోమాజిగూడ.. జాబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోకి యూసుఫ్‌గూడ వచ్చింది. ఒకే డివిజన్ రెండు నియోజకవర్గాల్లో విస్తరించడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శ్రీనగర్ కాలనీ డివిజన్‌ను తొలగించడంతో డివిజన్ల సంఖ్య ఆరుకు చేరుకుంది.
 
 రాజేంద్రనగర్...

 రాజేంద్రనగర్ సర్కిల్‌ను ఐదు డివిజన్‌లుగా విభజించారు. గతంలో నాలుగు డివిజన్లు ఉండగా...కొత్తగా ఒకటి చేరింది. శివరాంపల్లి డివిజన్ కనుమరుగైంది. సూలేమాన్‌నగర్, శాస్త్రీపురం రెండు నూతన డివిజన్లుగా ఏర్పడ్డాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ల పేర్లే కొనసాగనున్నాయి.
 
 ముషీరాబాద్: సంబంధం లేకుండా చేశారు
 సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గంలో గతంలో ఎనిమిది డివిజన్లు ఉండగా... ప్రస్తుతం ఆరుకు కుదించారు. దోమలగూడ, బాగ్‌లింగంపల్లి డివిజన్లను మాయం చేశారు. బాగ్‌లింగంపల్లి డివిజన్‌ను అడిక్‌మెట్, రాంనగర్, గాంధీనగర్ డివిజన్లలో కలిపారు. దోమలగూడను కవాడిగూడ, గాంధీనగర్‌లలో విలీనం చేశారు. ఈ మార్పులు, చేర్పుల వల్ల రహదారులు, బస్తీలు ఒకదానికొకటి సంబంధం లేకుండా పోయాయి. వార్డుల పునర్విభజనపై స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం కొసమెరుపు.
 
 సనత్‌నగర్: రెండు డివిజన్లు గల్లంతు..

 సనత్ నగర్ నియోజకవర్గంలో పద్మారావు నగర్, బల్కంపేట డివిజన్లు తొలగించారు. ఇందులో కొంతభాగాన్ని సనత్‌నగర్‌లో, మరికొంత ప్రాంతాన్ని అమీర్‌పేట డివిజన్‌లో కలిపారు. ఎల్లమ్మ దేవాలయం అమీర్‌పేట డివిజన్‌లోకి వస్తోంది. బల్కంపేటను డివిజన్‌గా కొనసాగించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆ అవకాశం కల్పించకపోవడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సెటిలర్స్ ఎక్కువగా ఉన్న పద్మారావు నగర్‌లో కొంత భాగాన్ని బన్సీలాల్‌పేటలో, మరికొంత ఏరియాను రాంగోపాల్‌పేటలో విలీనంలో చేశారు. మొన్నటి వరకు ఏడు డివిజన్లు ఉండగా.. తాజాగా ఐదుకు పరిమితం చేశారు.
 
 అంబర్‌పేట: బీజేపీకి ఇబ్బందులే
 అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలో ఏడు డివిజన్లు ఉండగా... వీటిలో కాచిగూడ, విద్యానగర్ డివిజన్లు మాయమయ్యాయి. బీజేపీ కి పట్టున్న బస్తీలను విచ్ఛిన్నం చేయడంతో ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. విద్యానగర్ డివిజన్‌లోని కొన్ని బస్తీలను నల్లకుంట, బాగ్‌అంబర్‌పేట్ డివిజన్లలో కలిపారు. కాచిగూడ డివిజన్‌లో కొంత భాగాన్ని బర్కత్‌పుర, గోల్నాకలో కలిపారు.   
 
