రూ.ఐదున్నర కోట్లకు గండిపై కలెక్టర్ సీరియస్
రూ.ఐదున్నర కోట్లకు గండిపై కలెక్టర్ సీరియస్
Published Thu, May 4 2017 11:55 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
- ‘సాక్షి’ కథనానికి స్పందన
- కలెక్టర్ ఎదుట రిజిస్ట్రేషన్ అధికారులు హాజరు
సాక్షిప్రతినిధి, కాకినాడ : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ఐదున్నర కోట్లకు గండి కొట్టిన అడ్డగోలు వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సీరియస్‌గా తీసుకున్నారు. సామర్లకోట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సమీపాన జగ్గమ్మవారిపేట, భీమవరంలో 86212.50 గజాలు రిజిస్ట్రేషన్‌లో విలువను తగ్గించి చూపించారు. దీనిపై విచారించి ఒకటికి మూడింతలు స్టాంప్ డ్యూటీ చెల్లించాలంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ గత డీఐజీ సాయిప్రసాద్, ఆడిట్ డీఆర్ విజయలక్ష్మి నోటీసులు ఇవ్వడం, వాటిని ఇటీవల అధికారులు అడ్డగోలుగా రద్దు చేయడం తెలిసిందే. స్టాంప్ డ్యూటీ ఐదున్నర కోట్లకు గండి పడిన వ్యవహారాన్ని ఆధారాలతో సహా ‘సాక్షి’లో ఈ నెల 3వ తేదీన ‘రూ.ఐదున్నర కోట్లకు గండి’ శీర్షికన వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథనం రిజిస్ట్రేషన్ వర్గాల్లో గుబులు రేకెత్తించింది. ఈ కథనంపై జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గురువారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ లక్ష్మీకుమారి, ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ షేక్ సఫీఉద్ధీన్‌లను తన కార్యాలయానికి పిలిపించి వివరాలు సేకరించినట్టు తెలిసింది. అసలు ఆ స్థలం రిజిస్ట్రేషన్ విలువ ఎందుకు తగ్గించి చూపించాల్సి వచ్చింది, ఆ స్థలంలో ఉన్న నిర్మాణాలు, కార్యాలయాలకు తక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లించడంపై ఆరా తీసి, అందుకు సంబంధించిన రికార్డులను కూడా పరిశీలించారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. డాక్యుమెంట్‌లో చూపించిన డోర్ నంబర్ ఆధారంగా గజం రూ.3000లుండగా, రూ.1500లుగా ఎందుకు తగ్గించి చూపించారని ప్రశ్నించారు. గతంలో రెండు, మూడు పర్యాయాలు అధికారులు వెళ్లి ఆ స్థలాన్ని పరిశీలించి గజం మూడు వేలుగా నిర్థారించారు. దీనిపై స్థల యజమానికి కోటి రూ.70 లక్షలకు మూడింతలు పెంచి చెల్లించాలని ఆదేశాలు జారీచేయగా, ఇప్పటి అధికారులు చెల్లించనవసరం లేకుండా ర్యాటిఫికేషన్ చేయడంపై ఆరా తీశారని తెలిసింది. ఈ వ్యవహారంపై కలెక్టర్ కార్తికేయ ఏమి చేస్తారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అబ్బే దానికోసం కాదండీ...
కాగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు మాత్రం ఆ వ్యవహారం కోసం తాము వెళ్లలేదనే వాదన వినిపిస్తున్నారు. తాము వెళ్లింది అనామినస్ (పంట పొలాలను ఇళ్ల స్థలాలుగా మార్పు చేసినప్పుడు తిరిగి పంట పొలాలుగా గుర్తించి రిజిస్ట్రేషన్ చేయాలని కోరడం) కోసమే కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లామంటున్నారు. జిల్లా యంత్రాంగం దీనిపై సమగ్ర విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.
Advertisement