కొత్త జిల్లాల ఖరారు ఇంకా కొలిక్కిరాలేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పునర్విభజన చిక్కుముడిగా మారిన నేపథ్యంలో.. దీనిపై ప్రత్యేకంగా భేటీ కావాల ని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. ఈ క్రమంలోనే సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేసింది. ఇతర జిల్లాల పునర్విభజనపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖచిత్రం ఆధారపడి ఉండడం.. ఈ జిల్లాల విభజనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రత్యేక దృష్టి సారించినందున.. దీనిపై లోతుగా చర్చించకుండా దాటవేసింది.
* జిల్లా యూనిట్‌గా జిల్లాల పునర్విభజన
* అనంతగిరిలో తాత్కాలిక కలెక్టరేట్
* జిల్లా విభాగాలకు కార్యాలయాల అన్వేషణ
రంగారెడ్డి జిల్లా: ప్రస్తుత జిల్లా పరిధిలో మాత్రమే విభజన ప్రక్రియ జరగాలనే ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని కలెక్టర్ రఘునందన్‌రావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రంగారెడ్డి జిల్లాను ఎన్ని ముక్కలుగా చేసినా అభ్యంతరం లేదని, జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ఇతర జిల్లాల్లో కలిపాలనే ప్రతిపాదన సరికాదని పేర్కొంటూ ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో ప్రస్తావించిన అంశాన్ని ప్రభుత్వం ముందుంచారు.
ఒకవేళ ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే జిల్లా మూడు ముక్కలు కానుంది. ఈ పరిణామాలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విభజన సంక్లిష్టంగా మారడం.. ఈ జిల్లాల పునర్విభజన బ్లూప్రింట్ సీఎం కేసీఆర్ మదిలో ఉండడంతో లోతుగా చర్చించేందుకు అధికారవర్గాలు అంతగా ఆసక్తి చూపడంలేదు.
నాలుగు అంశాలపై చర్చ!
కొత్త కలెక్టరేట్లు, ఉద్యోగుల విభజన, రికార్డుల తరలింపు, మౌలిక సదుపాయాల కల్పనపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్తగా ఏర్పడే కలెక్టరేట్లకు రికార్డులను తరలించడంలో అవలంబించాల్సిన పద్ధతులపై సీఎస్ రాజీవ్‌శర్మ, సీసీఎల్‌ఏ రేమాండ్ పీటర్ ప్రత్యేక సూచనలు చేశారు.
ప్రస్తుత జిల్లాను రెండుగా విభజిస్తే.. ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాల్సివుంటుందని, అంతకంటే ఎక్కువ జిల్లాలు ఏర్పడితే మాత్రం ప్రభుత్వమే ఉద్యోగులను సర్దుబాటు చేస్తుందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో జిల్లా స్థాయి కార్యాలయాలకు అవసరమైన భవనాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆయా శాఖలధిపతులు (హెచ్‌ఓడీ) ప్రతిపాదిత జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలను అన్వేషించాలని స్పష్టం చేసింది.
కొత్త కలెక్టరేట్లకు రూ.80-100 కోట్లు
నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి రూ.80 -100 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం డివిజన్‌స్థాయి కార్యాలయాల్లోనే జిల్లా కార్యాలయాలు కొలువుదీరుతాయని, రంగారెడ్డి జిల్లా తాత్కాలిక కలెక్టరేట్‌ను అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ర ఘునందన్‌రావు సమావేశంలో చెప్పారు.
మండలాల్లో మార్పులు, చేర్పులు
మండలాల ప్రతిపాదనల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గత సమావేశంలో 11 మండలాలకు ప్రభుత్వం లైన్‌క్లియర్ చేసింది. అయితే, తాజాగా మండలాల పునర్విభజనలో కొత్త మార్గదర్శకాలు జారీ చేయడంతో దానికి అనుగుణంగా నూతన మండలాల జాబితాను జిల్లా యంత్రాంగం తయారు చేసింది.
ఈ మేరకు ఎల్‌బీనగర్, పెద్ద అంబర్‌పేట్/ అబ్దుల్లాపూర్‌మెట్, దుండిగల్, గండిపేట్/ నార్సింగి, జవహర్‌నగర్, కోట్‌పల్లి, బాలాపూర్/మీర్‌పేట్ ఉండనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. ప్రభుత్వ భూములు అంతంగా లేని పట్టణ మండలాల్లో కొత్త మండలాల ప్రతిపాదనలను జిల్లా యంత్రాంగం వెనక్కి తీసుకుంది.
రంగారెడ్డి జిల్లా ‘మూడు’ ముక్కలే!
Published Tue, Jun 21 2016 8:38 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
Advertisement
Advertisement