 ఖైరతాబాద్: లోపించిన శాస్త్రీయత
 ఖైరతాబాద్ నియోజకవర్గంలో పంజగుట్టకు స్థానం దక్కలేదు. బంజారాహిల్స్ డివిజన్‌ను రెండుగా చీల్చి... బంజారాహిల్స్, కొత్తగా వేంకటేశ్వర కాలనీ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. వీటి స్వరూపాలు శాస్త్రీయంగా లేవు. బంజారాహిల్స్ డివిజన్‌లో ప్రేమ్‌నగర్‌ను చేర్చారు. వాస్తవంగా ప్రేమ్‌నగర్‌తో బంజారాహిల్స్‌కు సంబంధం లేదు. సోమాజిగూడ డివిజన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన శ్రీనగర్ కాలనీ డివిజన్‌లోని కొంత భాగాన్ని కలిపారు. అసలు సోమాజిగూడకు.. శ్రీనగర్ కాలనీకి పొంతనే లేదు. పైగా ఈ రెండు ప్రాంతాలు వేర్వేరు నియోజకవర్గాల పరిధిలోకి వెళ్తాయి.
 
 మల్కాజిగిరి: యాప్రాల్ గల్లంతు
 మల్కాజిగిరిలో ఇప్పటి వరకు అల్వాల్, మచ్చబొల్లారం, యాప్రాల్, డిఫెన్స్ కాలనీ, మౌలాలీ, సఫిల్‌గూడ, ఓల్డ్ మల్కాజిగిరి, గౌతమ్‌నగర్ (మొత్తం 8) డివిజన్లు ఉన్నాయి. పునర్విభజనతో డివిజన్ల సంఖ్య 9కి పెరిగింది. అవి.. వెంకటాపురం, అల్వాల్, మచ్చబొల్లారం, నేరేడ్‌మెట్, వినాయక్ నగర్, మౌలాలీ, మల్కాజిగిరి, ఈస్ట్ ఆనంద్‌బాగ్, గౌతమ్‌నగర్తాజాగా యాప్రాల్ డివిజన్ ఉనికిని కోల్పోయింది. దీనిని మల్కాజిగిరిలో కలపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
 
 ఉప్పల్ : చిలుకానగర్ పై అభ్యంతరాలు
 సాక్షి,సిటీబ్యూరో: ఉప్పల్ నియోజకవర్గంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఉప్పల్, కాప్రా, ఏఎస్‌రావు నగర్, చర్లపల్లి, మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీ, మల్లాపూర్, నాచారం, చిలుకానగర్, హబ్సిగూడ, రామంతాపూర్ మొత్తం 10 డివిజన్‌లు యధాతథంగా ఉన్నాయి. ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి కాప్రా వరకు ఉన్న చిలుకానగర్ డివిజన్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు  ఉప్పల్ డివిజన్‌లో ఉన్న ప్రశాంత్ నగర్, కల్యాణిపురి, బ్యాంకు కాలనీ, బాలాజీ ఎన్‌క్లేవ్, ధర్మపురి కాలనీ, తదితర ప్రాంతాలను చిలుకానగర్‌లో కలపడంపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. {పస్తుతం ఉప్పల్‌లో ఉన్న దేవేందర్ నగర్ బస్తీతో పాటు కొన్ని ప్రాంతాలు రామంతాపూర్ డివిజన్‌లో కలపడం కూడా అభ్యంతరకరంగానే ఉంది.
 
 శేరిలింగంపల్లి: నాలుగు పెరిగాయి
 శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వార్డుల సంఖ్య ఆరు నుంచి పదికి పెరిగింది. గతంలో గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, హఫీజ్‌పేట్, కుందనగర్, హైదర్‌నగర్, వివేకానందనగర్ ఉండగా... ఇప్పుడు అదనంగా కొండాపూర్, మాదాపూర్, మియాపూర్, ఆల్విన్ కాలనీ డివిజన్‌లు ఏర్పడ్డాయి. ఐదారు కాలనీలు మినహా అంతా బాగానే ఉందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
 
 ఎల్‌బీనగర్: ఆ రెంటినీ కలపడమే సమస్య
 సాక్షి,సిటీబ్యూరో: నగర శివార్లలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో మొత్తం 11 డివిజన్లు ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియలో కొన్ని డివిజన్లలో పొరపాట్లు జరిగాయి. ప్రధానంగా కొత్తపేట్ డివిజన్‌కు దూరంగా ఉన్న భరత్‌నగర్, శివగంగా కాలనీలను కలపడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్‌లో హస్తినాపురం డివిజన్ కాలనీలు కలపడం, మన్సూరాబాద్ గ్రామాన్ని నాగోల్ డివిజన్‌లో కలపడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పునర్విభజనలో శాస్త్రీయత లోపించిందని ఆరోపిస్తున్నారు.

 మలక్‌పేటలో ఓకే..
 మలక్‌పేట్ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉన్నాయి. మూసారాంబాగ్, అక్బర్‌బాగ్, సైదాబాద్, ఆజంపురా, చావ్ని, ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్లలో స్వల్ప తేడాలు మినహా పొరపాట్లు లేవని స్థానికులు అంటున్నారు.
 
 గోషామహల్: ధూల్‌పేట్ మాయం
 అబిడ్స్:  గోషా మహల్ నియోజకవర్గంలో కొత్తగా రెండు డివిజన్లు తగ్గించి... ఆరు డివిజన్లను రూపొందించారు. 5వ సర్కిల్‌లోని ధూల్‌పేట్ డివిజన్‌లో సగభాగం బేగంబజార్‌లో, మిగతా భాగాన్ని గోషామహల్ డివిజన్‌లో కలిపారు. కొత్తగా అబిడ్స్, నాంపల్లి డివిజన్లను ఏర్పాటు చేశారు. సర్కిల్-8లోని చారిత్రాత్మక సుల్తాన్‌బజార్ పేరు మాయమైంది. కొత్తగా ఏర్పడిన అబిడ్స్ డివిజన్‌లో పాత సుల్తాన్‌బజార్ డివిజన్‌తో పాటు గన్‌ఫౌండ్రీ ఏరియా, బషీర్‌బాగ్, బిర్లామందిర్ ప్రాంతాలను కలిపారు. గోషామహల్ కొత్త డివిజన్‌లో జ్ఞాన్‌బాగ్‌కాలనీ, రజాక్‌పురా, చందన్‌వాడి, చాక్నావాడి, ఆర్యసమాజ్, షాహినాయత్‌గంజ్, కొత్తబస్తీ, మచ్చీపుర నుంచి జుమ్మెరాత్‌బజార్ వరకు కొంతభాగాన్ని కలిపారు.
 
 కూకట్‌పల్లి: అదనంగా రెండు
 కూకట్‌పల్లి నియోజకవర్గంలో వార్డుల సంఖ్య ఆరు నుంచి ఎనిమిదికి పెరిగింది. గతంలో కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, మోతీనగర్, ఫతేనగర్, పాత బోయిన్‌పల్లి, కూకట్‌పల్లి ఉండగా...తాజాగా అల్లాపూర్, బాలానగర్ డివిజన్లు ఏర్పడ్డాయి. కూకట్‌పల్లిలోని కొంత భాగం, పాత బోయిన్‌పల్లిలోని కొంత భాగం కలిసి బాలానగర్‌గా, మోతీనగర్ నుంచి కొంత భాగం, మూసాపేట నుంచి కొంత భాగం కలిసి అల్లాపూర్‌గా ఏర్పడ్డాయి. కేపీహెచ్‌బీలోని కొన్ని ప్రాంతాలు మూసాపేట డివిజన్‌లో కలిశాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాపారాయుడు నగర్, దీనబంద్ కాలనీ, హనుమాన్‌నగర్, అస్బెస్టాస్ కాలనీ, పాపిరెడ్డికాలనీలను కూకట్‌పల్లి డివిజన్‌లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ కొంత మంది స్థానికులు ఉప కమిషనర్‌కు వినతిపత్రాలు సమర్పించారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement